కడ‘సారీ’!

ABN , First Publish Date - 2020-07-16T09:35:19+05:30 IST

కరోనా... మన జీవితాలను... ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిందనే అందరూ బాధ పడుతున్నారు.

కడ‘సారీ’!

బంధాలను దూరం చేస్తున్న కరోనా భయం

కన్నవారు మృతిచెందినా.. కడసారి చూపునకు నోచుకోని వైనం

చెంతనే బంధువులు ఉన్నా.. కర్మకాండలకు దూరం

మానవ సంబంధాలపైనా ‘వైరస్‌’ ప్రభావం


(పలాస/మెళియాపుట్టి): కరోనా... మన జీవితాలను... ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిందనే అందరూ బాధ పడుతున్నారు. నాణానికి మరోవైపు బంధాలనూ బలహీన పరుస్తోంది. ప్రాణాలపై భయం... మానవ సంబంధాలనూ ప్రశ్నార్థకం చేస్తోంది. మనిషి ఆఖరి ఘడియల్లో... అంతిమ సంస్కారాల్లో సైతం తన వారెవరినీ దగ్గర లేకుండా చేస్తోంది.  కన్నబిడ్డలు కూడా కడసారి చూసేందుకు వెనుకంజ వేసేలా చేస్తోంది. దీంతో అందరూ ఉన్నా అనాథలా.. పారిశుధ్య కార్మికులే మృతదేహాన్ని దహనం చేయాల్సి వస్తోంది. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు వజ్రపుకొత్తూరు మండలంలో ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. 


అందరు ఉన్నా.. అనాథలా! 

ఈమె పేరు పొందర పద్మావతి(80). పలాసలోని కొత్తవీధికి చెందిన ఈమె అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతిచెందింది. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఈమెకు అధికారులు కరోనా పరీక్షలు చేశారు. రిపోర్టులో ‘నెగిటివ్‌’ వచ్చింది. దీంతో ఈమె మృతదేహాన్ని  శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేయవచ్చని అధికారులు సూచించారు. ఆమెకు ఇద్దరు  కుమారులు. ఒకరు ఇతర రాష్ట్రంలో, మరొకరు పొరుగు మండలంలో ఉంటున్నారు.  కన్నతల్లి మరణించిందని వారికి కబురు పెట్టినా కరోనా భయంతో రాలేదు. బుధవారం ఉదయం వరకు అధికారులు వారి రాకకోసం చూసినా ఫలితం లేకపోయింది. దీంతో ఇన్‌చార్జి కమిషనర్‌ ఎన్‌.రమేష్‌నాయుడు కల్పించుకొని... పారిశుధ్య కార్మికులతో వృద్ధురాలి మృతదేహాన్ని దహనం చేయించారు. కుటుంబ సభ్యులు ఉన్నా.. అనాథలా ఆమె అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.  


మానవ సంబంధాలపైనా కరోనా ప్రభావం చూపుతోంది. అనురాగం, అప్యాయతలతో పాటు బంధాలను దూరం చేస్తోంది. సుమారు నాలుగు నెలలుగా బంధువుల ఇళ్లకు రాకపోకలకు బ్రేక్‌ పడింది. ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతంలో స్థిరపడి.. స్వగ్రామంలో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు కూడా కన్నబిడ్డలు రాలేని పరిస్థితి ఎదురవుతోంది. చివరికి కొందరు వృద్ధులు అనారోగ్యంతో మృతిచెందినా.. కరోనా భయంతో కొందరు వారిని కడసారి చూపునకు కూడా నోచుకోలేని దుస్థితి నెలకొంది. అందరూ ఉన్నా అనాథల్లా.. పారిశుధ్య కార్మికులే ఆ మృతదేహాలను దహనం చేయాల్సి వస్తోంది. కొద్ది రోజుల క్రితం పలాస కంటైన్మెంట్‌ ప్రాంతంలో ఓ వృద్ధుడు కరోనా లక్షణాలతో మృతి చెందాడు. బంధువులు ఎవరూ దగ్గరకు చేరుకోలేదు. చివరికి స్థానిక అధికారులు ఎక్స్‌కవేటర్‌తో మృతదేహాన్ని తీసుకెళ్లి భారీ మూల్యం చెల్లించుకున్నారు.


