చిరునామాల గల్లంతు ?

ABN , First Publish Date - 2020-08-04T11:00:48+05:30 IST

కరోనా పాజిటివ్‌ బాధితుడు ఒక్కరు కూడా బయట తిరగడానికి వీలు లేకుండా ప్రభుత్వాధికారులు అన్ని చర్యలు ..

చిరునామాల గల్లంతు ?

1500 పాజిటివ్‌ కేసులవి అవి !

డేటా ఎంట్రీలో ఎగిరిపోయిన అడ్రస్సులు

కొవిడ్‌  అధికారుల్లో కలవరం

మిస్‌ అయినట్లు ఫిర్యాదులు వచ్చాయి : జేసీ


నెల్లూరు, ఆగస్టు3 (ఆంధ్రజ్యోతి):  కరోనా పాజిటివ్‌ బాధితుడు ఒక్కరు కూడా బయట తిరగడానికి వీలు లేకుండా ప్రభుత్వాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన వారిని వెంబడించి ఆసుపత్రికి తరలిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చి, వ్యాధి లక్షణాలు కనిపించని వారిని హోం ఐసొలేషన్‌లో ఉండమంటున్నారు. వీరు బయటకు తిరగకుండా నిరంతరం నిఘా ఉంచుతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఇన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా పొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి. సుమారు 1500 పాజిటివ్‌ కేసులకు సంబంధించిన బాధితుల చిరునామాలు గల్లంతు అయ్యాయి. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పాజిటివ్‌ వచ్చిన 1500 మంది ఎవరో..!. వారు ఇప్పటికి ఎందరితో కాంటాక్టులోకి వెళ్లారో..!? తెలియక ఆందోళన చెందుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు..


ప్రత్యేక నెంబరు కేటాయింపు

స్వాబ్‌ నమూనాలు తీసుకునే సమయంలో బాధితుల చిరునామాలు స్వీకరిస్తారు. వీటిని ఓ ఫాంలో నింపి దానికి  ప్రత్యేకమైన నెంబరు ఇస్తారు. ఆ నెంబరును స్వాబ్‌ నమూనా టెస్ట్‌ ట్యూబ్‌పై రాసి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపుతారు. పరీక్ష అనంతరం ల్యాబ్‌ నుంచి ఫలానా నెంబరు గల శ్యాంపిల్‌కు పాజిటివ్‌ వచ్చింది అని పేర్కొంటూ రిపోర్టు ఇస్తారు. ఈ రిపోర్టు ఆధారంగా ఆ నెంబరు ఏ వ్యక్తికి ఇచ్చారో పరిశీలించి ఆ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లుగా గుర్తించి సదరు వ్యక్తికి సమాచారం అందిస్తారు.


ఇది పద్ధతి. అయితే ఇక్కడ ఏమి జరిగిందంటే స్వాబ్‌ టెస్ట్‌ ట్యూబ్‌లకు నెంబర్లు ఇచ్చారు కాని బాధితుల అసలు చిరునామాలను కంప్యూటర్‌లో ఎక్కిండంలో పొరబాటు చేసినట్లు తెలిసింది. ల్యాబ్‌ నుంచి వచ్చిన నెంబరింగ్‌ ఆధారంగా వెదికితే ఆ నెంబర్లకు సంబం ధించిన చిరునామాలు కంప్యూటర్‌లో గల్లంతు అయినట్లు తెలిసింది. సుమారు 1500 కేసులకు సంబంధించిన చిరునామాలు డేటా ఎంట్రీలో కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఇవన్నీ పాజిటివ్‌ కేసులు కావడంతో రాష్ట్ర స్థాయిలో కొవిడ్‌ అధికార వర్గాల్లో కలకలం రేగింది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా ప్రతి పాజిటివ్‌ కేసు విషయంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎంతో జాగ్రత్తలు తీసుకొంటుండగా సుమారు 1500 పాజిటివ్‌ కేసులకు సంబంధించిన చిరునామాలు గల్లంతు అయ్యాయ న్న ప్రచారం పెద్ద దుమారం రేపింది. అంటే 1500 కేసులకు పాజిటివ్‌ వచ్చినట్లు తెలియదు.


వైద్య శాఖ నుంచి వారి టెస్టుకు సంబంధించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో వీరు తమకు నెగిటివ్‌ వచ్చిందని భావించి వైద్యానికి దూరమై ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు. వీరి నుంచి మరింత మందికి వైరస్‌ వ్యాప్తి చెందే అస్కారం ఉంది.  అసలే ఎవరికి ఉందో, ఎవరికి లేదో అంతుపట్టని రీతిలో వైరస్‌ సామాజికవ్యాప్తికి చేరుకున్న దశలో గుర్తించిన 1500 మందిని చిరునామాల గల్లంతు కావడం అధికార వర్గాలను ఆందోళన కు గురిచేస్తున్నట్లు తెలిసింది. ఈ సంఘటనలకు బలం చేకూర్చేలా రెండు రోజులుగా జాయింట్‌ కలెక్టర్‌ వినోద్‌కుమా ర్‌ స్వాబ్‌ సేకరణ కేంద్రాల్లో డేటాఎంట్రీని పరిశీలిస్తుండటం గమనార్హం. 2వ తేదీ జీజీహెచ్‌లో, 3వ తేదీ పడారపల్లి స్వాబ్‌సేకరణ కేంద్రాల్లో డేటాఎంట్రీ సక్రమంగా చేస్తున్నారా, లేదా అనే విషయాలను జేసీ పరిశీలించడం గమనార్హం. పాజిటివ్‌ కేసుల చిరునామాల గల్లంతు విషయమై జాయింట్‌ కలెక్టర్‌ను ఆంధ్రజ్యోతి అడగ్గా డేటాఎంట్రీలో అడ్రస్సులు మిస్‌ అయినట్లు తమకు ఫఙర్యాదులు అందాయని, పరిశీ లిస్తున్నామని సమాధానం ఇచ్చారు. 

Updated Date - 2020-08-04T11:00:48+05:30 IST