టీకా తిప్పలు

ABN , First Publish Date - 2021-07-31T04:02:17+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. వ్యాక్సిన్‌ నిల్వలు లేకపోవడంతో అధికారులు పరిమిత సంఖ్యలో టీకాలు వేస్తున్నారు. మరోవైపు రోజు రోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు, థర్డ్‌ వేవ్‌ ముంచుకొస్తుందన్న ప్రచారంతో వ్యాక్సిన్‌కు డిమాండ్‌ పెరిగింది. వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు.

టీకా తిప్పలు
జిల్లా ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్‌ కోసం బారులు తీరిన జనం (ఫైల్‌)

వేధిస్తున్న వ్యాక్సిన్‌ నిల్వల కొరత

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌తో ఇబ్బందులు

రోజుల తరబడి వేచి చూస్తున్న ప్రజలు

కేసులు పెరుగుతుండడంతో వ్యాక్సిన్‌కు డిమాండ్‌

మంచిర్యాల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. వ్యాక్సిన్‌ నిల్వలు లేకపోవడంతో అధికారులు పరిమిత సంఖ్యలో టీకాలు వేస్తున్నారు. మరోవైపు రోజు రోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు, థర్డ్‌ వేవ్‌ ముంచుకొస్తుందన్న ప్రచారంతో వ్యాక్సిన్‌కు డిమాండ్‌ పెరిగింది.  వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రకటించగా అందులో మంచిర్యాల జిల్లా కూడా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. పాజిటివ్‌ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్న జిల్లాల్లో రెండు డోసులు వేయాలన్న హెల్ట్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో తిరిగి ఫస్ట్‌ డోసును ప్రారంభించారు.  శుక్రవారం జిల్లాలోని 24 కేంద్రాల్లో టీకాలు వేశారు. ఐదు వేల మందికి లక్ష్యం కాగా 2,591 మందికి వ్యాక్సిన్‌ వేశారు.

ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఉంటేనే

జిల్లాలో మొదటి డోసు వ్యాక్సిన్‌ ప్రారంభించినప్పటికీ ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వారికే వేస్తున్నారు. టీకాలు కావాలనుకునే వారు ముందుగా స్లాట్‌ బుకింగ్‌ ద్వారానే రిజిస్ట్రేషన్‌ చేసుకోవలసి ఉంటుంది. వ్యాక్సిన్‌ నిల్వలను బట్టి ఆసుపత్రుల వారీగా అధికారులు టీకాలను కేటాయిస్తున్నారు. టీకాల సంఖ్యకు అనుగుణంగానే ఆన్‌లైన్‌లో స్లాట్లను కేటాయిస్తున్నారు. పీహెచ్‌సీల్లో పరిమిత సంఖ్యలో 100 మందికి నేరుగా రిజిస్ట్రేషన్లు టీకాలు వేస్తుండగా, చెన్నూర్‌, లక్షెట్టిపేట, బెల్లంపల్లిలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌, పాత మంచిర్యాల, షంశీర్‌నగర్‌, దీపక్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌సెంటర్లతోపాటు నస్పూర్‌, మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ ద్వారా 100 నుంచి 150 వరకు, జిల్లా ఆసుపత్రిలో 200 మందికి పైగా రోజూ వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. 

7 గంటలు దాటితే నో బుకింగ్‌

ప్రతీ రోజు ఉదయం 5 గంటలకు ఆన్‌లైన్‌లో స్లాట్ల బుకింగ్‌ ప్రారంభమవుతుండగా రెండు గంటలు మాత్రమే వ్యవధి ఇస్తున్నారు. 7 గంటలు దాటితే ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ కావడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. అది కూడా ఏ రోజుకారోజు బుకింగ్‌ ప్రక్రియ ఉండటంతో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఫోన్లలో స్లాట్ల బుకింగ్‌ కోసం ప్రజలు ఆరాటపడుతున్నారు. వ్యాక్సిన్‌ కోసం ప్రజలు కొవిన్‌ వెబ్‌సైట్‌, ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకొని షెడ్యూల్‌ను ఎంపిక చేసుకొని, స్లాట్‌ బుక్‌ చేసుకోవలసి ఉంటుంది.  దీంతో రోజుల తరబడి స్లాట్‌ బుకింగ్‌ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్లాట్‌ బుకింగ్‌లో కొంచెం ఆలస్యమైనా మరుసటి రోజు ప్రయత్నించాల్సి వస్తోంది. అలా ముందుగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికే వ్యాక్సిన్‌ దొరికే అవకాశాలు ఉన్నాయి. 

జిల్లాలో 65 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి

జిల్లా వ్యాప్తంగా 65 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 2 లక్షల 25 వేల 705 మందికి వ్యాక్సిన్లు వేశారు. అందులో లక్షా 74 వేల 222 మందికి మొదటి డోసు టీకా వేయగా, 51వేల 183 మంది రెండో డోసు తీసుకున్నారు. మరో 35 శాతం టీకాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలోనే నూరు శాతం లక్ష్యాలు సాధించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. 

స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి

డా.ఫయాజ్‌ఖాన్‌, వ్యాక్సినేషన్‌ జిల్లా అధికారి

కొవిడ్‌ టీకా తీసుకోవాలనుకునే వారు ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవడం తప్పనిసరి. స్లాట్‌ బుకింగ్‌ లేకుండా ఆసుపత్రులకు వెళ్లినా ఫలితం ఉండదు. వ్యాక్సిన్‌ నిల్వలు సరిపడా ఉన్నప్పుడు స్లాట్ల సంఖ్య కూడా పెంచడం జరుగుతుంది. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న వారు సమయానికి వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు వెళ్లి టీకా తీసుకోవచ్చు. స్లాట్‌ బుకింగ్‌ సమయానికి ముందు వెళ్లి గంటల తరబడి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. 

మంచిర్యాల ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో ఎమ్మెల్యే, ఆయన  కుటుంబ సభ్యులు ఈ నెల 27న పరీక్షలు చేయించుకోగా ఎమ్మెల్యే సతీమణి రాజమణికి పాజిటివ్‌ రాగా, మిగతా వారికి నెగెటివ్‌ వచ్చింది. అనంతరం ఈనెల 29న లక్షణాలు ఉండటంతో తిరిగి పరీక్షలు చేయించుకోగా ఎమ్మెల్యేతోపాటు కోడలు, మనువడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యేతోపాటు కుటుంబ సభ్యులు హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సలహాల మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఇప్పటికే రెండు డోసులు కరోనా టీకా వేయించుకొన్నారు. తామంతా క్షేమంగా ఉన్నామని, ప్రజల ఆశీర్వాదంతో త్వరలోనే కోలుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా తనను కలిసిన ప్రజలు, నాయకులు, పార్టీ కార్యకర్తలు లక్షణాలు ఉంటే వెంటనే కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.      




 

Updated Date - 2021-07-31T04:02:17+05:30 IST