సాయం.. ఊసేది?

ABN , First Publish Date - 2022-08-02T05:20:34+05:30 IST

వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన నాటినుంచి భవననిర్మాణ కార్మికులు గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

సాయం.. ఊసేది?

భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామంటూ..

కరోనా సమయంలో ప్రభుత్వం అట్టహాసంగా  ప్రకటనలు 

ప్రకటన చేసి రెండేళ్లు దాటినా సాయం శూన్యం

ఉమ్మడి జిల్లాలో రెండున్నర లక్షల మంది కార్మికుల ఎదురుచూపులు

  

కరోనా వల్ల చితికిపోయిన భవననిర్మాణ కార్మికులను ఆదుకుంటామని ప్రకటన చేసి నెలారెండు నెలలు కాదు.. ఏకంగా రెండు సంవత్సరాలు దాటింది. అయినా  కనీసం దాని ప్రస్తావన కూడా ప్రభుత్వం తేవడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు రెండున్నర లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు సాయం కోసం ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు తప్ప పాలకుల మనసు మాత్రం కరగడం లేదు. 


బాపట్ల, ఆగస్టు1(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన నాటినుంచి భవననిర్మాణ కార్మికులు గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. అర్థం పర్థం లేని ఇసుక విధానంతో నెలల తరబడి వారిని ఇక్కట్లకు గురిచేసింది. వెనువెంటనే ఉప్పెనలా వచ్చిపడిన కరోనా వారిని మరింత సంక్షోభంలోకి నెట్టింది. వేల కుటుంబాలు రెండు పూటల తిండికి కూడా కరోనా సమయంలో ఇబ్బందులు పడ్డారంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో వీరి వెతలపై విపక్షాలు పోరాటం చేయడంతో ప్రభుత్వం సాయం ప్రకటన చేయడంతో పాటు కార్మికశాఖ యంత్రాంగానికి నమోదు బాధ్యతలను అప్పజెప్పి వేగవంతం చేయాలని సూచించింది. ఈ ప్రకటనను నమ్మిన కార్మికులు వేలసంఖ్యలో కార్మికశాఖ కార్యాలయాల ముందు బారులుదీరి తమ పేర్లను రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఇదంతా జరిగి రెండు సంవత్సరాలైంది. ఇంతవరకు ఒక్క రూపాయి సైతం వారి ఖాతాల్లో జమ అవ్వలేదు. అప్పటి ఇసుక నిర్ణయాలు, కరోనా శాపం వారిని  ఇంకా వెంటాడుతుండడంతో ఇప్పటికీ అర్థాకలితో బతుకీడుస్తున్న కార్మికుల కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి.  


కరోనా తీవ్రంగా ఉన్న 2020 మే నెలలో..

కరోనా ఉధృతంగా ఉన్న మే నెలలో ఉమ్మడి జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కార్మికశాఖలో పేర్లు నమోదు చేసుకోని వారు వెంటనే చేసుకోవాలని కూడా ప్రభుత్వం సెలవిచ్చింది. అప్పటివరకు లక్షకు అటుఇటుగా కార్మికశాఖలో నమోదై ఉన్న కార్మికుల సంఖ్య ఈ ప్రకటనతో రెండు లక్షలు దాటింది. నిర్మాణ గుర్తింపు కార్డులు లేని వారికి కొత్త వాటిని అందించడంతో పాటు అప్పటికే ఉన్నవారికి ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసే ప్రక్రియను కూడా పెద్దఎత్తున చేపట్టారు.


అన్ని రంగాలు కోలుకున్నా..

కరోనా తదనంతర పరిణామాలతో అన్ని రంగాలు కొంతమేర కోలుకున్నప్పటికీ భవననిర్మాణ రంగాన్ని మాత్రం పాలకుల తప్పుడు  నిర్ణయాలు ఇప్పటికీ వెంటాడుతుండడంతో గత వైభవాన్ని అందుకోవడం లేదు. పారదర్శకత పేరిట తెచ్చిన కొత్త ఇసుక విఽధానం తలాతోక లేని నిర్ణయంగా మారి కార్మికులకు పనిదొరకడం కూడా గగనమై పోయింది. ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో నిర్మాణ రంగం కుంటుపడడంతో పరోక్షంగా ఈ ప్రభావం లక్షలాది కార్మికుల జీవితాలపై పడి నానా అగచాట్లు పడుతున్నారు.


అధికారిక లెక్కల ప్రకారమే రెండు లక్షల మంది..

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే రెండు లక్షలమంది దాకా భవన నిర్మాణ కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. అనధికారికంగా ఈ సంఖ్య రెండున్నర లక్షల దాకా ఉంటుందనేది అంచనాగా ఉంది. ఇప్పుడు కూడా వారి నమోదు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది కానీ ప్రభుత్వంవైపు నుంచి సాయం మాత్రం అందడం లేదు.


ప్రకటించడం.. మరిచిపోవడం..

ఏదైనా సంకటస్థితి ఎదురైనప్పుడు ఆర్భాటంగా ప్రకటించేయడం తర్వాత దాని ఊసే మరచిపోవడం ప్రస్తుత ప్రభుత్వానికి అలవాటుగా మారింది. రెక్కాడితే కాని డొక్కాడని  అసంఘటిత రంగ కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరి ఇంత దారుణంగా ఉండడం పట్ల ప్రతిపక్షాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏదైనా అంశంపై ప్రకటన విడుదల చేసిన తర్వాత విధివిధానాలు, నమోదు తదనంతర ప్రక్రియకు ఆరేడు నెలల సమయం పట్టడం సర్వసాధారణమని కానీ ఇలా రెండేళ్లు గడచినా ఆ ప్రకటన ఊసే మరచిపోవడం పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సాయం అందించి తమను ఆదుకోవాలని నిర్మాణ రంగ కార్మికులు వేడుకుంటున్నారు.


Updated Date - 2022-08-02T05:20:34+05:30 IST