జాగ్రత్తగా అడుగులు

ABN , First Publish Date - 2020-04-28T05:55:18+05:30 IST

కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినప్పుడు ఆయనకు ఎప్పటిలాగానే చాలా సలహాలు అందాయి. ఆయా ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువ...

జాగ్రత్తగా అడుగులు

కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినప్పుడు ఆయనకు ఎప్పటిలాగానే చాలా సలహాలు అందాయి. ఆయా ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువ తక్కువలను బట్టి నిర్ణయాలు తీసుకుంటే చాలనీ, గ్రీన్‌జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు ఆరంభించవచ్చునని కొందరు అన్నారట. రాష్ట్రాలకు ఆర్థిక ఉద్దీపనలు ఇవ్వాలని కూడా అడిగారట. లాక్‌డౌన్‌తో ఎంతో మేలు జరిగిందనీ, వేలాదిమందిని కాపాడుకోగలిగామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా మరోమారు గుర్తుచేశారు. కరోనా ప్రభావం రానున్న కొన్ని మాసాలు తప్పదనీ, కనుక ‘దో గజ్‌ దూరీ’ (రెండు గజాల దూరం), ఫేస్‌మాస్కులు నిత్యజీవితంలో అంతర్భాగం చేసుకోవాలనీ అంటూ మరికొంత కాలం ఈ లాక్‌డౌన్‌ మైండ్‌సెట్‌కు దూరం జరగవద్దని పరోక్షంగా హెచ్చరించారు. ప్రధాని స్పష్టంగా చెప్పకపోయినా, ఆయన మాటలను బట్టి, మే 3వతేదీ తరువాత లాక్‌డౌన్‌ ఎత్తివేత దశలవారీగా మాత్రమే ఉంటుందనీ, రెడ్‌జోన్ల రంగు మారేవరకూ అక్కడ కఠినమైన ఆంక్షల యధాతథంగా అమలు జరుగుతాయని అనుకోవాలి.


జాన్‌ భీ జహాన్‌ భీ అని ప్రధాని ఎప్పుడో అనుకున్నారు కానీ, లాక్‌డౌన్‌ పొడిగించాల్సి వచ్చి అది పూర్తిగా సాధ్యపడలేదు. ఇప్పుడాయన ఆర్థికానికి ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగా అనడాన్ని బట్టి, ఇప్పటికే సుదీర్ఘకాలం లాక్‌డౌన్‌లో ఉన్న దేశం తిరిగి ఆర్థిక కార్యకలాపాలకు మళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ గడువు ముగియగానే కేంద్రం కనీసం గ్రీన్‌జోన్ల వరకైనా మరిన్ని కార్యకలాపాలకు వెసులుబాటు ఇచ్చే అవకాశాలున్నాయని కొందరి భావన. ఏ నిర్ణయమూ ధైర్యంగా తీసుకోవాల్సింది అంతిమంగా రాష్ట్రాలే. ప్రధాని సైతం తన మాటల్లో ఇదే భావాన్ని అంతర్లీనంగా వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ మరికొంత కాలం కొనసాగాలనే కోరుకుంటున్నాయి కనుక, వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు నిర్ణయాలు జరగవచ్చు. ఇక, గత సమావేశాల్లో కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ఆర్థిక పరిస్థితి గురించి మోదీకి మొరబెట్టుకున్నారు. ఉద్దీపనలు ఇమ్మన్న రాష్ట్రాల అభ్యర్థనలపై ఇప్పటివరకూ అడుగుపడకపోగా, ఈ సమావేశంలో సైతం ప్రధాని నోట హామీలేమీ దక్కలేదు. కరోనా కాలంలో ఆదాయం బాగా పడిపోయి, రోగ వ్యాప్తి నిరోధానికి ఖర్చు ఎక్కువ చేస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక దన్ను అత్యవసరం.


రాష్ట్రాలకే కాదు, ఆర్థికరంగాన్ని తిరిగి గాడినపెట్టడానికి పరిశ్రమలు, వ్యాపారాలకు అవసరమైన ఉద్దీపనల విషయంలోనూ కేంద్రం తాత్సారం చేస్తున్నది. ఈ సమావేశంలో సామాన్యుడికి మేలు చేసే సంస్కరణలంటూ ప్రధాని ఓ మాట అనడాన్ని బట్టి, ఆయన మనసులో ఎంతోకాలంగా మిగిలిపోయిన సంస్కరణలను కూడా మనం రాబోయే కాలంలో చూడవలసి రావచ్చు. వలస కూలీల తరలింపు మార్గాల గురించి ముఖ్యమంత్రులు కొందరు ప్రస్తావించినప్పుడు వారు లేకుండా పరిశ్రమలు ఎలా నడుపుతారన్న ప్రధాని ప్రశ్న సముచితమైనది. కరోనాపై పోరులో రాష్ట్రాలు, పంచాయితీల పాత్రను ప్రశంసిస్తున్న ప్రధాని, ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల సంఘటిత పోరు గురించి ప్రత్యేకంగా గుర్తుచేయడం వెనుక పశ్చిమబెంగాల్ పరిణామాలు ఉండివుండవచ్చు. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలు సరిగా అమలు చేయడం లేదనీ, కేసులు కూడా దాచేస్తున్నాయని కేంద్రం అభిప్రాయం. ఈ కష్టకాలంలో తమకు కేంద్రం అన్ని విధాలుగా సహకరించడం లేదని రాష్ట్రాలు భావిస్తున్నాయి.


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అపార్థాలు, అనుమానాలకు అవకాశం ఉన్న ఈ తరుణంలో ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో ఒక అత్యున్నతస్థాయి సంఘం ఏర్పడటం ఉపకరిస్తుందని నిపుణుల సూచన. దీనిద్వారానే అన్ని వ్యవహారాలు నడిపినపక్షంలో, రాష్ట్రాల మధ్య సహకారం, వాటి అవసరాలను తీర్చడం సులభమన్నది భావన. కొవిడ్‌ సంక్షోభం ఇప్పట్లో ముగిసేది కాదని అంటున్నప్పుడు, అన్ని నిర్ణయాలూ ఈ అత్యున్నతస్థాయి సంఘం ద్వారా జరగడం వల్ల రాజకీయాన్ని కాస్తంత దూరం పెట్టవచ్చు. మే 3 తరువాతి దశకు సంబంధించి కేంద్రం ఇచ్చే వెసులుబాట్లు కొత్త సమస్యలు తెచ్చిపెట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఆర్థిక కార్యకలాపాల గురించి ఒకపక్క మాట్లాడుతూనే, జూన్‌ జులై మాసాల్లో కరోనా కేసుల విజృంభణ ఉంటుందనీ, రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని ప్రధాని మరోవైపు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రంగాల్లో వెసులుబాట్లు ఇచ్చిన అనుభవాన్ని కూడా కలుపుకొని భవిష్యత్తువైపు అడుగులు పడాలి.

Updated Date - 2020-04-28T05:55:18+05:30 IST