పర్యాటకంపై అశ్రద్ధ

ABN , First Publish Date - 2021-07-26T05:10:47+05:30 IST

దర్శనీయ ప్రాంతాలు జిల్లాలోని అనేకం ఉన్నా.. వాటి అభివృద్ధి పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు.

పర్యాటకంపై అశ్రద్ధ
ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌

  1. అభివృద్ధి పట్టని ప్రభుత్వాలు
  2. కొవిడ్‌తో సగానికి తగ్గిన ఆదాయం
  3. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలు పునః ప్రారంభం
  4. వసతులు పెంచాలని కోరుతున్న పర్యాటకులు


కర్నూలు(న్యూసిటీ), జూలై 25: దర్శనీయ ప్రాంతాలు జిల్లాలోని అనేకం ఉన్నా.. వాటి అభివృద్ధి  పట్ల ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో పర్యాటక శాఖ భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. దీనికి తోడు పర్యాటక ప్రాంతాలపై కొవిడ్‌ ప్రభావం బాగా పడింది. గత ఏడాది మార్చి తరువాత లాక్‌డౌన్‌ కారణంగా పర్యాటక ప్రదేశాలు మూతబడ్డాయి. ఆ తరువాత అదే ఏడాది జూన్‌లో ప్రారంభమయ్యాయి. తొమ్మిది నెలల పాటు సందర్శకులను ఆహ్లాదపరిచిన పర్యాటక ప్రదేశాలు, రెండోదశ కరోనాతో ఈ సంవత్సరం ఏప్రిల్‌లో మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల పర్యాటక ప్రదేశాలను సందర్శకులకు అందుబాటులోకి తెచ్చారు. జిల్లాలో అనేక ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలు ఉన్నాయి. దట్టమైన నల్లమల్ల అడవులు ప్రకృతి శోభతో అలరారుతుంటాయి. సహజ సిద్ధ రాతివనాలు, బెలూం గుహలు, మహానంది, అహోబిళం, సంగమేశ్వరం, యాగంటి, మద్దిలేటి స్వామి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కానీ కొవిడ్‌ కారణంగా ఈ ప్రాంతాల్లో సందడి తగ్గింది. 


సగానికి తగ్గిన ఆదాయం


జిల్లాకు వచ్చే పర్యాటకులలో శ్రీశైలానికి ఎక్కువగా వెళ్తుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రంతోపాటు కృష్ణా నది, నల్లమల అందాలను చూసేందుకు బోటు షికారు, రోప్‌ వే వంటివి ఉన్నాయి. శ్రీశైలం హరిత హోటల్‌, రోప్‌ వే, బోట్‌ షికారు ద్వారా 2019-20లో పర్యాటక శాఖకు రూ.7.69 కోట్ల ఆదాయం సమకూరింది. అదే 2020-21 సంవత్సరంలో రూ.3.07 కోట్లకు పడిపోయింది. బెలుం గుహల ద్వారా 2019-20 రూ.1.16 కోట్లు రాగా 2020-21 రూ.51.82 లక్షలు మాత్రమే వచ్చింది. ఓర్వకల్లు రాతివనాల ద్వారా 2019-20లో రూ.1.05 కోట్ల ఆదాయం సమకూరగా, 2020-21 నాటికి రూ.77 లక్షలకు పడిపోయింది., అహోబిలం 2019-20 రూ.24.34 లక్షలు, 2020-21 రూ.11.09 లక్షలు సమకూరింది. 


మహనంది హరిత హోటల్‌ ద్వారా 2019-20 రూ.80.47 లక్షలు సమకూరగా 2020-21 ఏడాది రూ.1.54 కోట్లు, కర్నూలు హరిత హోటల్‌ 2019-20 రూ.1.38 కోట్లు, 2020-21 రూ.5.99 సమకూరింది. ఈ రెండు రెస్టారెంట్ల నుంచి కొవిడ్‌ బాధితులకు భోజనం సరఫరా చేశారు. అందుకే ఆదాయం పెరిగిందని అధికారులు తెలిపారు. 


మెరుగుపరచాలి..


ఓర్వకల్లు రాతివనాల వద్ద స్విమ్మింగ్‌ పూల్‌, చిన్నారులు ఆడుకునేందుకు స్థలం ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. రాతి వనాల ద్వారా ఏటా రూ.కోటికి పైగా ఆదాయం సమకూరుతుంది. ఇటీవల ఎయిర్‌పోర్టు ప్రారంభం కావడంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న హరిత హోటల్‌ పక్కన బస్‌షెల్టర్‌ ఖాళీగా ఉంది. ఈ స్థలంలో స్విమ్మింగ్‌ పూల్‌ ఏర్పాటు చేసి ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది. సుంకేసుల వద్ద రూ.1.50 కోట్లతో రెస్టారెంటు నిర్మిస్తున్నారు. ఇక్కడ బోట్‌ షికారు లేదు. దీంతో ఆశించినమేర ఆదాయం సమకూరకపోవచ్చని అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అహోబిళంలో రోప్‌ వేకు రూ.7.50 కోట్లు కేటాయించారు. కానీ అటవీశాఖ అనుమతులు రాలేదు. 


అభివృద్ధి ఎక్కడ


పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తే ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కానీ అధికారులు ముందుకు రావడం లేదు. ప్యాపిలి సమీపంలోని వాల్మీకి గుహలు బెలూం గుహలకన్నా పురాతనమైనవి. దీనిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని గతంలో ఎన్నోసార్లు పర్యాటక శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అవుకు కొండలపై నుంచి వచ్చే ఎత్తిపోతల జలపాతం సందర్శకులను అమితకంగా ఆకట్టుకుంటోంది. మంగంపేటలో మరో జలపాతం ఉంది. వర్షాకాలంలో సుమారు నాలుగు నెలల పాటు వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇలాంటి వాటిని అభివృద్ధి చేస్తే పర్యాటకుల నుంచి మంచి ఆదాయం వస్తుంది. ఓర్వకల్లు మండల పరిధిలోని కేతవరం గుహల్లో ఆదివాసులు రాళ్లపై చెక్కిన లిపి, చిత్రాలు ఉన్నాయి. దీనిని అభివృద్ధి చేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. 


ప్రతిపాదనలు పంపాము..


జిల్లాలో పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. కొవిడ్‌ కారణంగా ఓర్వకల్లు, మద్దిలేటి స్వామి, శ్రీశైలం తదితర ప్రాంతాలలో అభివృద్ధి పనులు మందకొడిగా సాగుతున్నాయి. త్వరలో మరికొన్ని పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాము.        

 - ఈశ్వరయ్య, డీవీఎం, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ

Updated Date - 2021-07-26T05:10:47+05:30 IST