Abn logo
Oct 28 2020 @ 00:26AM

కష్టమైనా ఇష్టంగా...

Kaakateeya

ఐఐటీలో ఇంజనీరింగ్‌... ఆ తరువాత మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం... దేనికి లోటు లేని జీవితం. కానీ ఆమె ఆలోచనలు ఎప్పుడూ ఫిలిమ్‌ మేకింగ్‌ చుట్టూ తిరుగుతుండేవి. కొలువులో కుదురు లేక... అభిరుచిని ఆస్వాదించలేక మనసు కుదురుగా ఉండేది కాదు. రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయంలో... అంత మంచి ఉద్యోగాన్ని వదిలేశారు ఆర్తీ కడావు. మెగాఫోన్‌ పట్టి సైంటిఫిక్‌ ఫిక్షన్‌ కథాంశంతో ‘కార్గో’ చిత్రాన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా ఎంతో ఆదరణ పొందింది. ఆ విశేషాలు... తన అనుభవాలను ఆర్తి పంచుకున్నారు... 


‘‘నాకు చిన్నప్పటి నుంచి స్టోరీ టెల్లింగ్‌ అనేది ఎంతో ఇష్టమైన హాబీ. అయితే మాది మధ్య తరగతి కుటుబం కావడంతో ఇంట్లో చదువుకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. నేను ఐఐటీ కాన్పూర్‌లో ఇంజనీరింగ్‌ చదివాను. తరువాత మైక్రోసాఫ్ట్‌, వంటి పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేశాను. నా అవసరాలకు ఖర్చు చేసేంత సంపాదించాను. ఈ సమయంలోనే జీవితం ఎలా ఉండాలనే ఆలోచన మొదలయింది. అప్పుడే నా అభిరుచి అయిన స్టోరీ టెల్లింగ్‌కు రెక్కలు తొడిగాను. నాకు బహుమతిగా వచ్చిన వెబ్‌ కెమెరాతో చిన్న చిన్న వీడియోలు చేసేదాన్ని. వాటి ద్వారా రకరకాల కథలు చెప్పేదాన్ని. ఈ క్రమంలోనే వీడియో మేకింగ్‌ నాకు ఎంతో నచ్చింది. వీడియోలు తీయడం కాదు ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు నేర్చుకోవాలని అనిపించింది. 


నాతో మెయిల్‌ రాయించారు... 

ఫిలిమ్‌ మేకింగ్‌ కోర్స్‌ చేయాలనే ఆలోచనతో 2010లో ఉద్యోగానికి గుడ్‌ బై చెప్పాను. మంచి జీతంతో పాటు విదేశీ హాలీడేస్‌ ఇచ్చిన ఉద్యోగాన్ని వదులుకుంటే చాలా కోల్పోతానని తెలుసు. ‘జాబ్‌ మానేస్తున్నా’ అని చెప్పగానే నా స్నేహితులు, మా నాన్న ఆశ్చర్యంగా చూశారు. నా మాటను వాళ్లు సీరియస్‌గా తీసుకోలేదు. మానాన్న అయితే ఏకంగా నాతో ‘నా సొంత నిర్ణయానికి నేనే భాద్యురాలిని, నేను నా నిర్ణయం పట్ల సీరియస్‌గా ఉన్నాను’ అని నాతో ఈ-మెయిల్‌ రాయించారు. ‘నేనుఎంత చెప్పినా వినకుండా ఫిల్మ్‌మేకింగ్‌లో చేరావు అనడానికి నా వద్ద ఉండే రుజువు ఈ ఈ-మెయిల్‌’ అని నాకు పంపిన మెయిల్‌లో రాశారు నాన్న. కొత్తరంగంలో నిలదొక్కుకునే క్రమంలో నేను ఎన్ని కష్టాలు పడతానో అని నాన్న చాలా బాధపడ్డారు. 