మరో వృద్ధుడు మృతి చెందితే కుటుంబీకులు చెంతనే ఉన్నా ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు ధరింపజేసి... మృతుని బంధువులకు వాటిని ఇచ్చి భద్రంగా ఇంటికి పంపిస్తామని అధికారులు బతిమాలినా స్పందించలేదు. చివరకు అధికారులే అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. 


- వజ్రపుకొత్తూరు మండలంలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. కరోనా భయంతో అంత్యక్రియల నిర్వహణకు మృతుడి బంధువులెవరూ ముందుకు రాలేదు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పారిశుధ్య కార్మికులను తీసుకెళ్లి వారితోనే అంత్యక్రియలు పూర్తి చేయించాల్సి వచ్చింది. 


- తాజాగా పలాస మండలంలోనూ బుధవారం ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఆమెది సాధారణ మరణం. ఎటువంటి కరోనా లక్షణాలూ లేవు. కుమారులు 15 కిలోమీటర్ల దూరంలోని పొరుగు మండలంలో ఉన్నా కరోనా ఉందని ముఖం చాటేశాడు. దీంతో అధికారులే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.  


మరచిపోలేని గాయంగా.. 

సాధారణ మరణాలకు కరోనా పరీక్షలు చేసినా... ఫలితాలు ప్రకటించకుండా బంధువులు, కుటుంబ సభ్యులతోనే నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి.  ఇది వినడానికి బాగే ఉంది. కానీ కరోనా లక్షణాలు ఉంటే మరొకరికి సోకే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని అధికారులే వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కరోనా మరణాలకు కోవిడ్‌ నిబంధనల ప్రకారం వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు అధికారుల సమక్షంలో గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. దీనికి కుటుంబ సభ్యుల తోడ్పాటు ఉండాలి. బంధువుల నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో అధికారులే అన్నీ అవుతున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు జీవితంలోని మరచిపోలేని గాయంగా దీనిని మిగుల్చుకుంటున్నారు. 


బంధువుల రాకపోకలు బ్రేక్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో.. నాలుగు నెలలుగా బంధువుల ఇళ్లకు రాకపోకలు నిలిచిపోయాయి. వారు ఎంత కష్టంలో ఉన్నా సరే.. పరామర్శించడానికి వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఒకవేళ బంధువుల్లో ఎవరికైనా పాజిటివ్‌ లక్షణాలు వచ్చినా.. ఓదార్చేందుకు కూడా దరి చేరని పరిస్థితి ఎదురవుతోంది. మరోవైపు కంటైన్మెంట్‌ జోన్ల బెంగ వెంటాడుతోంది. పాజిటివ్‌ లక్షణాలు ఎక్కువగా ఉన్నచోటు నుంచి ఎవరైనా కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇళ్లకు వచ్చినా ఆహ్వానించలేని దుస్థితి ఎదురవుతోంది.


ఉపాధి నిమిత్తం సుదూర ప్రాంతంలో ఉంటున్న కన్నబిడ్డలు కూడా స్వగ్రామాల్లో నివాసం ఉంటున్న తల్లిదండ్రులను చూసేందుకు వెళ్లాలంటే ఆలోచించాల్సి వస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఎక్కడ ‘క్వారంటైన్‌’కు తరలిస్తారేమోనన్న భయాందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రయాణ మార్గంలో  ఎక్కడ.. ఎవరి నుంచైనా వైరస్‌ వ్యాపిస్తుందేమోనని లోలోపల తెలియని గుబులు పుడుతోంది. చివరకు కన్నబిడ్డలు, అల్లుళ్లు, కూతళ్లను సైతం కొద్దిరోజులు ‘ఇంటికి రావద్దు’ అనే చెప్పాల్సి వస్తోంది. ఇంతలా బంధుత్వాల మధ్య కరోనా వైరస్‌ దూరం పెంచేసింది. 

Updated Date - 2020-07-16T09:35:19+05:30 IST