బీపీ మందుల్లో క్యాన్సర్‌ కారకాలు

ABN , First Publish Date - 2021-10-15T07:33:17+05:30 IST

వాల్‌సార్టన్‌.. లోసార్టన్‌.. ఇర్బెసార్టన్‌.. పేరేదైనాగానీ, ఇవన్నీ ఒకే శ్రేణికి చెందిన ఔషధాలు. ‘సార్టన్‌ డ్రగ్స్‌’గా వ్యవహరించే ఈ మందులను.. అధికరక్తపోటు, హృద్రోగాలకు వాడతారు. అయితే, ఈ మందుల్లో క్యాన్సర్‌ రావడానికి కారణమయ్యే ‘ఎన్‌-నిట్రోసోడిమిథైలమైన్‌ (ఎన్‌డీఎంఏ)’ అనే కార్సినోజెన్‌ ఉందనే కారణంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫార్మా కంపెనీలు ఈ ఔషధాలను మార్కెట్‌ నుంచి రీకాల్‌ చేస్తున్నాయి. తాజాగా.. ఈ ఔషధాల్లో అదే (క్యాన్సర్‌) ముప్పు కలిగించే ‘అజిడో ఇంప్యూరిటీస్‌’ కూడా ఉన్నట్టు ఔషధ నియంత్రణ సంస్థలు గుర్తించాయి.

బీపీ మందుల్లో క్యాన్సర్‌ కారకాలు

సార్టన్‌ డ్రగ్స్‌లో అజిడో ఇంప్యూరిటీస్‌

వాటితో డీఎన్‌ఏ దెబ్బతిని క్యాన్సర్‌ వచ్చే ముప్పు

రీకాల్‌ చేస్తున్న ఔషధ నియంత్రణ సంస్థలు

హెటెరో ల్యాబ్స్‌ తయారీ ప్రక్రియలో లోపాలు

వాషింగ్టన్‌, అక్టోబరు 14: వాల్‌సార్టన్‌.. లోసార్టన్‌.. ఇర్బెసార్టన్‌.. పేరేదైనాగానీ, ఇవన్నీ ఒకే శ్రేణికి చెందిన ఔషధాలు. ‘సార్టన్‌ డ్రగ్స్‌’గా వ్యవహరించే ఈ మందులను.. అధికరక్తపోటు, హృద్రోగాలకు వాడతారు. అయితే, ఈ మందుల్లో క్యాన్సర్‌ రావడానికి కారణమయ్యే ‘ఎన్‌-నిట్రోసోడిమిథైలమైన్‌ (ఎన్‌డీఎంఏ)’ అనే కార్సినోజెన్‌ ఉందనే కారణంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫార్మా కంపెనీలు ఈ ఔషధాలను మార్కెట్‌ నుంచి రీకాల్‌ చేస్తున్నాయి. తాజాగా.. ఈ ఔషధాల్లో అదే (క్యాన్సర్‌) ముప్పు కలిగించే ‘అజిడో ఇంప్యూరిటీస్‌’ కూడా ఉన్నట్టు ఔషధ నియంత్రణ సంస్థలు గుర్తించాయి. అజిడో ఇంప్యూరిటీ అంటే.. సార్టన్‌ డ్రగ్స్‌ తయారుచేస్తున్న క్రమంలో విడుదలయ్యే ‘అజిడోమిథైల్‌-బైఫెనైల్‌-టెట్రాజోల్‌ (ఏజెడ్‌బీటీ)’ అనే రసాయన మిశ్రమం. ఒక బ్యాచ్‌ ఔషధాలను తయారుచేసే క్రమంలో ఈ రసాయన మిశ్రమం విడుదలవుతుంది. తర్వాతి బ్యాచ్‌ ఔషధాల్లో ఆ ఇంప్యూరిటీస్‌ కలవకుండా ఉండడానికి.. ఈ ఔషధాలను తయారుచేసే కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే. ఎందుకంటే ఈ అజిడో ఇంప్యూరిటీస్‌ మన శరీరంలోని డీఎన్‌ఏను దెబ్బతీస్తాయి. ఇవి ఉన్న మందులను దీర్ఘకాలం వాడేవారిలో డీఎన్‌ఏ దెబ్బతిని వారు క్యాన్సర్‌ బారిన పడతారు. కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిన సామెత చందంగా.. హైబీపీకి వేసుకునే మందుల వల్ల క్యాన్సర్‌ వస్తుందన్నమాట. సార్టన్‌ డ్రగ్స్‌లో ఈ అజిడో ఇంప్యూరిటీస్‌ ఉన్నట్టు గుర్తించిన సనోఫీ, శాండోజ్‌ వంటి ఫార్మా సంస్థలు కెనడాలో, పలు యూరప్‌ దేశాల్లో కొన్ని బ్యాచ్‌ల ఔషధాలను రీకాల్‌ చేశాయి. 


