మాంసాహార ప్రియం

ABN , First Publish Date - 2020-09-24T07:41:12+05:30 IST

కొవిడ్‌-19 ప్రారంభ దశలో చికెన్‌ తింటే వైరస్‌ సోకుతుందని వదంతులు రావడంతో నాన్‌వెజ్‌ వ్యాపారం మొత్తం చతికిలపడింది. కానీ ప్రస్తుతం నాన్‌వెజ్‌ తినడానికి

మాంసాహార ప్రియం

భానుగుడి (కాకినాడ)

కొవిడ్‌-19 ప్రారంభ దశలో చికెన్‌ తింటే వైరస్‌ సోకుతుందని వదంతులు రావడంతో నాన్‌వెజ్‌ వ్యాపారం మొత్తం  చతికిలపడింది. కానీ ప్రస్తుతం నాన్‌వెజ్‌ తినడానికి అమ్మో అనాల్సిన పరిస్థితిలో కూడా మాంసాహార మార్కెట్ల వైపు జనం పరుగులు తీస్తు న్నారు. శని, ఆదివారాలే కాకుండా ప్రతీరోజూ నాన్‌వెజ్‌ మార్కెట్లు కిటకిటలాడుతుండడంతో చికెన్‌, మటన్‌, కోడిగుడ్లు రేట్లను అమాంతం పెంచేశారు. గతంలో కిలో చికెన్‌ రూ.50కు పడిపోగా ఇప్పుడు ఏకంగా రూ.200 దాటి అమ్ముతున్నారు. వైరస్‌పై పూర్తి అవగాహన రావడంతో చికెన్‌, గుడ్లతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెప్తుండడంతో తెగ తినడం మొదలుపెట్టారు. 


చికెన్‌, మటన్‌ కోసం క్యూ...

కరొనా వైరస్‌తో ప్రజల ఆహారపు అలవాట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వారానికి ఐదు రోజుల పాటు చికెన్‌, మటన్‌, కోడిగుడ్లు, చేపలు భోజనంలో ఉండేలా చూసుకుంటున్నారు. తమకు అందుబాటు ధరలో ఉండే చికెన్‌ కోసం అయితే సామాన్యులు నిత్యం క్యూ కడుతున్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ చికెన్‌ సెంటర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు. దీంతో మునుపటి కన్నా ప్రస్తుతం గిరాకీ పెరగడంతో మంచి లాభాలు వస్తున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. నిత్యం చిన్న వ్యాయామాలు చేసుకుంటూనే బలమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఆరోగ్యవంతంగా ఉండేందుకు పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్‌ బాగా ఉంటే వైరస్‌ను తట్టుకునే శక్తి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. 


గిరాకీకి తగ్గట్టుగా చికెన్‌, మటన్‌, కోడిగుడ్లు, చేపల ధరలు కూడా మండుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలలతో పోల్చుకుంటే ప్రస్తుతం కిలో ధర పదింతలు పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడు కిలో మటన్‌ రూ.700-800 మధ్యలో అమ్ముతుండగా చికెన్‌ రూ.200-250 మధ్య విక్రయిస్తు న్నారు. నాటుకోడి అయితే అసలు కొనలేని పరిస్థితిలో రూ.వెయ్యికిపైనే పలుకుతోంది. నిన్న మొన్నటి వరకు రూ.5 ఉన్న కోడిగుడ్డు ధర ఇప్పుడు ఏకంగా రూ.6.50 అయినా అవసరానికి దొరకడం కష్టంగానే ఉంది. 

Updated Date - 2020-09-24T07:41:12+05:30 IST