గర్భిణులా... ఆందోళన వద్దు!

ABN , First Publish Date - 2020-05-05T16:08:17+05:30 IST

తరచూ వైద్యపరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నవారు లాక్‌డౌన్‌ కారణంగా అసుపత్రులకు వెళ్ళడం కష్టం అవుతోంది. ముఖ్యంగా గర్భిణుల్లో

గర్భిణులా... ఆందోళన వద్దు!

ఆంధ్రజ్యోతి(05-05-2020):

తరచూ వైద్యపరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నవారు లాక్‌డౌన్‌ కారణంగా అసుపత్రులకు వెళ్ళడం కష్టం అవుతోంది. ముఖ్యంగా గర్భిణుల్లో ఆందోళన అధికంగా ఉంటోంది. అయితే వేరే అనారోగ్య సమస్యలేవీ లేనప్పుడు, ప్రెగ్నెన్సీకీ, ప్రసవానికీ ప్రమాదం ఉందని గత పరీక్షల్లో నిర్ధారణ కానప్పుడూ బెంగ పడనక్కరలేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు.


శరీరంలో హఠాత్తుగా ఏవైనా మార్పులు వచ్చాయా అనేది గమనిస్తూ ఉండండి. అనుమానం కలిగితే ఫోన్‌ ద్వారానో, వీడియోకాల్‌ ద్వారానో వైద్యులను సంప్రతించండి.


గర్భంతో ఉన్నప్పుడు బరువు పెరగడం సాధారణంగా జరుగుతుంది. మరీ ఎక్కువగా బరువు పెరుగుతూ ఉంటే వైద్యుల సలహాతో ఇంట్లోనే వ్యాయామం చెయ్యండి.


ప్రస్తుత పరిస్థితుల్లో నడక కోసం బయటకు వెళ్ళడం మంచిది కాదు. అయితే గర్భిణులు ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఇంట్లో గదుల్లోనూ, వరండాల్లోనూ, మేడపైనా వ్యాయామం చేసుకోవచ్చు.


మీ వ్యాయామాన్ని ప్లాన్‌ చేసుకోవడానికి వీలుగా అనేక యాప్స్‌ ఉన్నాయి. వాటిని ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోండి. నడుస్తున్నప్పుడు మీరు ఎన్ని అడుగులు వేశారో, ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయో అవి చెబుతాయి. ఫిట్‌నె్‌సను ట్రాక్‌ చేసే రిస్ట్‌ బ్యాండ్లను కూడా ఉపయోగించుకోవచ్చు.


శరీరం మీద ఒత్తిడి పెంచి, శ్రమ కలిగించే వ్యాయామాలు చేయకండి. తేలికపాటి వ్యాయామాలు, శరీరం అనుమతించే యోగాభ్యాసాలు చేయండి.


పరిశుభ్రత పాటించండి. ఊపిరితిత్తుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.


లాక్‌డౌన్‌ సమయంలో అంతర్గతమైన దిగులు, నిరాశ, నిస్సత్తువలకు గురికావడం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. ప్రాణాయామం, ధ్యానం శరీరాన్ని ఉల్లాసపరుస్తుంది. మనసుకు సాంత్వన ఇస్తుంది.


గర్భధారణ సమయంలో డైటింగ్‌ లాంటివి పొరపాటున కూడా చెయ్యకండి. మీకూ, మీ గర్భంలోని బిడ్డకూ అవసరమైన పోషకాలన్నీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. 


ప్రతిరోజూ ఆహారంలో పండ్లూ, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్‌ ఉండేలా ప్లాన్‌ చేసుకోండి.


అన్నం, రొట్టెలతో పాటు పాలు, పెరుగు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు దినుసులు, కోడి గుడ్లు, సోయాబీన్‌, చేపలు లాంటివి గర్భిణుల ఆహారంలో ముఖ్యంగా ఉండాలి. 


రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ‘విటమిన్‌-సి’ ఉన్న పండ్లు, పసుపు, తేనె, అల్లం లాంటివి ఆహారంతో పాటు తీసుకోండి.


ఎల్లప్పుడూ అహ్లాదంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏకాంతంలో కన్నా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. నైరాశ్యాన్ని కలిగించే ఆలోచనలు చేయకండి.

Updated Date - 2020-05-05T16:08:17+05:30 IST