పండుగ తర్వాత పరేషాన్

ABN , First Publish Date - 2022-01-19T15:27:12+05:30 IST

ప్రభుత్వ అంచనా నిజమైంది. పండగల తర్వాత కేసులు పెరిగే అవకాశముందని భావించి..

పండుగ తర్వాత పరేషాన్

చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్‌ 

తాజాగా పెరిగిన లెక్క 

కూకట్‌పల్లిలో 605 మందిని పరీక్షిస్తే 205 మందికి పాజిటివ్‌ 

మిగిలిన సర్కిళ్లలోనూ అదే దుస్థితి

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు


ప్రభుత్వ అంచనా నిజమైంది. పండగల తర్వాత కేసులు పెరిగే అవకాశముందని భావించి ముందుగానే సెలవులను పొడిగించింది. ఊహించినట్లుగానే వివిధ ప్రభుత్వ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో వందలాది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


ముషీరాబాద్‌, అంబర్‌పేటల్లో 327

బర్కత్‌పుర/నల్లకుంట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాలలో మంగళవారం 327 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో   370 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా వారిలో 177 మందికి పాజిటివ్‌ వచ్చింది.


రాజేంద్రనగర్‌లో 141 

రాజేంద్రనగర్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో   మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో 141 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా వచ్చింది.


 అల్వాల్‌లో  94 కరోనా కేసులు

అల్వాల్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): అల్వాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మంగళవారం ఒక్కరోజే 94 కేసులు నమోదయ్యాయి. సోమ,   మంగళవారాల్లో కలిపి 129 కేసులు నమోదు కావడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.


అడ్డగుట్టలో 64

అడ్డగుట్ట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): అడ్డగుట్ట ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో మంగళవారం 64 మందికి కొవిడ్‌   పాజిటివ్‌ వచ్చింది. విఽధులు నిర్వహిస్తున్న నలుగురు సీనియర్‌ నర్సులకు సైతం పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వారు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. 


హైదరాబాద్‌ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. కేసుల కట్టడికి సర్కారు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంతోపాటు టీకా ప్రక్రియను వేగవంతం చేసింది. అయినప్పటికీ సెన్సెక్స్‌ మాదిరిగా పెరుగుతున్న కేసులతో అధికారులు, ప్రజలు సతమతమవుతున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి నగరానికి చేరుకుంటే కేసులు వేగంగా పెరుగుతాయని భావించి ప్రభుత్వం సెలవులను పొడిగించింది. తాజాగా పాజిటివ్‌ కేసులు పెరిగాయి. ఈ మేరకు ‘ఆంధ్రజ్యోతి’ బృందం చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో పలు సెంటర్లలో 20నుంచి 35 శాతం పాజిటివ్‌లు తేలడం ఆందోళనకరంగా మారింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాల పరిధిలో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 


ఎర్రగడ్డ ఆస్పత్రిలో మరో ఐదుగురికి 

బేగంపేట, జనవరి 18 (ఆంద్రజ్యోతి): ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రిలో మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉమాపతి తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఆస్పత్రిలో కరోనా బారిన పడినవారి సంఖ్య 62కు చేరిందన్నారు. వీరుకాక తొమ్మిది మంది సిబ్బందికి సైతం కరోనా సోకిందన్నారు. 


1206 కొవిడ్‌ కేసులు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం కొత్తగా 1206 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన మూడు రోజులతో పోల్చితే కేసుల సంఖ్య పెరిగింది. సోమవారంతో పోల్చితే మంగళవారం 94 పాజిటివ్‌ కేసులు పెరిగాయి. 


గ్రేటర్‌ ఆర్టీసీ అలర్ట్‌..!

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు అలర్ట్‌ అయ్యారు. లక్షల మంది ప్రయాణికులతో నిత్యం తిరిగే డ్రైవర్లు, కండక్లర్లు నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఈడీ వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులు కూడా మాస్కులు ధరించేలా చూడాలన్నారు. నిత్యం బస్సులు శానిటైజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. 


నిన్న పాజిటివ్‌..నేడు నెగెటివ్‌..ఇది కరోనా నిర్ధారణ తీరు..

చాదర్‌ఘాట్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): పాతబస్తీ గౌలిపురాకు చెందిన మహిళ (45) ఈ నెల 10న లలితాబాగ్‌ యూపీహెచ్‌సీలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుంది. ఎనిమిది రోజుల తర్వాత సోమవారం ఆమె మొబైల్‌ ఫోన్‌కు పాజిటివ్‌ వచ్చినట్లుగా మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆమె ఐసొలేషన్‌లోకి వెళ్లారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షపై అనుమానం వచ్చిన బాధిత మహిళ మంగళవారం భర్త, అత్తతో కలిసి మరోమారు ర్యాపిడ్‌ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ అని తేలింది. దీంతో కరోనా ఉన్నట్లా, లేదా తెలియక ఆమె అయోమయంలో పడిపోయారు. వైద్య సిబ్బందిని నిలదీస్తే తమకు తెలియదని, పాజిటివ్‌ వస్తే హోం ఐసొలేషన్‌లో ఉంటూ మందులు వాడాలని సూచిస్తాం.. నెగెటివ్‌ ఉంటే మాస్క్‌ ధరిస్తూ నిబంధనలను పాటించాలని సూచిస్తామని సమాధానం ఇచ్చారు. 


8 రోజుల తర్వాత రిపోర్ట్‌

సైదాబాద్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఈనెల 11న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోగా ఎనిమిది రోజుల తర్వాత మంగళవారం పాజిటివ్‌ అని మెసేజ్‌ వచ్చింది. 


బూస్టర్‌ డోసుపై అవగాహన కల్పించాలి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): బూస్టర్‌ డోసుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ శర్మన్‌ వైద్యాధికారులకు సూచించారు. నగరంలోని బొగ్గులకుంట, గగన్‌మహల్‌, డీబీఆర్‌ మిల్స్‌, యూపీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాలను కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. 


కూకట్‌పల్లిలో 286 

కూకట్‌పల్లి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లిలో మంగళవారం 286 మందికి కరోనా సోకింది. గత ఐదురోజుల్లో కొవిడ్‌ బారిన పడిన వారి సంఖ్య 730కి చేరింది.


మల్కాజిగిరిలో 232  

మల్కాజిగిరి, జనవరి 18 (ఆంద్రజ్యోతి): మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో మంగళవారం 232 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గత ఐదు రోజుల్లో 657 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 


కుత్బుల్లాపూర్‌లో 221 

కుత్బుల్లాపూర్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్‌లో మంగళవారం ఒక్కరోజే కొవిడ్‌ పాజిటివ్‌ కేసు లు డబుల్‌ సెంచరీ దాటాయి. కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని నాలుగు యూపీహెచ్‌సీలు, దుండిగల్‌ పీహెచ్‌సీతో పాటు శివాలయనగర్‌ బస్తీ దవాఖాన పరిధిలో 221 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 5 రోజుల్లో 551 కేసులు నమోదు కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2022-01-19T15:27:12+05:30 IST