కరోనా విలయ తాండవం

ABN , First Publish Date - 2021-04-19T06:19:08+05:30 IST

పట్టణంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతున్నాయి. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు ఆధ్వర్యంలో మళ్లీ కంటైన్మెంట్‌ జోన్లుగా శనివారం రాత్రి ప్రకటించారు.

కరోనా విలయ తాండవం
కనిగిరిలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్‌ జోన్‌

నానాటికి విస్తరిస్తున్న కొత్త కేసులు    

మళ్లీ కంటైన్మెంట్‌ జోన్ల ఏర్పాటు  

కనిగిరి, ఏప్రిల్‌ 18: పట్టణంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతున్నాయి. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు ఆధ్వర్యంలో మళ్లీ కంటైన్మెంట్‌ జోన్లుగా శనివారం రాత్రి ప్రకటించారు.  పట్టణంలోని పోలిరెడ్డి బజార్‌, కాశిరెడ్డి బజార్‌, సుభా్‌షరోడ్డు, వైఎస్సార్‌రోడ్డులోని ఏబీఎం స్కూల్‌ రోడ్డు, కరణం బజార్‌, ఇందిరా కాలనీ, పెరుమాళ్లవారి వీధి ప్రాంతాల్లో బారికేట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. కంటైన్మెంట్‌ జోన్‌ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి బ్లీచింగ్‌ చల్లించారు. అయితే పట్టణంలోని పెరుమాళ్లవారి వీధిలో పారిశుధ్య పనులు చేపట్టకపోగా, నాలుగు రోజుల నుంచి పారిశుధ్య కార్మికులు విధులకు రావడం లేదు. దీంతో మురుగు కాల్వల్లో చెత్త, నివేశాల్లోని పొడిచెత్త నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

రెండోవిడత వారికే ప్రాధాన్యత 

పామూరు : కరోనా టీకా రెండవ విడత వ్యాక్సినేషన్‌ చేయించుకునే వారికే మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు డాక్టర్‌ పి.రాజశేఖర్‌ తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ కొరత వలన మూడు రోజుల నుంచి టీకాలు వేయడం లేదని, సోమవారం నుంచి రెండవసారి టీకా వేయించుకునే వారికి మొదటి ప్రాధాన్యత కల్పించి మిగిలిన వారికి ప్రాధాన్యత క్రమంలో టీకాలు వేస్తామన్నారు. 

దర్శి  : నియోజక వర్గంలో కరోనా రెండవ దశ వ్యాప్తి తీవ్రంగా ఉంది. గతంలో కంటె వేగంగా కేసులు పెరుగుతున్నాయి. నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. రెండవదశలో ఇప్పటి వరకు నియోజక వర్గంలో 145 మందికి కరోనా సోకగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. అయినా ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. మాస్కులు కూడా పెద్దగా ధరించడం లేదు. అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం కానీ, నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు. ఇటీవల జరిగిన తిరునాళ్ల ఉత్సవాలకు వేలసంఖ్యలో ప్రజలు గుమి కూడినప్పటికి అధికారులు పట్టించుకోలేదు. నియంత్రణ చర్యలు లేకపోవడంతో కరోనా వృద్ధి చెందుతోందన్న భావన నెలకొంది, కోరానా వాక్సిన్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

కురిచేడు : మండలంలో కొవిడ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తిరునాళ్లు, విందు వినోదాలకు హద్దులు లేకపోవడం, ప్రజల్లో ఏమి కాదులే అనే భావనతో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ వేయించుకుందామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వారికి వాక్సిన్‌ లేదనే వార్త నిరుత్సాహాన్ని గురి చేస్తోంది. 45 సంవత్సరాలు దాటిన అందరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జాబితాల్లో మండలంలో వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 4800 మంది ఉన్నారు. వాస్తవంగా అయితే అంతకు మూడురెట్లు ఉంటారు. అయితే ఇప్పటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పంచాయతీ కార్యాలయాల్లో 2050 మందికి   మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు. మండలంలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురై వ్యాక్సిన్‌ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరుగెడుతున్నారు. అయితే అక్కడ వ్యాక్సిన్‌ లేకపోవడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఈ నెల 14 నుంచి మండలంలో వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. ఆదివారం సాయంత్రానికి కూడా వ్యాక్సిన్‌ పీహెచ్‌సీలకు చేరలేదు. ప్రజలు వ్యాక్సిన్‌ కోసం తిరిగి తిరిగి వెనక్కు వెళుతున్నారు. ఇక మండలంలో ఇప్పటి వరకు 22 కొవిడ్‌ కేసులు కొత్తగా బయటపడ్డాయి.  ఒకరు మృతి చెందారు. దీంతో మండల వాసుల్లో ఆందోళన నెలకొంది.

