లెక్కా పక్కా లేదు!

ABN , First Publish Date - 2020-12-04T06:08:50+05:30 IST

గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తరచూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ కార్యాలయంలో ఏ రికార్డూ సవ్యంగా లేదని అధికారుల దృష్టికి వచ్చింది.

లెక్కా పక్కా లేదు!

గాజువాక సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో గందరగోళం

400కు పైగా డాక్యుమెంట్లను స్కాన్‌ చేయకుండా పక్కనపెట్టేశారు

రిజిస్టర్‌ కూడా గల్లంతు

చక్కదిద్దడానికి ఉన్నతాధికారుల పాట్లు

మిగిలిన కార్యాలయాల్లో పరిస్థితిపైనా ఆరా

ఆకస్మిక తనిఖీలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గాజువాక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తరచూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ కార్యాలయంలో ఏ రికార్డూ సవ్యంగా లేదని అధికారుల దృష్టికి వచ్చింది. ఆనందపురంలో కేవలం ఒక్క డాక్యుమెంట్‌ను స్కాన్‌ చేయకుండా పార్టీ చేతికి ఇచ్చారని అక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేశారు. అయితే గాజువాక కార్యాలయంలో ఏకంగా 400 డాక్యుమెంట్లు స్కాన్‌ చేయకుండా పక్కన పెట్టిన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆగమేఘాలపై వాటిని సరిచేశారు. గాజువాకలో డాక్యుమెంట్‌ రైటర్లు చెప్పిన పనులు చేయకపోతే సబ్‌ రిజిస్ట్రార్లపై ఏసీబీకి ఫిర్యాదుచేయడం రివాజుగా వస్తోంది. వారి తనిఖీల్లో లోపాలు బయటపడడం వల్ల ఇప్పటివరకు ముగ్గురు సబ్‌ రిజిస్ట్రార్లపై వేటు పడింది. దాంతో ఇక్కడ పనిచేయడానికి ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ ముందుకురావడం లేదు. డెప్యుటేషన్‌పై ఎవరినో ఒకరిని తెస్తున్నారు. మొన్నటివరకు శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి చెందిన సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రపాణి ఇక్కడ పనిచేశారు. ఆఫీసుకు వచ్చి సిబ్బందిని బెదిరిస్తున్నారంటూ ఆయన ఓ డాక్యుమెంట్‌ రైటర్‌పై పోలీస్‌ కేసు పెట్టారు. దాంతో సదరు రైటర్‌ను జైలుకు పంపారు. ఇది జరిగిన నెల రోజులకే ఏసీబీకి ఓ ఫిర్యాదు వెళ్లింది. వారు తనిఖీకి వెళ్లారు. విచిత్రమైన అంశాలు వెల్లడయ్యాయి. ఫిర్యాదీకి అసలు కార్యాలయంతో ఎటువంటి సంబంధం లేదని తేలింది. అయితే ఏసీబీ తనిఖీ జరిగింది కాబట్టి చక్రపాణి డెప్యుటేషన్‌ రద్దు చేసి వెనక్కి పంపారు. టెక్కలి నుంచి సురేశ్‌ అనే సబ్‌ రిజిస్ట్రార్‌ను వేశారు. ఆయన కార్యాలయానికి వచ్చి చూసుకుంటే అంతా గందరగోళంగా కనిపించింది. ఒక్క రికార్డు సరిగా లేదు. దాంతో ఆయన మూడు రోజులు బాధ్యతలు స్వీకరించలేదు. తనకు అన్నీ లెక్క కట్టి అప్పగిస్తే...చార్జి తీసుకుంటానని చెప్పడంతో అధికారులు ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ సందర్భంలోనే 400 డాక్యుమెంట్లు స్కాన్‌ చేయలేదని, వేలిముద్రలు వేసే రిజిస్టర్‌ కనిపించకుండా పోయిందని గుర్తించారు. ఆ రిజిస్టర్‌ ఎక్కడ వుందో కనుగొనడానికి ఒక కమిటీని కూడా వేశారు. ఎలాగోలా దాన్ని కూడా తెప్పించారు. ఈ కార్యాలయం పరిధిలో గాజువాక హౌస్‌ కమిటీ రికార్డులు చాలా కీలకమైనవి. ఇవి కూడా కొన్ని కనిపించకుండా పోయాయని ఆరోపణలు రావడంతో అధికారులు   రంగంలోకి దిగారు. గతంలో ఇక్కడ పనిచేసిన సబ్‌ రిజిస్ట్రార్లు  నలుగురిని ఈ వారం రోజుల్లోనే రప్పించి, వారి ద్వారా ఆయా రికార్డులను గుర్తించి, ప్రస్తుత సబ్‌ రిజిస్ట్రార్‌కు అప్పగించారు. ఈ కార్యాలయంలో లెక్కలేనన్ని లొసుగులు, లోపాలు బయటపడడంతో సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు. ఒక్కొక్కరిని ఒక్కో కార్యాలయానికి బదిలీ చేసేశారు. ఇక్కడ బయటపడిన లోపాలు ఇతర కార్యాలయాల్లో కూడా వున్నాయేమోననే ఆలోచనతో ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలకు వెళుతున్నారు. స్కాన్‌ చేయకుండా వుంచిన డాక్యుమెంట్లు, నంబర్లు వేయని డాక్యుమెంట్లు...ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేయడం ఒక్కటే సబ్‌ రిజిస్ట్రార్ల పని కాదని, రికార్డులను పక్కాగా నిర్వహించడం కూడా అందులో భాగమేనని చెబుతూ, అన్ని కార్యాలయాలను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2020-12-04T06:08:50+05:30 IST