యూత్‌పై కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2021-04-08T06:32:01+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ వేగంగా విస్తరిస్తోంది. ప్రతి గంటకు నాలుగు కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

యూత్‌పై కరోనా ఎఫెక్ట్‌

పాజిటివ్‌లలో యువతే అధికం 

వణికిస్తున్న వైరస్‌ ఉధృతి 

పెరుగుతున్న బాధితులు

రిమ్స్‌లో కేటాయించిన బెడ్‌లన్నీ ఫుల్‌ 

ఒంగోలు (కార్పొరేషన్‌). ఏప్రిల్‌ 7 : జిల్లాలో కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ వేగంగా విస్తరిస్తోంది. ప్రతి గంటకు నాలుగు కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ బారినపడుతున్న వారిలో యువతే అధికంగా ఉన్నట్లు అధికారుల గణాంకాలు  బట్టి వెల్లడవుతోంది. ఏడాదిపాటు దడపుట్టించిన వైరస్‌ ప్రస్తుతం మళ్లీ విజృంభించడంతో అందరూ వణికిపోతున్నారు. ఒకవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నప్పటికీ, మరోవైపు వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం అధికారుల్లో ఆందోళన పెంచింది. 


అధికశాతం బాధితులు యువకులే

ప్రస్తుతం కొవిడ్‌ బారిన పడుతున్న వారిలో అధిక శాతం మంది యువకులే ఉంటున్నారు. గతేడాది అన్ని వయసుల వారు వైరస్‌ సోకి అనారోగ్యానికి గురికాగా, ప్రస్తుతం వెలుగుచూస్తున్న ఫలితాల్లో అధికశాతం మంది 17ఏళ్ల నుంచి 25ఏళ్ళ వయస్సు వారే ఉంటున్నారని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. అయితే అందుకు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది. ప్రత్యేకించి విద్యాసంస్థలు, గుడులు, థియేటర్స్‌, మాల్స్‌, పార్కులు, వ్యాపారసంస్థలు ఇలా అన్నీ కూడా ఉదయం నుంచి రాత్రి వరకూ తెరిచి ఉంచుతుండటంతో యువత వైరస్‌ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. నిరంతరం వేలమంది రోడ్లపై రయ్‌రయ్‌మంటూ తిరుగుతుండగా, అతి తక్కువమంది మాస్క్‌లు ధరించి కనిపిస్తున్నారు.  


పెరుగుతున్న బాధితులు

గడిచిన పదిరోజుల నుంచి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత మార్చి మొదట్లో పది కేసులతో మొదలైన బాధితుల సంఖ్య బుధవారం 110మందికి చేరింది. ప్రస్తుతం ఈనెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ477 మంది వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్నారు. అందులోనూ ఒంగోలులోనే ఎక్కువమందికి కొవిడ్‌ సోకినట్లు వైద్యపరీక్షలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల ఒకట్రెండు రోజులు మాత్రం మాస్క్‌ లేకుంటే పెనాల్టీ విధించిన అధికారులు ఆ తర్వాత విస్మరించారు. అంతేకాకుండా వ్యాపార సంస్థలతో సమావేశం ఏర్పాటుచేసి, కొవిడ్‌ నిబంధనలు, రాబోయే రోజుల్లో పరిస్థితిపై హెచ్చరికలు జారీచేయకపోవడం కూడా ఒకింత  వైరస్‌ వ్యాప్తికి కారణాలుగా కనిపిస్తున్నాయి.


రిమ్స్‌లో కొవిడ్‌ వార్డు ఫుల్‌ 

రోజురోజుకూ వైరస్‌ విజృంభణతో రిమ్స్‌లో చేరేవారి బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రి మూడో అంతస్తును మాత్రమే కొవిడ్‌ వార్డుగా కేటాయించారు. అందులో 150పడకలు మాత్రమే ఉండగా మరికొన్ని స్పెషల్‌ రూంలు ఉన్నాయి. అయితే ప్రతి గంటకూ నలుగురు ఆ మహమ్మారి బారిన పడుతుండటంతో రిమ్స్‌లోని కొవిడ్‌ వార్డు బాధితులతో కిటకిటలాడుతోంది. బెడ్‌ల కోసం, స్పెషల్‌రూంల కోసం డిమాండ్‌ ఏర్పడింది. దీంతో స్పెషల్‌ రూంలు ఉచితంగా కేటాయించే విధానానికి స్వస్తిపలికిన రిమ్స్‌ అధికారులు   చార్జి వసూలు చేయనున్నారు.  అద్దె చెల్లించేందుకు బాధితులు ముందుకొచ్చినా, పెరిగిన కేసులతో ప్రస్తుతం రూంలు ఖాళీ లేని పరిస్థితి. మరోవైపు కొవిడ్‌ జనరల్‌ వార్డులో కూడా బెడ్‌లన్నీ ఫుల్‌ కావడంతో రిమ్స్‌ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. 


Updated Date - 2021-04-08T06:32:01+05:30 IST