మృత్యుఘోష వినేదెవరు..?

ABN , First Publish Date - 2021-05-17T06:41:30+05:30 IST

బెడ్డు దొరక్క, ఆక్సిజన అందక రోజూ జిల్లాలో ఎంతోమంది చనిపోతూనే ఉన్నారు. వారి కుటుంబికులు, బంధువులు గుండెలు బాదుకుని, రోదిస్తూనే ఉన్నారు. బాధితుల చావుకేకలు, వారి కుటుంబికులు ఆర్తనాదాలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి.

మృత్యుఘోష వినేదెవరు..?

పిట్టల్లా రాలిపోతున్న కరోనా బాధితులు   

అయినా అడ్డుకట్టకు చర్యలు శూన్యం 

నెలన్నర వ్యవధిలో అధికారికంగా 181 మంది మృత్యువాత

అనధికారిక అంచనా రెండు రెట్లుపైమాటే 

యథేచ్ఛగా ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

బెడ్లు లేవంటున్న అధికారులు 

అధికార పార్టీ నేతల సిఫార్సులకే పెద్దపీట

కరోనా బాధితుల బాధలు వర్ణనాతీతం 

అధికారులు, పాలకుల 

వైఖరిపై వెల్లువెత్తుతున్న ఆక్రోశం


అనంతపురం, మే16(ఆంధ్రజ్యోతి): బెడ్డు దొరక్క, ఆక్సిజన అందక రోజూ జిల్లాలో ఎంతోమంది చనిపోతూనే ఉన్నారు. వారి కుటుంబికులు, బంధువులు గుండెలు బాదుకుని, రోదిస్తూనే ఉన్నారు. బాధితుల చావుకేకలు, వారి కుటుంబికులు ఆర్తనాదాలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఇవేవీ పాలకులు, అధికారులకు వినిపించడం లేదా? వారికి కనిపించడం లేదా? ఏం చేస్తున్నట్లు, ఎవరి కోసం పనిచేస్తున్నట్లు? ఈ దుర్భర పరిస్థితికి కనీసం అడ్డుకట్ట వేయాలన్న ఆలోచన కూడా వారు చేయలేకపోతున్నారంటే.. వారిని ఏమనాలి?

జిల్లాలో కరోనా బాధితుల్లో కొందరు ప్రాణవాయువు అందక ఊపిరాగిపోతుండగా... సకాలంలో వైద్యమందక మరికొందరు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా సెకెండ్‌వేవ్‌ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకూ అంటే 45 రోజుల్లో అధికారిక గణాంకాల మేరకు... 181 మంది మృత్యువాత పడ్డారు. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉండొచ్చన్న అంచనా. దీన్నిబట్టి చూస్తే... జిల్లాలో కరోనా మృత్యుఘంటికలు మోగుతున్నాయనడంలో సందేహం లేదు. ఇలాంటి ఆపత్కాల పరిస్థితుల్లో సమష్టిగా పనిచేయాల్సిన అధికారులు, పాలకులు ఎవరికివారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో దొందూ దొందేగా వ్యవహరిస్తుండటం జిల్లా ప్రజానీకాన్ని మరింత భయాందోళనల్లోకి నెడుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తాజా పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయి. కరోనా బాధితుల ఆర్తనాదాలు ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బాధిత వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. కొవిడ్‌ ఆస్పత్రుల్లో బాధితులకు వైద్యమందించడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించే నర్సులు, వైద్యులపై జిల్లా కలెక్టర్‌ చర్యలే ఇందుకు నిదర్శనం. ప్రైవేటు కొవిడ్‌ ఆస్పత్రుల తనిఖీ బృందాల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ప్రత్యేకాధికారి, ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడు కరోనా బారిన పడిన నేపథ్యంలో.. ఆయనకు వైద్యమందించడంలో చూపిన నిర్లక్ష్యం ఏపాటిదో అర్థమవుతోంది. కనీసం స్ర్టెచర్‌, ఆక్సిజన అందించడంలో సంబంధిత వైద్యులు చూపిన నిర్లక్ష్యంతో ఆయన కన్నుమూశారంటే... ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో బాధితులకు వైద్యమందించే విషయంలో అక్కడి డాక్టర్లు, నర్సులు తదితర సిబ్బంది ఏ విధంగా స్పందిస్తున్నారో పరిశీలన, పర్యవేక్షణ కోసం నియమించిన నోడల్‌ అధికారులు సైతం చుట్టపుచూపుగా వారి పాత్ర ఉందన్న విమర్శలు బాధిత వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను పరిశీలిస్తే... ఎవరికి వారు చేతులెత్తేశారా...? అన్న సందేహాలు కలగకమానవు. ఈ తరహా విపత్కర సమయంలో బాధితులకు బాసటగా నిలవాల్సిన గురుతర బాధ్యత అటు యంత్రాంగం... ఇటు పాలకులపై ఉంది. ఆ బాధ్యతను విస్మరించడం ప్రజానీకాన్ని మరింత విస్మయానికి లోనుచేస్తోంది. జిల్లాలో పరిస్థితిని చూస్తే.. కరోనా బాధితుల మృత్యుఘోష ఎవరూ పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం మృతుల కుటుంబాల నుంచి వినిపిస్తోండటం గమనార్హం.


