బడిలో భయం.. భయం!

ABN , First Publish Date - 2021-04-13T05:11:43+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో 33 కొత్త కేసులు నమోదయ్యాయి

బడిలో భయం.. భయం!

  1. కొత్తగా కరోనా 33 కేసులు 
  2. జిల్లాలో 176 పాజిటివ్‌ కేసులు

కర్నూలు(హాస్పిటల్‌/ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 12: ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 176 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో అత్యధికంగా 100 కేసులు వెలుగు చూశాయి. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 8, గోనెగండ్లలో 4, దేవనకొండలో 4, ఆస్పరిలో 5, నందవరంలో 2, నందికొట్కూరులో 2, శ్రీశైలంలో 1, దిన్నెదేవరపాడులో 1, డోన్‌లో 4, జూపాడుబంగ్లాలో 2, కోడుమూరులో 1, కల్లూరులో 2, నంద్యాలలో 2, ఉయ్యాలవాడలో 2, బనగానపల్లెలో 1 కేసులు వచ్చాయి. కరోనాతో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ముఖ్య అధికారితో పాటు మరో వైద్యుడికి కరోనా సోకడం కలకలం రేపింది. ముఖ్య అధికారిని కలిసిన అధికారులు వైద్యులు, ఉద్యోగులు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 


పాఠశాలల్లో

జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 550కి చేరింది. బోధన, బోధనేతర సిబ్బంది 88 మంది, విద్యార్థులకు 462 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు 1,64,598 విద్యార్థులకు, 17,181 మంది ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. సోమవారం ఒక్కరోజే 33 కేసులు వచ్చాయి. వాటిలో కర్నూలులోని కార్పొరేట్‌, ప్రభుత్వ స్కూళ్లలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. 


రెండో రోజు కూడా టీకా నిల్‌

జిల్లాలో రెండోరోజు టీకా మహోత్సవ్‌ జాడ కనిపించలేదు. టీకాలు లేకపోవడంతో పలు కేంద్రాలు మూతపడ్డాయి. మంగళవారం మధ్యాహ్నంలోపు జిల్లాకు వ్యాక్సిన్‌ రానున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-04-13T05:11:43+05:30 IST