జ్వరాలతో వణుకు

ABN , First Publish Date - 2020-08-04T10:23:50+05:30 IST

కరోనా.. డెంగీ.. మలేరియా.. వ్యాధి ఏదైనా లక్షణం మాత్రం ఒక్కటే జ్వరం. ప్రస్తుతం కరోనాతో పాటు సీజనల్‌ వ్యాధుల ముప్పు పొంచి ఉంది.

జ్వరాలతో వణుకు

డెంగీ, మలేరియాల కలవరం

చాపకింద నీరులా విస్తరిస్తున్న వైనం

అప్రమత్తంగా లేకుంటే కష్టమే


(కొమరాడ): కరోనా.. డెంగీ.. మలేరియా.. వ్యాధి ఏదైనా లక్షణం మాత్రం ఒక్కటే జ్వరం. ప్రస్తుతం కరోనాతో పాటు సీజనల్‌ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. వర్షాలకు ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని గడుపుతున్నారు. జ్వరం వస్తే అది కరోనానా, డెంగీనా, మలేరియానా అనే సందేహంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వివిధ వ్యాధులు అక్కడక్కడా నమోదవ్వడం కలవర పాటుకు గురిచేస్తోంది. జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. మరోపక్క సీజనల్‌ వ్యాధులు పంజా విసురుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో దోమల బెడద పెరిగి జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ఎవరు దగ్గినా, తుమ్మినా కరోనా అన్న భయం నెలకొంది. ఈ లక్షణాలతో సాధారణ గ్రామీణ వైద్యుల (ఆర్‌ఎంపీ, పీఎంపీ) వద్దకు వెళ్లలేని పరిస్థితి.


పెద్ద ఆసుపత్రులకు వెళ్లాలంటే డబ్బుతో పని. ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితుల్లో రోగులు కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా సబ్‌ప్లాన్‌ మండలాలు ఎనిమిది ఉన్నాయి. మలేరియాకు పుట్టినిల్లుగా పేరొందాయి. కొమరాడ, పార్వతీపురం, పాచిపెంట, సాలూరు, మక్కువ, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో ఇప్పటికే వందలాది మంది ప్రజలు జ్వర పీడితులుగా ఉన్నారు. వీరు వైద్యం చేసుకోవాలన్నా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఆయా పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి, క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలకు కరోనా సోకడంతో జ్వర పీడితుల్లో భయం నెలకొంది.


భయం వీడి వైద్యం పొందాలి.. డాక్టర్‌ అనిల్‌, పీహెచ్‌సీ వైద్యులు, కొమరాడ

ప్రజలు భయం వీడి జ్వరం వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది (ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త)ని సంప్రదించాలి.  ప్రాథమిక చికిత్స పొందిన తరువాత పీహెచ్‌సీకి వస్తే ఏ రకం జ్వరమో తెలుస్తుంది. ఆ మేరకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. జ్వరం వస్తే అశ్రద్ధ చేయకూడదు. ఇప్పటికే గ్రామాల్లో కరోనా సర్వేతో పాటు డెంగ్యూ, మలేరియా జ్వరాల సర్వే జరుగుతోంది.

Updated Date - 2020-08-04T10:23:50+05:30 IST