దోపిడీకి అడ్డుకట్టేదీ..?

కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయకూడదనీ, ప్రభుత్వం నిర్దేశించిన మేరకే తీసుకోవాలని జిల్లా యంత్రాంగం పదేపదే చెబుతున్నా... పట్టించుకునే నాథుడేకరువయ్యాడు. అందినకాడికి లాక్కోవడమే పనిగా మెజార్టీ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని బాధిత వర్గాల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన బెడ్ల కొరతను సాకుగా తీసుకుని, దోపిడీకి తెరతీస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కరోనా బాధితుల్లో భయాన్ని మరింత సొమ్ము చేసుకునేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఆక్సిజన బెడ్డు కావాలంటే... అడ్మిషన అప్పుడే లక్షలాది రూపాయలను అడ్వాన్సగా కట్టించుకుంటున్నారంటే ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాల దోపిడీ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు వైద్యులే దేవుళ్లు. అలాంటి దేవుళ్లే కాసుల కోసం అర్రులు చాస్తుండటం బాధిత వర్గాలను మరింత ఆవేదనకు లోనుచేస్తోంది. వైద్యం కోసం లక్షలాది రూపాయలు సమకూర్చుకునేందుకు బాధితవర్గాల కుటుంబాలు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అప్పులు ఇచ్చే నాథుడు లేకపోవడంతో బంగారు తాకట్టు పెట్టి కొందరు.. భూములమ్ముకొని మరికొందరు ప్రాణాలు దక్కించుకునేందుకు డబ్బు సమకూర్చుకుంటున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఇలాంటి దోపిడీని అరికట్టేందుకు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక నిఘా అధికారులను నియమించినా.. దోపిడీ మాత్రం ఆగడం లేదు. పర్యవేక్షణాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అధిక వసూళ్లు చేస్తున్న నేపథ్యంలో ఔషధ నియంత్రణ అధికారుల్లో కొందరు అక్రమ వసూళ్లపై దృష్టి సారించినట్లు విమర్శలొస్తున్నాయి. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో గంటల తరబడి తిష్టవేసి, అమ్యామ్యాలు పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఇవ్వని పక్షంలో ఏవో కొన్ని లోపాలు చూపుతూ... బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరికివారు కరోనా బాధితుల కుటుంబికుల జీవితాలతో చెలగాటమాడుతున్నా... పాలకులు గానీ... ఉన్నతాధికారులు గానీ దోపిడీపై దృష్టి సారించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలో పరిస్థితులను ఆకలింపుజేసుకున్న పాలకులు, ఉన్నతాధికారులు ఇప్పటికైనా దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారని బాధిత కుటుంబాలు అర్థిస్తున్నాయి.


పాలకుల సిఫార్సులకే బెడ్లపై విమర్శలు...

జిల్లాలోని కొవిడ్‌ ఆస్పత్రిలో ఆక్సిజన బెడ్లు సామాన్యులకు అందడం లేదు. పాలకుల సిఫార్సులకే బెడ్ల కేటాయింపులో పెద్దపీట వేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలోనే ఈ తంతు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారులు, పాలకులు చెప్పిన వారికే ఆ ఆస్పత్రిలో బెడ్లను కేటాయిస్తున్నారని బాధిత వర్గాలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాయి. ఆక్సిజన బెడ్లలో వైద్యం పొందుతున్న కరోనా బాధితులను సైతం మరో బెడ్డుకు మార్చి సిఫార్సుల మేరకు ఆక్సిజన బెడ్లు కేటాయిస్తున్నట్లు బాధిత వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇలా అయితే సామాన్యుల పరిస్థితి అత్యంత దయనీయమనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత అటు పాలకులు.. ఇటు యంత్రాంగంపై ఉంది. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మూడ్రోజులుగా మరణాల సంఖ్య అదే స్థాయిలో ఉంటోంది. దీనిని బట్టి చూస్తే... పరిస్థితులు దారుణంగా మారాయనడం లో సందేహం లేదు. ఆదివారం రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య రాష్ట్రంలో మొదటి స్థానానికి చేరింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించే దిశగా అధికారులు పక్కా కార్యాచరణను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేటగిరీల వారీగా బాధితులను విభజించి, ఆ మేరకు వైద్యమందిస్తే మరణాల సంఖ్య తగ్గే అవకాశాలు లేకపోలేదు. దీనికి తోడు ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను మరింత పెంచడంతో పాటు సకాలంలో వైద్యమందేలా చూడాల్సిన బాధ్యత అటు పాలకులు... ఇటు యంత్రాంగంపై ఉంది. ఆ దిశగా కార్యాచరణతో ముందుకు సాగి, మృత్యుఘోషకు అడ్డుకట్ట వేస్తారని ఆశిద్దాం.

Updated Date - 2021-05-17T06:41:30+05:30 IST