కరోనా కమ్మేస్తోంది

ABN , First Publish Date - 2022-01-21T04:21:42+05:30 IST

అశ్వాపురం మండలంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

కరోనా కమ్మేస్తోంది
అశ్వారావుపేటలో కరోనా పరీక్షలు నిర్వహిస్త్ను వైద్యసిబ్బంది(ఫైల్‌)

రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య

పరీక్షలకు వెనుకాడుతున్న ప్రజలు

నిర్లిప్తతే తీవ్రతకు కారణమవుతోందంటున్న వైద్యులు

అశ్వాపురం/ అశ్వారావుపేట, జనవరి 20: అశ్వాపురం మండలంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గురువారం అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో 46 కేసులు నమోదయ్యాయి. సంక్రాంతి పండుగ అనంతరం పరీక్షల సంఖ్య పెరుగగా పాజిటివ్‌లు కూడా అదే సంఖ్యలో నమోదవుతున్నాయి. మూడు రోజులుగా మండల వ్యాప్తంగా 200 వరకూ కేసులు నమోదు కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవటం, లక్షణాలున్నా పరీక్షలు చేయించు కోకపోవడంతో కేసులు భారీగా నమోదు కావటానికి ప్రధాన కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు. శుభ,అశుభ కార్యాలకు, ప్రజాప్రతినిధుల పర్యటనలకు జనం అధికంగా హాజరుకావటం, మాస్క్‌లు ధరించక పోవటం వల్ల కరోనా పంజా విసురుతోంది. మరోవైపూ రెండు డోసులు తీసుకున్నాం తమకు ఏమికాదులే అనే భావన అన్ని వయస్సుల వారిలో బలంగా ఉండటంతో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోందని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ మైదాన ప్రాంతానికే పరిమితమైన కేసులు ఏజెన్సీ గ్రామాలకు కూడా విస్తరిస్తోంది. బుధవారం మారుమూల ఎలకలగూడెం పంచాయతీలో కేసులు నమోదు కావటం ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా వైద్యసిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు థర్డ్‌ వేవ్‌ పై ప్రజలను చైతన్య వంతులను చేసి కరోనా కట్టడికి మొదట్లోనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అశ్వారావుపేటలో 122 కేసులు

కరోనా కమ్మేస్తోంది. గురువారం అశ్వారావుపేట మండలంలో 122 కేసులు నమోదవడంతో ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సంక్రాంతి పండుగ అనంతరం మండలంలో కేసుల సంఖ్య పెరిగింది. అశ్వారావుపేట మండలంలో 39 కేసులు నమోదయ్యాయి. ఇందులో అశ్వారావుపేట పీహెచ్‌సీ పరిధిలో 29, గుమ్మడపల్లి పీహెచ్‌సీ పరిధిలో రెండు, వినాయకపురం పీహెచ్‌సీ పరిధిలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. వీటిలో పేరాయిగూడెం, ఆసుపాక గ్రామాలలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఎస్‌బీఐలో రెండు కేసులు నమోదవడం కలకలం సృష్టించింది. దమ్మపేట మండలంలో ఎనిమిది, ములకలపల్లిలో 36, చంద్రుగొండలో 16, అన్నపురెడ్డిపల్లిలో 23 కేసులు నమోదయ్యా యి. ప్రస్తుతం నియోజకవర్గంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 400కిపైగానే ఉన్నట్టు సమాచారం.

ప్రభుత్వ నియంత్రణ చర్యలు శూన్యం

కొవిడ్‌ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు శూన్యం. గ్రామాలలో, పట్టణంలో కనీసం బ్లీచింగ్‌, క్లోరినేషన్‌ చేయడం లేదు. ప్రజలు కూడా మాస్క్‌లు ధరించకుండానే బయట తిరుగు తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు కూడా బయట సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - 2022-01-21T04:21:42+05:30 IST