పల్లె.. తల్లడిల్లె..

ABN , First Publish Date - 2021-05-16T05:10:13+05:30 IST

పల్లె.. తల్లడిల్లె..

పల్లె.. తల్లడిల్లె..
తొర్రగుడిపాడులో బ్లీచింగ్‌ చల్లుతున్న సిబ్బంది

గ్రామాలను వదలని కరోనా

భారీగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు

నిర్ధారణ పరీక్షలు అంతంతమాత్రమే..

ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పెరిగిన గిరాకీ

టెస్టుకు రూ.2వేల వరకూ వసూలు

కరోనా కిట్‌ కావాలంటే రూ.3వేలు

ఇంటి వద్ద వైద్యానికే పల్లెవాసుల మొగ్గు

ప్రాణాల మీదకు తెస్తున్న సొంత వైద్యం

పచ్చటి పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. కళకళలాడే లోగిళ్లు కళావిహీనంగా మారుతున్నాయి. నిత్య కల్యాణం.. పచ్చ తోరణంలా భాసిల్లే గ్రామాలు జ్వరాలతో అల్లాడిపోతున్నాయి. కరోనా సృష్టించిన కల్లోలం కేవలం నగరాలకే పరిమితం కావట్లేదు. పల్లెలనూ పట్టిపీడిస్తోంది. వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా, పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహించి వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో మహమ్మారి విలేజుల్లో విలయతాండవం చేస్తోంది. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా సెకండ్‌ వేవ్‌ గ్రామీణ ప్రాంతాల్లోనూ అల్లకల్లోలం సృష్టిస్తోంది. గత ఏడాది తొలి వేవ్‌లో గ్రామాలపై కరోనా ప్రభావం తక్కువ స్థాయిలోనే నమోదైంది. ఈసారి ఆ పరిస్థితి లేదు. మండల కేంద్రాల్లో ఉన్న పీహెచ్‌సీల్లో మాత్రమే అరకొరగా కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అధికశాతం గ్రామీణ ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలే జరగట్లేదు. ఆర్థిక స్థోమత ఉన్నవారు ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో టెస్టులు చేయించుకుంటున్నారు. పరీక్షలు సరిగ్గా జరక్కపోవడంతో పాజిటివ్‌ కేసుల్లో అధికారులు చూపించే లెక్కలకు పొంతనే ఉండట్లేదు. మరోవైపు కరోనా నిర్ధారణ అయినవారు సైతం ఎక్కడ తమను గ్రామంలో అంటరానివారుగా చూస్తారోనని గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు. లేకపోతే సమీప పట్టణాలు, నగరాలకు వచ్చి ప్రైవేట్‌ వైద్యం చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యం విషమించడం తప్ప కోలుకునే పరిస్థితులు లేవనే అభిప్రాయంతో చాలామంది అప్పోసొప్పో చేసి ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తున్నారు. కొంతమంది స్థానిక ఆర్‌ఎంపీలతో వైద్యం చేయించుకుంటూ ఇళ్ల వద్దే ఉంటున్నారు. చాలావరకు గ్రామాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. దీంతో ప్రైవేట్‌ ల్యాబ్‌లకు గిరాకీ పెరిగి, కొత్తకొత్త ల్యాబ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఫోన్‌ చేస్తే వచ్చి స్వాబ్‌ శాంపిల్స్‌ తీసుకెళ్తున్నారు. రూ.1,500 నుంచి రూ.2,000 వసూలు చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి మెడికల్‌ కిట్లకు రూ.3వేలు వసూలు చేస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ శనివారం పలు గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించింది. ఆ విషయాలు.. 

ముదినేపల్లి మండల కేంద్రానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైవాక, బొమ్మినంపాడు గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వైవాకలో పలువురు కరోనా లక్షణాలతో ఇళ్ల వద్దే చికిత్స పొందుతుండగా, జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ గ్రామంలో సుమారు 50 మందికిపైగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. బొమ్మినంపాడు పంచాయతీ ఏరియాలోని ఏడు శివారు గ్రామాల్లో కూడా జ్వరాల బాధితులు ఎక్కువగానే ఉన్నారు.  

