నిర్లక్ష్యాన్ని వీడేదెన్నడు

ABN , First Publish Date - 2021-04-11T05:09:16+05:30 IST

కరోనా వైరస్‌ నుంచి రక్షించుకోవాలని ఉన్న ఏకైక మార్గం నిర్లక్ష్యాన్ని వీడి స్వీయ నియంత్రణ పాటించడం. అయితే అత్యధిక శాతం మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేజేతులా కరోనా వైరస్‌ పాజిటివ్‌ బారిన పడుతున్నారు.

నిర్లక్ష్యాన్ని వీడేదెన్నడు
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం

స్వీయ నియంత్రణపై దృష్టిసారించని ప్రజలు

తాజాగా ఐటీడీఏలో మరో 12 పాజిటివ్‌ కేసులు

భద్రాచలం, ఏప్రిల్‌ 10: కరోనా వైరస్‌ నుంచి రక్షించుకోవాలని ఉన్న ఏకైక మార్గం నిర్లక్ష్యాన్ని వీడి స్వీయ నియంత్రణ పాటించడం. అయితే అత్యధిక శాతం మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేజేతులా కరోనా వైరస్‌ పాజిటివ్‌ బారిన పడుతున్నారు. రెండు రోజులుగా భద్రాచలం పట్టణంలో మొబైల్‌ వెహికిల్‌ ద్వార కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో కేవలం నిర్లక్ష్యం కారణంగానే పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం నాడు ఆదర్శనగర్‌ ప్రాంతంలో నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో 20 పాజిటివ్‌లు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందులో తొమ్మిది మంది భద్రాచలం ఐటీడీఏలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారే ఉన్నారు. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై పూర్తిస్థాయిలో పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. కూరగాయల మార్కెట్‌, సినిమా హాళ్లు, ఇతర వ్యాపార సముదాయాల వద్ద ప్రజలు ఏ మాత్రం బౌతిక దూరంపై దృష్టిసారించకపోవడం కరోనా వ్యాప్తికి కారణమవుతోందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. 

తాజాగా ఐటీడీఏలో 12 కేసులు 

భద్రాచలం ఐటీ డీఏ ప్రాంగణంలో శనివారం కరోనా వైద్య పరీక్షలను వైద్య సిబ్బంది నిర్వహించారు. ఈ సమయంలో తాజాగా మరో 12 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. ఐటీడీఏలోని రెండు విభాగాల్లో అత్యధిక శాతం మంది కరోనా పాజిటివ్‌ బారిన పడటం అధికారులు గుర్తించారు. దీంతో ఐటీ డీఏలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారికి, ఐటీడీఏ క్వార్టర్స్‌లో నివసిస్తున్న వారికి పూర్తిస్థాయిలో కరోనా వైద్య పరీక్షలను నిర్వహించారు. ఇదే సమయంలో ఐటీడీఏ ప్రధాన గేటుకు సైతం తాళం వేశారు. కాలనీ వైపు ఉన్న గేటు నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది సైతం ఐటీడీఏ ఆవరణలోకి అత్యవసరమైతే తప్ప ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. వరుస సెలవుదినాలు రావడంతో  బుధవారం వరకు ఐడీఏ కార్యాలయ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు సమాచారం. దీని ద్వార కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా కట్టడి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఐటీడీఏ ప్రాంగణంలో హైపో క్లోరైడ్‌ ద్రావణం స్ర్పే చేయించారు. 

Updated Date - 2021-04-11T05:09:16+05:30 IST