ఎందుకంత నిర్లక్ష్యం!

ABN , First Publish Date - 2021-06-17T04:20:43+05:30 IST

కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఆక్సిజన అందక మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది.

ఎందుకంత నిర్లక్ష్యం!
వెంకటగిరి : తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల

కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం వైఫల్యం

మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి

జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆందోళన


నెల్లూరు, జూన 16 (ఆంధ్రజ్యోతి) : కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఆక్సిజన అందక మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. మండల కేంద్రాలు, పట్టణాల్లో నిరసనలు తెలియజేసి, ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఈ సందర్భంగా కురుగుండ్ల మాట్లాడుతూ ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా ఆక్సిజన అందక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారీతిగా దోచుకున్నా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించిందని దుయ్యబట్టారు.  కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, బ్లాక్‌ ఫంగస్‌తో మరణించిన వారికి రూ.25 లక్షలు, జర్నలిస్ట్‌ కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరు నగరం, రూరల్‌ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఆందోళన చేశారు.


నాయుడుపేటలో టీడీపీ నాయకులు ఆందోళన చేసి ఆర్డీవో సరోజినికి వినతిపత్రం సమర్పించారు. సూళ్లూరుపేటలో జరిగిన నిరసనలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రన్న బీమా పథకం రద్దు కారణంగా కరోనా మృతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఈ పథకం అమలులో ఉండి ఉంటే ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడేదన్నారు. గూడూరు, కావలి, ఆత్మకూరులలో  టీడీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. 

Updated Date - 2021-06-17T04:20:43+05:30 IST