కరోనా.. అలర్ట్‌

ABN , First Publish Date - 2022-01-19T16:01:17+05:30 IST

ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఒక్క మంగళవారమే 327 కేసులు నమోదయ్యాయి.

కరోనా.. అలర్ట్‌

ముషీరాబాద్‌, అంబర్‌పేటలో  పెరుగుతున్న కేసులు

ముషీరాబాద్‌/కవాడిగూడ,బర్కత్‌పుర/నల్లకుంట/గోల్నాక/అంబర్‌పేట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఒక్క మంగళవారమే 327 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని యూపీహెచ్‌సీలో 449 మందికి పరీక్షలు నిర్వహించగా 101 మందికి, అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలో 664 మందికి పరీక్షలు నిర్వహించగా 226 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఈ నెల 6 నుంచి యూపీహెచ్‌సీలలో కరోనా లక్షణాలతో బాఽధపడుతున్న ప్రజలు పెద్దఎత్తున ఆస్పత్రిలకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. 


పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రభుత్వం అందజేసే హోం ఐసోలేషన్‌ కిట్లను అందజేస్తున్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్య సిబ్బందిపై పనిఒత్తిడి పెరుగుతోంది.   సెలవులు కూడా తీసు కోకుండా పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 12 న కలెక్టర్‌ శర్మన్‌ ముషీరాబాద్‌ యూపీ హెచ్‌సీని సందర్శించి  వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణమోహన్‌తో మాట్లాడి టెస్టులను పెంచాలని సూచించారు.  


ఫీవర్‌ ఆస్పత్రిలో 370 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా వారిలో 177 మందికి పాజిటివ్‌, అంబర్‌పేట మున్సిపల్‌ గ్రౌండ్‌ స్విమ్మింగ్‌ఫుల్‌ వద్ద 118 మందికి పరీక్షలు నిర్వహించగా 8 మందికి, గోల్నాక డివిజన్‌ నెహ్రునగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 107 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 26 మందికి పాజిటివ్‌, తిలక్‌నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీలో 18 మందికి, ముషీరాబాద్‌ యూపీహె్‌ససీలో 20 మందికి, బైబిల్‌హౌస్‌ యూపీహెచ్‌సీలో ఒకరికి, డీబీఆర్‌ మిల్స్‌ యూపీహెచ్‌సీలో 13 మందికి, గగన్‌మహల్‌ యూపీహెచ్‌సీలో 49 మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. 

 

హోం ఐసోలేషన్‌ కిట్లు ఇస్తున్నాం 

కరోనా లక్షణాలతో బాధపడుతున్న ప్రజలకు పరీక్షలు నిర్వహించి వెంటనే రిపోర్టులు ఇస్తున్నాం. పాజిటివ్‌ వచ్చిన వారికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే హోం ఐసోలేషన్‌ మందుల కిట్లను అందజేస్తున్నాం. ప్రజలు తప్పనిసరి కరోనా వైరస్‌ పట్ల జాగ్రత్తలు వహించాలి. కరోనా పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన మందులు వాడితే కరోనా తగ్గిపోతుంది.

-  డాక్టర్‌ కృష్ణమోహన్‌

Updated Date - 2022-01-19T16:01:17+05:30 IST