కరోనా భారతంలో ఉద్యోగ పర్వం!

ABN , First Publish Date - 2020-05-31T08:37:56+05:30 IST

ఉద్యోగులందరూ ఆఫీసుకు రావాలి. కార్యాలయాల్లో శానిటైజర్లు ఉంచాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఉద్యోగులకు మాస్కులు అందించాలి. భౌతిక దూరం పాటించాలి!.. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలివి!

కరోనా భారతంలో ఉద్యోగ పర్వం!

  • రిస్క్‌లో సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులు
  • అందరూ ఆఫీసుకు రావాలని ఆదేశాలు
  • ఇరుకిరుకు గదుల్లోనే హెచ్‌వోడీలు
  • భౌతిక దూరం పాటించడం అసాధ్యం
  • ఇతర జాగ్రత్తలూ కాగితాలకే పరిమితం
  • 50శాతం మందికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని ఉద్యోగుల వినతి


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఉద్యోగులందరూ ఆఫీసుకు రావాలి. కార్యాలయాల్లో శానిటైజర్లు ఉంచాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఉద్యోగులకు మాస్కులు అందించాలి. భౌతిక దూరం పాటించాలి!.. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలివి! మరి ప్రభుత్వ కార్యాలయాల్లో నిజంగా ఈ పరిస్థితి ఉం దా!? మాస్కులు, శానిటైజర్లను ఎవరికివారు తెచ్చుకోవచ్చు. మరి... భౌతిక దూరం మాటేమి టి? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘అందరూ ఆఫీసుల నుంచి పని చేయాల్సిందే’ అనే ఉత్తర్వులతో... హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో పలువురికి కరోనా వైరస్‌ సోకిందనే వార్తతో ఇప్పుడు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు విధులకు తప్పనిసరిగా హాజరుకావాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ పని చేయాలని, కార్యాలయాల్లో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపింది. హైదరాబాద్‌తోపాటు, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులను విజయవాడకు బస్సుల్లో తీసుకొచ్చారు. వీరిలో ముగ్గురికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో.. ఉద్యోగుల్లో మరింత ఆందోళన మొదలైంది. భౌతిక దూరం పాటించాలంటూనే.. అందరూ ఆఫీసులోనే పనిచేయాలనడం హాస్యాస్పదమని ఉద్యోగులు అంటున్నారు. ఎందుకంటే, సచివాలయం వరకు కొంత వరకు ఫర్వాలేదు. మిగిలిన కార్యాలయాల్లో ఏవో కొన్ని మినహా అన్నీ ఇరుకు ఇరుకు ఆవరణలోనే ఉన్నాయి. 


చాలా శాఖాధిపతుల కార్యాలయాలను అపార్ట్‌మెంట్‌లలో పెట్టారు. ఒకే గదిలో రెండు మూడు సెక్షన్లు నడుస్తున్నాయి. సగటున ఒక్కో గదిలో కనీసం ఎనిమిదిమందిపైనే ఉద్యోగులు పని చేస్తున్నారు. కనీసం ఆరు అడుగుల భౌతికదూరం పాటించడం అసాధ్యం. కార్యాలయాల గ దులను శానిటైజ్‌ చేయడం, మాస్కులు అందించడం, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకుంటున్న హెచ్‌వోడీలూ తక్కువే. సచివాలయంలో ప్రభుత్వ పెద్దలు ఉంటారు కాబట్టి శానిటైజ్‌ చేస్తా రు. చాలావరకు హెచ్‌వోడీలలో ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ‘బడ్జెట్‌ లేదు, డబ్బుల్లేవు’... అంటూ ఉద్యోగుల ఆరోగ్యంతో చెలగాటమాడే పరిస్థితి ఉంది. ‘‘కరోనా ప్రబలడానికి ముందే, నిధుల కొరత కారణంగా శానిటేషన్‌ పనులు చేసే ఏజెన్సీని తొలగించారు. దీంతో ఆఫీసులో క్లీనింగ్‌ పనులను చాలా వర కు అటెండర్లే చేస్తున్నారు. ఇప్పుడు కరోనా కారణంగా చాలా మంది ఔట్‌సోర్సింగ్‌ అటెండర్లు రావడం లేదు. ఇలాంటప్పుడు పారిశుధ్య నిర్వహణ ఎలా సాధ్యం?’’ అని ఒక అధికారి వాపోయారు. కరోనా విరుచుకుపడుతున్న తరుణంలో ఉద్యోగులంతా కార్యాలయాలకు రావాలని ఆదేశించడంతో సమస్యలు వస్తున్నాయని ఒక ఉద్యోగసంఘం నేత తెలిపారు. ‘‘తెలంగాణలో ఈ-ఆఫీసు విధానం లేదు. కాబట్టి విధిగా ఉద్యోగులు ఆఫీసులకు హాజరయితేనే పనులవుతాయి. ఏపీలో ఈ-ఆఫీసు విధానం అమలవుతోంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వ పనీ నిలిచిపోలేదు. పరిస్థితులు చక్కబడేవరకు కనీసం 50 శాతం మందిని ఇంటినుంచి పనిచేసేందుకు అనుమతించాలి. లేదంటే... ఉద్యోగులను రిస్క్‌లోకి నెట్టడమే’’ అని ఒక ఉద్యోగ సంఘం నేత ఆందోళన వ్యక్తం చేశారు. భౌతిక దూరంతోసహా ఇతర అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోలేని కార్యాలయాల్లో... మరికొన్నాళ్లు ‘ఇంటి నుంచి పని’ అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - 2020-05-31T08:37:56+05:30 IST