Abn logo
Aug 9 2020 @ 04:26AM

కరోనా వేళ బెజవాడవాసుల దాతృత్వం

విజయవాడ, (ఆంధ్రజ్యోతి): బంధాలు, బంధువులు దూరమవుతున్న కరోనా కష్టకాలం ఇది. నిన్నటివరకు ‘పాజిటివ్‌’గా ఉండాలన్న ప్రపంచం ఇప్పుడు ఆ పదాన్ని వినడానికే భయపడుతోంది. కొవిడ్‌ బాధితులు, బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న సామాజిక వివక్ష, ఆర్థిక కష్టాలకు అంతేలేదు. అంతో ఇంతో చలించే హృదయాలు కూడా గడప దాటాలంటే భయపడుతున్న దుస్థితి. అయితేనేం... చీకటిని వెన్నంటే వెలుగును పంచే రవికిరణంలా మానవత్వం మిగిలే ఉందంటూ చాటిచెప్పే సహృదయులకు బెజవాడలో కొదవే లేదు. ఇది కేవలం వాణిజ్యవాడే కాదని.. కారుణ్యవాడ కూడానంటూ చాటిచెప్పే మానవతామూర్తుల కథనమిది...


పిల్లలూ.. మీకు మేమున్నాం..

కుటుంబాల్లో తల్లిదండ్రులు కరోనా బారిన పడితే ఆ పిల్లల పరిస్థితి వేదనాభరితం. నిన్నటివరకూ ముద్దుగా పలకరించిన పక్కంటి పిలుపులు ఆగిపోతాయి. అరమరికలు లేకుండా ఆడుకున్న స్నేహం ఆగిపోతుంది. అలాంటి స్థితిలో ఉన్న పిల్లల కోసం ఏదైనా చేయాలన్న తపన నుంచి పుట్టిందే ‘విద్యార్థి’. ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన మాజేటి మాధవి పిల్లల వైద్యురాలు.


తల్లిదండ్రులకు పాజిటివ్‌ వచ్చి, పిల్లలకు నెగిటివ్‌ వస్తే తలెత్తే సమస్యకు తల్లి హృదయంతో ఆమె చూపిన పరిష్కారమే ‘విద్యార్థి’. తల్లిదండ్రులు ఐసోలేషన్‌కో, ఆసుపత్రికో వెళితే వారి పిల్లలను ఈ సంస్థ అక్కున చేర్చుకుంటోంది. 8-15ఏళ్లలోపు చిన్నారులకు ఉచితంగా క్వారంటైన్‌ ఇస్తోంది. ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌, పాలు, రాత్రికి భోజనం ఇస్తారు. భౌతిక దూరం ఉండేలా 36 పడకలను రెండు హాళ్లలో ఏర్పాటు చేశారు. అవసరమైన వారు 9346582838 నెంబర్‌లో సంప్రదించాలని విద్యార్థి మేనేజర్‌ శ్వేత తెలిపారు.


అంతిమ సంస్కారాల్లో అయినవారై..

కొవిడ్‌తో మృతిచెందిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులూ ముందుకు రాని పరిస్థితి. ఎక్స్‌కవేటర్లలో మృతదేహాలను తరలించి పూడ్చివేస్తున్న అమానవీయ దృశ్యాలు అక్కడో ఇక్కడో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మేమున్నాం అంటూ ‘విజయవాడ హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ ముందుకొచ్చింది. ఈ సంస్థ సభ్యులు చందన వెంకట్‌, ఎన్‌.నాగార్జున, హరిరామకృష్ణ, కె.కృష్ణ... కొవిడ్‌తో మృతిచెందిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, ఏలూరు, గుంటూరు నగరాల్లో వీరు తమ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన 27 మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎవరికైనా తమ అవసరం ఉంటే 9949926465 నెంబరుకు ఫోన్‌ చేయాలని సంస్థ నిర్వాహకులు కోరారు.


ఆరోగ్యానికి ‘పుట్టగుంట’ బీమా

కరోనా తెచ్చే అనాకానేక ఆర్థిక కష్టనష్టాలను అధిగమించేందుకు గ్లోబల్‌ సర్వీస్‌ ట్రస్ట్‌ సారఽథి పుట్టగుంట సతీశ్‌ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. తన ఫ్యాక్టరీలో పనిచేసే వారికి, బంధుమిత్రుల్లో ఆదాయ వనరులు పెద్దగా లేనివారికి, తన వద్దకు వచ్చే పేదలకు కరోనా ఆరోగ్య బీమాను సొంత డబ్బుతో చేయించారు. ఇప్పటి వరకు సుమారు 120 మందికిపైగా రూ.32 కోట్ల విలువైన ఆరోగ్య బీమాను పొందారు. దీనికోసం రూ.20 లక్షల ప్రీమియాన్ని సొంత డబ్బుతో సతీశ్‌ చెల్లించారు.


అలాగే, లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో జిల్లాలో సుమారు లక్షమందికి భోజన సదుపాయాలు కల్పించారు. గన్నవరంలోని తన కర్మాగారంలో పనిచేసే యూపీ, బెంగాల్‌కు చెందిన 600 మంది కార్మికులకూ సొంత ఖర్చుతో భోజన సదుపాయాలు కల్పించారు. లాక్‌డౌన్‌ అనంతరం స్వయంగా బస్సులు ఏర్పాటుచేసి వారిని వారి సొంత గ్రామాలకు తరలించారు. రూ.20 లక్షల విలువైన శానిటైజర్లు, మాస్కులు, ఫేస్‌ షీల్డులు, పీపీఈ కిట్లను జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బందికి, పోలీసులకు అందజేశారు. 

Advertisement
Advertisement