భారతీయ సినిమా శైలిలో తీయాలనే ఆలోచనతో ముంబయ్‌లోని ‘విజిలింగ్‌ ఉడ్స్‌ ఇంటర్నేషనల్‌’లో చేరాను. మనకు తెలియని రంగం అనేసరికి మనం మన సత్తాను తక్కువ అంచానా వేసుకుంటాం. కానీ మనం కన్న కల నిజం అయ్యేందుకు కష్టపడేతత్వం, అంకితభావం, క్రమశిక్షణ వంటి లక్షణాలు తోడ్పడతాయి. నా విషయానికొస్తే సినీపరిజ్ఞానం శూన్యం. ఆర్ట్‌, ఫొటోగ్రఫీ, నటనలో నాకు ప్రవేశం లేకపోవడం వల్ల నా కన్నా చిన్నవారు, పనిలో నైపుణ్యం ఉన్నవారితో కలిసి పనిచేస్తున్న కొత్తలో నాకు లోలోపల భయం వేసేది. కోర్సులో చేరిన మొదట్లో చాలా కష్టంగా తోచింది. కానీ పోనుపోను అన్ని విషయాలు నేర్చుకున్నాను. 2012లో కోర్స్‌ పూర్తయిన రోజు నుంచి హిందీ సినిమాలో చాలా తక్కువగా కనిపించే సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో సినిమా తీయాలనుకున్నా. ‘కార్గో’తొ కొత్త అనుభూతి... 

నేను ఇంజనీర్‌ను కావడం వల్ల నా ఆలోచనలు ఎప్పుడూ సైన్స్‌ ఫిక్షన్‌, విశ్వం చుట్టూ తిరుగుతుండేవి. ‘కార్గో’ కన్నా ముందు ‘టైమ్‌ మెషిన్‌’ అనే రొమాంటిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ షార్ట్‌ ఫిలిమ్‌ తీశాను. 40 నిమిషాల నిడివి గల ఈ లఘుచిత్రంలో ప్రేమ, బాల్యం ప్రధానాంశాలు. నేను సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు అందరికన్నా బాగా తీయగలను అని అనుకునేదాన్ని. భారతీయ మూలాలతో నా మొదటి సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా తీశాను. భారతీయులు ఈ సినిమాతో ఎక్కువగా కనెక్ట్‌ అవడమే కాదు హాలీవుడ్‌లో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు చూసే వారికి నా సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. మన దగ్గర సైన్స్‌ఫిక్షన్‌ సినిమాలు చాలా అబద్ధాలు చూపించాయి. అందుకే నేను మన దగ్గరి కథతో, భారతీయులందరూ పోల్చుకునేలా సినిమా చేయాలనుకున్నా. మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన కథలను అల్లుకుంటూ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా తీశాను. అలా నా ఎనిమిదేళ్ల నిరీక్షణ ‘కార్గో’తో ఫలించింది. 


నాన్న గర్వపడుతున్నారు... 

‘కార్గో’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పెద్దహిట్‌ అవడంతో మా నాన్న ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఆయన ‘కార్గో’ మూవీ చూస్తారు. ఈ సినిమా మిగతావాటికన్నా భిన్నంగా ఉందని మెచ్చుకుంటారు. నేను ఏదో సినిమాలా కార్గోను తీయలేదు. స్పేస్‌షిప్‌, క్యారెక్టర్లు.. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్రేము, సన్నివేశం మీద ఎంతో శ్రద్ధ పెట్టాను. చాలామంది అడుగుతుంటారు... ‘ఈ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాకు ఇన్వెస్టర్లను ఎలా ఒప్పించారు’ అని. ఈ సినిమాకు డబ్బులు పెట్టినవారంతా నాకు మంచి స్నేహితులు. వారితో కలిసి నేను వివిధ ప్రాజెక్టులకు పనిచేశాను. నా గురించి తెలిసిన వారు కావడంతో అడడగానే డబ్బుతో పాటు అన్ని విధాలా సాయం చేశారు.

Advertisement
Advertisement