శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌ సర్చ్‌

ABN , First Publish Date - 2021-11-27T04:10:55+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో కార్డన్‌సర్చ్‌లు నిర్వహిస్తున్నట్టు మెదక్‌ డీఎస్పీ సైదులు పేర్కొన్నారు. రేగోడు మండలం సిందోల్‌ గ్రామంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు కార్డన్‌సర్చ్‌ నిర్వహించారు.

శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌ సర్చ్‌
సిందోల్‌ గ్రామంలో కార్డన్‌ సర్చ్‌లో పట్టుబడిన వాహనాలు, మద్యం, గుట్కా ప్యాకెట్లు

గంజాయి, గుట్కా కలిగి ఉంటే కఠిన చర్యలు

మెదక్‌ డీఎస్పీ సైదులు

సిందోల్‌ గ్రామంలో కార్డన్‌సర్చ్‌ 

25 బైకులు, ఒక ఆటో, మద్యం, గుట్కా సీజ్‌


 రేగోడు, నవంబరు 26: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో కార్డన్‌సర్చ్‌లు నిర్వహిస్తున్నట్టు మెదక్‌ డీఎస్పీ సైదులు పేర్కొన్నారు. రేగోడు మండలం సిందోల్‌ గ్రామంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు కార్డన్‌సర్చ్‌ నిర్వహించారు. ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 75 మంది పోలీసులు గ్రామంలోని ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్‌ చేశారు. రెండు దుకాణాల్లో నిర్వహించిన సోదాల్లో మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సిందోల్‌ గ్రామంలో గంజాయి పండిస్తారనే సమాచారంతో సోదాలు చేశామని చెప్పారు. గంజాయి, గుట్కాలను కలిగిఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనుమతి లేకుండా మద్యం అమ్మరాదని సూచించారు. వాహనాలకు సరైన పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేనివారు వెంటనే పొందాలని సూచించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతీ గ్రామంలో సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఒక్క సీసీకెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పత్రాలను చూపించి సీజ్‌ చేసిన వాహనాలు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో అల్లాదుర్గం సీఐ జార్జీ, రేగోడు ఎస్‌ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T04:10:55+05:30 IST