కలవరపెడుతున్న కరోనా

ABN , First Publish Date - 2022-01-18T05:22:36+05:30 IST

వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నా.. కరోనా పంజా విసురుతోంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవటంతో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.

కలవరపెడుతున్న కరోనా
వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది

రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

నిబంధనలు పాటించని ప్రజలు

వేడుకలకు భారీగా హాజరు

మాస్క్‌ ధరించడంలోనూ ఎడతెగని నిర్లక్ష్యం

అశ్వాపురం/ అశ్వారావుపేట జనవరి 17: వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నా..  కరోనా పంజా విసురుతోంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవటంతో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో 80 మందికి పరీక్షలు నిర్వహించగా 28 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అవడం గమనార్మం. సంక్రాతి పండుగ సందర్భంగా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారితో పాటు, శుభ, అశుభ కార్యాలకు జనం అధికసంఖ్యలో హాజరవుతుండటం, నిబంధనలు పాటించకపోవటంతో  కరోనా కేసులు పెరుగుతున్నట్లు వైద్యసిబ్బంది పేర్కొంటున్నారు. కాగా మండలంలోని మైదాన ప్రాంతంలో ఉన్న  అన్ని గ్రామాల పరిధిలో కేసులు నమోదు కావటం గమనించదగ్గ విషయం. సోమవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో అశ్వాపురం పోలీస్‌ స్టేషన్‌ లో ఇద్దరు సిబ్బందికి, మండలపరిషత్‌ కార్యాలయ అటెండర్‌కు పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కరోనా విజృంభిస్తోంది. అశ్వాపురంతో పాటు శివారు గ్రామాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ముఖ్యమైన పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిలో రెండు డోసులు తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం

నిబంధనలు పాటించాలి: మణికంఠరెడ్డి, మండల వైద్యాధికారి

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు పాటించాలి. వ్యాక్సిన్‌ వేయించుకోవాలి తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. భౌతికదూరం పాటించటంతో పాటు,శానిటైజరు వినియోగించాలి. పాజిటివ్‌ కేసుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కన్పిస్తున్నాయి. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.

అశ్వారావుపేటలో పెరుగుతున్న కేసులు

ప్రస్తుతం అశ్వారావుపేట మండలంలో నలభైకి పైగా కొవిడ్‌ బాధితులు ఉన్నట్టు అంచనా. వీరే కాక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకున్నవారు, అనుమానితులు ఇంకా ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం. అశ్వారా వుపేటలో ప్రతి రోజు నలుగురైదుగురిలో పాజిటివ్‌ లక్షణాలు కన్పిస్తున్నాయి. భోగి రోజు మండలంలో పది మందికి పాజిటివ్‌ వచ్చింది. వారంతా పండగకు హైదరబాద్‌ నుంచి వచ్చారు. సోమవారం రోజున ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. పేరాయిగూడెం పంచాయతీలో పాజిటివ్‌లు అధికంగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలోలా ప్రభుత్వం పాజిటివ్‌ సంఖ్యలను గ్రామాల వారీగా ప్రకటించకపోవడంతో పరిస్థితి చేయి దాటే ప్రమాముందని వైద్యులు అంటున్నారు. 

Updated Date - 2022-01-18T05:22:36+05:30 IST