మృతదేహం తారుమారు

ABN , First Publish Date - 2021-05-15T08:09:51+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది పొరపాటు వల్ల మృతదేహం తారుమారయింది. కొవిడ్‌ రోగి కావడం..

మృతదేహం తారుమారు

  • ఒకదాని బదులు మరొకటి అప్పగింత
  • పూడ్చిన మృతదేహాన్ని తీసుకెళ్లిన వైద్య సిబ్బంది


శంకరపట్నం, మే 14 : ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది పొరపాటు వల్ల మృతదేహం తారుమారయింది. కొవిడ్‌ రోగి కావడం.. మృతదేహం ప్యాక్‌ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కొద్దిసేపటి తర్వాత తప్పిదాన్ని గుర్తించిన వైద్య సిబ్బంది ఖననం చేసిన మృతదేహాన్ని తవ్వి తీసుకెళ్లారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన జానపట్ల మచ్చయ్య(55)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మచ్చయ్య మృతి చెందారు. దీంతో కరోనా నిబంధనల ప్రకారం మృతదేహాన్ని ప్యాక్‌ చేసి ఇచ్చారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కొత్తగట్టుకు తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. ఇంతలో ఆస్పత్రి సిబ్బంది నుంచి ఫోన్‌ వచ్చింది. మచ్చయ్య మృతదేహానికి బదులు వేరొకరి మృతదేహాన్ని ఇచ్చామని, ఆయన మృతదేహాన్ని తాము తీసుకువస్తున్నామని చెప్పారు. మచ్చయ్య మృతదేహాన్ని తెచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసి తీసుకెళ్లారు. 

Updated Date - 2021-05-15T08:09:51+05:30 IST