కేర్‌ టేకరే సూత్రధారి

ABN , First Publish Date - 2022-01-19T15:49:09+05:30 IST

ఓ ఇంటికి కేర్‌ టేకర్‌గా వచ్చిన యువకుడు స్నేహితులతో కలిసి అదే ఇంట్లో వృద్ధురాలి మెడలోని బంగారు నగలు అపహరించాడు.

కేర్‌ టేకరే సూత్రధారి

స్నేహితులతో కలిసి చోరీకి పథకం

నిందితులను పట్టించిన దొంగిలించిన వాహనం


కవాడిగూడ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఓ ఇంటికి కేర్‌ టేకర్‌గా వచ్చిన యువకుడు స్నేహితులతో కలిసి అదే ఇంట్లో వృద్ధురాలి మెడలోని బంగారు నగలు అపహరించాడు. కేర్‌ టేకర్‌తో పాటు అతడి స్నేహితులను గాంధీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 9 తులాల బంగారు నగలు, ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్లు, రూ. 27 వేలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో సీఐ మోహన్‌రావు వివరాలు వెల్లడించారు. 


కవాడిగూడ, ఎస్‌బీఐ కాలనీలో కామరాజు, శోభ వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమారులు ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉంటున్నారు. దంపతుల ఇంట్లో కేర్‌ టేకర్‌గా మూడు నెలల క్రితం ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేసముద్రం నివాసి కావేటి రాజు(21) చేరాడు. శోభ మెడలోని బంగారు నగలు దొంగిలించాలని పథకం పన్నాడు. తన స్నేహితులైన అబ్దుల్లాపూర్‌మెట్‌, గండిచెరువుకు చెందిన పూజారి సాయికుమార్‌గౌడ్‌, లష్కర్‌గూడకు చెందిన దినే్‌షకుమార్‌కు విషయం చెప్పాడు. కామరాజు, శోభ దంపతులు తమ ఇంట్లో పోర్షన్‌ అద్దెకు ఇస్తామని టు లెట్‌ బోర్డు పెట్టారు. ఈ విషయాన్ని రాజు స్నేహితులకు తెలియజేయగా వారు ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం ఇల్లు చూసేందుకు వచ్చారు. 


శోభ ఇంటి మొదటి అంతస్తులో పోర్షన్‌ను చూపిస్తుండగా సాయికుమార్‌గౌడ్‌ ఆమె మెడలోని తొమ్మిది తులాల పుస్తెల తాడు, నల్లపూసల గొలుసు లాక్కొని పారిపోతుండగా రాజు అతడిని అడ్డుకుంటున్నట్లు నటించాడు. సాయికుమార్‌గౌడ్‌ తనతో తెచ్చుకున్న చాకుతో రాజు చేతిపై గాయం చేశాడు. ఇంటి సమీపంలో ద్విచక్రవాహనంపై సిద్ధంగా ఉన్న దినే్‌షకుమార్‌తో కలిసి పారిపోయాడు. 


శోభ ఫిర్యాదు మేరకు  పోలీసులు ఇంటి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ద్విచక్రవాహనం నెంబర్‌ ఆధారంగా నిందితులను గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. కొత్త ద్విచక్రవాహనాలు కొనుగోలు చేయాలన్న దురాశతో దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. సాయికుమార్‌గౌడ్‌ మూడు నెలల క్రితం ఓ ద్విచక్రవాహనాన్ని దొంగిలించి దాని నెంబర్‌ మార్చి తిరుగుతున్నాడు. దొంగిలించిన వాహనమే వారిని పోలీసులకు పట్టించింది. 

Updated Date - 2022-01-19T15:49:09+05:30 IST