ఈ వ్యవహారం మొత్తంలో మన భారతదేశానికి.. అందునా మన తెలుగువారికి చెందిన కంపెనీ.. హెటెరో ల్యాబ్స్‌ లిమిటెడ్‌కు కూడా పాత్ర ఉండడం గమనార్హం. అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు ఆగస్టులో తెలంగాణలోని సంగారెడ్డిలో హెటెరోల్యాబ్స్‌ ప్రొడక్షన్‌ ప్లాంట్‌ను 10రోజులపాటు సందర్శించినప్పుడు.. అజిడో ఇంప్యూరిటీస్‌ ఔషధాల్లో కలవకుండా నియంత్రించే ప్రక్రియలో లోపాలున్నట్టు గుర్తించినట్టు బ్లూమ్‌బెర్గ్‌ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. వాల్‌సార్టన్‌ తయారీకి అవసరమైన యాక్టివ్‌ ఇంగ్రిడెంట్‌ను ఆ ప్లాంటులో తయారుచేస్తున్నారు. హెటెరో నుంచి ఆ యాక్టివ్‌ ఇంగ్రిడెంట్‌ను కొనుగోలు చేసిన ఫార్మా కంపెనీలు సంబంధిత మాత్రలను ఉత్పత్తి చేసుకుంటాయి. ఈ వివాదంపై వ్యాఖ్యానించాల్సిందిగా కోరుతూ హెటెరో సంస్థను సంప్రదించినప్పటికీ స్పందన లేదని బ్లూమ్‌బెర్గ్‌ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. సార్టన్‌ డ్రగ్స్‌ యాక్టివ్‌ ఇంగ్రిడెంట్‌ను తయారుచేసే మరో కంపెనీ కూడా ఉందని.. దాని పేరు మాత్రం ఇంకా తెలియలేదని వెల్లడించింది. కాగా.. ఈ ఏడాది మేలో ‘హెల్త్‌ కెనడా (కెనడా ఔషధ నియంత్రణ సంస్థ)’ వాల్‌సార్టన్‌ ఔషధాల్లో అజిడో ఇంప్యూరిటీ్‌సను గుర్తించి తొలిగా వాటిని రీకాల్‌ చేసింది. ఆ తర్వాత కొన్ని యూరోపియన్‌ దేశాలు అదే బాటలో నడిచాయి. 


కాగా.. 2018లో కూడా హెటెరో సంస్థ సరఫరా చేసిన ఔషధాల్లో క్యాన్సర్‌ కారక ఎన్‌డీఎంఏ, ఇతర రసాయనాలు ఉండడంతో అప్పటి నుంచి ఔషధ నియంత్రణ సంస్థలు ఈ ఔషధాలపై దృష్టి పెట్టి పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సార్టన్‌ డ్రగ్స్‌లో అజిడో ఇంప్యూరిటీస్‌ గురించి బయటపడింది. 2018లో హెటెరో డ్రగ్స్‌ను తనిఖీ చేసిన ఎఫ్‌డీఏ అధికారులు దానికి వరస్ట్‌ క్లాసిఫికేషన్‌ ఇచ్చినట్టు బ్లూమ్‌బెర్గ్‌ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. దానివల్ల ఆ కంపెనీ తయారుచేసే ఔషధాలకు ఎఫ్‌డీఏ అనుమతి రావడం చాలా కష్టం.

Updated Date - 2021-10-15T07:33:17+05:30 IST