కేర్‌ టేకర్లుగా.. టీచర్లు

ABN , First Publish Date - 2021-05-11T05:57:27+05:30 IST

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఆ పని పక్కన బెట్టి తనకు సంబంధం లేని పనులు చేస్తూ అయోమయస్థితిలో ఉన్నాడు.

కేర్‌ టేకర్లుగా.. టీచర్లు

కొత్తగా కొవిడ్‌ బాధ్యతలు

ఇప్పటికే జిల్లాలో పలువురి మృతి

ఆందోళనలో ఉపాధ్యాయ వర్గాలు 

 

పాఠశాలల నిర్వహణ.. ఎన్నికల విధులు.. ఇలా కరోనా కష్ట కాలంలో ఉపాధ్యాయులు పని చేశారు. దీంతో పలువురు కరోనా బారిన పడ్డారు. ఎందరో కరోనా కాటుకు బలయ్యారు. ఉపాధ్యాయులతో పాటు వారి కుటుంబాలను కూడా కరోనా కల్లోలపరిచింది. ఈ పరిస్థితుల్లో కొవిడ్‌ బాధితుల కేర్‌ టేకర్లుగా ఉపాధ్యాయులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసలే ఆందోళనకర పరిస్థితుల్లో.. ఆపై తమకు తెలియని విషయాలపై తమను పనులు చేయమనడం ఏమిటంటూ ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రధానోపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్‌ టీచర్ల వరకు అందరికీ ఈ బాధ్యతలను అప్పగించింది. దీంతో కొవిడ్‌ బాధితుల యోగక్షేమాలు తెలుసుకోవడం ఉపాధ్యాయులకు కష్టంగా మారింది.  


గుంటూరు(తూర్పు), మే 10: పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఆ పని పక్కన బెట్టి తనకు సంబంధం లేని పనులు చేస్తూ అయోమయస్థితిలో ఉన్నాడు. ప్రభుత్వం అవగాహన లేని పనులు అప్పగిస్తుండటంతో వాటికి న్యాయం చేయలేక అల్లాడుతున్నాడు.  పాఠాలతో పాటు ఇతర బాధ్యతలు కూడా అప్పగించడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వీటితో ఇప్పటికే చాలామంది ఉపాధ్యాయులు ఆనారోగ్యం బారిన పడ్డారు. కొంతమంది మృతి చెందగా.. పలువురు చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఉపాధ్యాయులను కొవిడ్‌ బాధితులకు కేర్‌ టేకర్లుగా నియమించింది. ఇలా నియమితులైన ఉపాధ్యాయుడికి కొంతమంది కొవిడ్‌ బాధితులను కేటాయిస్తారు. అలా కేటాయించిన బాధితుడికి ఫోను చేసి ఎం మందులు వాడుతున్నారు, ఎటువంటి ఆహారం తీసుకున్నారు తదితర  వివరాలను సేకరించి జిల్లా యంత్రాగానికి ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయులు చేరవేయాలి. ఈ విధంగా 14 రోజులపాటు బాధితుల వివరాలు సేకరించి అధికారులకు పంపాలి. అయితే ఇప్పటికే వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎమ్‌లు కొవిడ్‌ విధుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా తామేమి చేయాలంటూ కొంతమంది ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


విద్యాదీవెన కిట్ల బాధ్యత కూడా

ప్రధానోపాధ్యాయులకు జగనన్న విద్యాదీవెన కిట్లు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. గతంలో ఈ కిట్లు తొలుత జిల్లా కార్యాలయాలకు అక్కడి నుంచి మండల కార్యాలయాలకు వచ్చేవి. అధికారులు మండల కార్యాలయాల్లో వాటిన భద్రపరిచి పాఠశాలల ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు అందించేవారు. కాని ఈ సంవత్సరం కిట్లను పాఠశాలకు తరలించి వాటిని జాగ్రత్త చేయాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులేదనని అధికారులు ఆదేశించారు.  ఒక్కో ఉన్నత పాఠశాలను ఒక్కో కాంప్లెక్స్‌గా తీసుకుంటే దాని పరిధిలో 11-15 చిన్న చిన్న పాఠశాలలు ఉంటాయి.  ఇన్ని పాఠశాలల కిట్లను రెండు, మూడు నెలలు కాపాడటం అంటే సాధ్యమయ్యే పనేనా అంటూ ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


డ్రై రేషన్‌ పంపిణీ బాధ్యత కూడా

కొవిడ్‌ కారణంగా పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. దీంతో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన స్థానంలో ప్రభుత్వం డ్రైరేషన్‌ పంపిణీ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. వీటి నిర్వహణ కూడా పాఠశాలల ఉపాధ్యాయులకు అందించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఒక్కో ఉపాధ్యాయుడు దాదాపు 50 మంది విద్యార్థులకు డ్రైరేషన్‌ పంపిణీ చేయాల్సి ఉంటుంది. కొవిడ్‌ పరిస్థితుల్లో విద్యార్థులు, వారి తల్లి దండ్రులు డ్రైరేషన్‌ కోసం పాఠశాలలకు రావడం కష్టమే. అలాంటప్పుడు ఉపాధ్యాయులు ఇంటింటికెళ్లి సరుకులు ఇచ్చిరావాలి. ప్రతి ఇంటికెళ్లి సరుకులు ఇచ్చిరావడం ఉపాధ్యాయులకు సాధ్యపడేనా.. మరి దీని గురించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Updated Date - 2021-05-11T05:57:27+05:30 IST