తాళ్లూరు : మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో ఆదివారం ఒక్కరోజే కరోనాతో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఒక ఉపాధ్యాయుడు 20 రోజుల నుంచి కరోనా చికిత్స పొందుతూ ఉదయం రిమ్స్‌లో మృతిచెందారు. మరో వ్యక్తి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గ్రామంలో ఒకే రోజు ఇద్దరు కరోనా వ్యాధితో మృతి చెందడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామం వ్యాపార వాణిజ్య కేంద్రం కావడంతో నిత్యం పలుగ్రామాల నుంచి ప్రజలు రాక పోకలు సాగిస్తున్నారు. గ్రామంలో పదుల సంఖ్యలో కరోనా బాధితులు  ఉన్నట్లు సమాచారం. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడంతోనే నానాటికి బాధితుల సంఖ్య పెరుగుతోంది. అధికారులు స్పందించి గ్రామంలో కొవిడ్‌ నివారణకు కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కందుకూరు, ఏప్రిల్‌ 18 : పట్టణంలో కరోనా మరో ఇద్దరిని బలి తీసుకుంది. పోతురాజు మిట్ట కూడలి సమీపంలో నివసించే ఓ వ్యక్తి (57) శనివారం రాత్రి కరోనాతో ఒంగోలు రిమ్స్‌లో మృతిచెందాడు. ఆదివారం మధ్యాహ్నం ప్రకాశం కాలనీకి చెందిన యువకుడు (42) కరోనాతో మృతిచెందాడు. ఆ యువకుడు రెండు రోజులుగా కరోనాతో బాధపడుతూ పరిస్థితి విషమించటంతో చనిపోయాడు. దీంతో కరోనా రెండవ దశలో పట్టణంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకి చేరింది. తొలి మరణం రెవెన్యూ కాలనీలో నమోదు కాగా ఆ తర్వాత రెండు రోజులకే మాజీకౌన్సిలర్‌ దివి శివలింగప్రసాదు మృతిచెందాడు. వైద్యపరీక్షలు నిర్వహిస్తే ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ  అవుతుండటం, రెండు మూడు రోజులకే మృత్యు ఒడికి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. 

ప్రాంతీయ ఆస్పత్రిలో నిండుకున్న బెడ్‌లు

మరోవైపు కందుకూరు ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు కేటాయించిన బెడ్లు నిండుకున్నాయి.  ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న 23 బెడ్లు నిండిపోవటం, పెద్ద సంఖ్యలో కరోనా పేషెంట్లు చికిత్స కోసం వస్తుండడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పట్టణ ంలోని కరోనా పేషెంట్లుకి చికిత్సలు చేస్తున్న ఐదు ఆస్పత్రులు కరోనా పేషెంట్లతో నిండాయి. దీంతో బాధితులు ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు.

కంటైంన్మెంట్‌ జోన్‌లు ప్రకటన 

 పట్టణంలో మరణాలు సంభవించిన ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్‌లుగా ప్రకటించినట్లు మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌, తహసీల్దార్‌ సీతారామయ్య ప్రకటించారు. కంటైన్మెంట్‌ జోన్‌లలో కరోనా నిర్థారణ  పరీక్షలు చేయించడంతో పాటు ప్రైమరీ కాంటాక్టులను హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండేలా చూస్తున్నామన్నారు.

Updated Date - 2021-04-19T06:19:08+05:30 IST