తిరువూరు మండలంలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఎవరూ రాకపోవడంతో అసలు ఏయే గ్రామాల్లో ఎన్ని కేసులు ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. కొమ్మిరెడ్డిపల్లిలో సుమారు 30 కేసులు ఉండగా, ముష్టికుంటలో సుమారు 25 కేసులు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. బాధితులకు కొవిడ్‌ మందులు ఇవ్వట్లేదు. ప్రభుత్వ వైద్యశాల, పీహెచ్‌సీల్లో కొవిడ్‌ పరీక్ష చేయించుకుని నిర్ధారణ అయిన వారికే కిట్లు ఇస్తున్నారు. కానీ, ప్రభుత్వ వైద్యశాలల్లో ఎక్కడా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయట్లేదు. దీంతో బాధితులు ప్రైవేటుగా పరీక్షలు చేయించుకుంటున్నారు. 

మైలవరం మండలంలోని చంద్రాల పీహెచ్‌సీలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గ్రామంలో ప్రస్తుతం 15 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో ఐదుగురు చనిపోయారు. అనధికారికంగా చంద్రాలలో కొవిడ్‌ కేసులు 30కిపైగా ఉన్నాయి. గణపవరంలో 20, వెల్వడంలో 30 కేసులు ఉన్నాయి. 

రెడ్డిగూడెం మండలంలో ఇప్పటివరకు 48 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెండు, మూడు రెట్లు ఉంటుందని సమాచారం. ఎ.కొండూరులోని పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు చేయట్లేదు.

గొల్లపూడి, రాయనపాడు, పైడూరుపాడు గ్రామాల్లో 300 పైచిలుకు పాజిటివ్‌ కేసులు ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామాల్లో ఎక్కడా పరీక్షలు చేయట్లేదు. 

పెడన మండలంలోని గ్రామాల్లో ప్రతి 10 ఇళ్లకు ఒక ఇంట్లో కొవిడ్‌ కేసులు ఉన్నాయి. కొవిడ్‌ పరీక్షలు చేయకపోవడంతో వీరంతా ఆర్‌ఎంపీలతో పరీక్షలు చేయించుకుని మందులు కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. 

చాట్రాయి మండలంలోని 18 గ్రామాల్లో ప్రతి గ్రామంలో 20 వరకు కేసులు ఉన్నాయి. అధికారికంగా చాలా తక్కువే నమోదు అవుతున్నాయి. లక్షణాలు కనిపిస్తే ఎక్కువ మంది ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించుకుని మెడికల్‌ కిట్‌ తెచ్చుకుని సొంత వైద్యం చేసుకుంటున్నారు. తమకు కరోనా వచ్చిన విషయం బయటకు తెలియనివ్వడం లేదు. 

నాగాయలంక మండలంలో దివి గ్రామాల సమూహమైన ఎదురమొండి దీవుల్లో కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. స్థానికంగా ఉన్న పీహెచ్‌సీలో సరైన సదుపాయాలు లేవు. దీంతో ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీవుల్లో మొత్తం 3 పంచాయతీల్లో సుమారు 6వేల మంది జనాభా ఉన్నారు. వీరిలో సుమారు 100 మంది వరకు కరోనా బారిన పడ్డారు. అవనిగడ్డలో హోం క్వారంటైన్‌లో ఉండి సుమారు 8 మంది మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో దొరికినా ఖర్చు భరించలేక చాలామంది హోం క్యారంటైన్‌లో ఉంటూ మందులు వాడుతున్నారు. 

కైకలూరు మండలం భుజబలపట్నంలో 50కిపైగా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. గతవారం ఒకే ఇంట్లో నలుగురు మృతిచెందారు. చాలామందికి పాజిటివ్‌ వచ్చినా గుట్టుగా చికిత్స చేయించుకునేందుకు ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

తోట్లవల్లూరు మండలంలో 16 గ్రామ పంచాయతీలుండగా, ఇందులో ఎనిమిది లంక గ్రామాలున్నాయి. తోట్లవల్లూరు పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో చేయట్లేదు. గ్రామాల్లో ప్రజలు చాలామంది సొంత వైద్యంపైనే ఆధారపడుతున్నారు. జలుబు, జ్వరం వస్తే మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు తెచ్చుకుని వాడుతున్నారు. ఇలా సొంత వైద్యంతో కొందరు బయట పడుతున్నా, కొందరు చనిపోతున్నారు. కృష్ణానది పాయల మధ్య లంక గ్రామాల ప్రజలకు కొవిడ్‌ సేవలు సరిగ్గా అందట్లేదు. కనిగిరిలంక, ములకలపల్లిలంక గ్రామాల ప్రజలు గుంటూరు జిల్లా తెనాలి వెళ్తున్నారు.








Updated Date - 2021-05-16T05:10:13+05:30 IST