ఒక్కరోజే 102 కేసులు

ABN , First Publish Date - 2022-01-20T05:31:05+05:30 IST

మణుగూరు పట్టణ, కార్మిక కాలనీల్లో కరోనా విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది.

ఒక్కరోజే 102 కేసులు
సింగరేణి ఏరియా ఆసుపత్రి

మణుగూరులో విజృంభిస్తున్న కరోనా

అశ్వారావుపేటలో పెరుగుతున్న పాజిటివ్‌ల సంఖ్య

నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న ప్రజలు

మాస్క్‌లు లేకుండా యథేచ్ఛగా పనులు

మణుగూరు/ అశ్వారావుపేట, జనవరి 19: మణుగూరు పట్టణ, కార్మిక కాలనీల్లో కరోనా విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. సింగరేణి కాలరీస్‌ మణుగూరు ఏరియాలోని ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో బుధవారం ఒక్క రోజే 76 కేసులు పాజీటీవ్‌గా రావడం ఇక్కడ కరోనా వ్యాప్తిని బహిర్గతం చేస్తుంది. ఇప్పటి వరకు జనవరి నెలలోనే సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిధిలో ఇప్పటి వరకూ 184 క రోనా పాజిటీవ్‌ కేసులు నమోదయినట్లు సమాచారం. దీంతో సింగరేణి యాజమాన్యం, ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. సింగరేణి కాలనీల్లో కరోనా నివారణ చర్యలను తెలుపుతూ ప్రచారం ఆరంభించారు. ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్‌ను కరోనా రోగుల కొసం క్వారంటైన్‌ సెంటర్‌గా ఏర్పాటు చేశారు. ఇమణుగూరు ప్రభుత్వ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో కూడా పదుల సంఖ్యలో కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే నిర్వహించిన పరీక్షల్లో 17 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జనవరి నెలలో సుమారు 35 కేసులకు పైగా నమోదయినట్లు సమాచారం. కాగా పినపాక నియోజవర్గంలోని ఐదు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 53 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. కరోనా వచ్చిన వారు సొంత వైద్యంతోనే జనావాసాల మధ్య ఎలాంటి నిబంధనలు పాటించకుండా సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో కరోనా మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. కరోనా వ్యాధిగ్రస్థులు ఎలాంటి మాస్క్‌లు లేకుండా యథేచ్ఛగా సంచరిస్తుండటం వ్యాధి విజృంభణకు దారి తీస్తోంది. 

పేటలో రెట్టింపైన కొవిడ్‌ కేసులు

అశ్వారావుపేట మండలంలో కొవిడ్‌ కేసులు తీవ్రంగా ఉధృతమవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే మండలంలో ఏకంగా 26 కేసులు నమోదయ్యాయి. సోమ, మంగళవారం కంటే బుధవారం రెట్టింపు కేసులు నమోదయ్యాయి. అశ్వారావుపేట పీహెచ్‌సీ పరిధిలో 18, వినాయకపురం పీహెచ్‌సీలో 7, గుమ్మడపల్లి పీహెచ్‌సీలో ఒక కేసు నమోదయింది. వినాయకపురం పీహెచ్‌సీలో నమోదయిన ఏడు కేసుల్లో ఐదు కేసులు ఆసుపాకలో నమోదయ్యాయి. మంగళవారం కూడా ఆసుపాకలో రెండు కేసులు నమోదయ్యాయి. బుధవారం అదే గ్రామంలో ఏకంగా ఐదు కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కూడా ఆసుపాకలో 50కిపైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలోనే ఆసుపాకలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.


Updated Date - 2022-01-20T05:31:05+05:30 IST