Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెట్రోల్‌ వాహనాలపై కార్బన్‌ పన్ను

కొత్తరవాణా సాధనాలు విద్యుత్‌ వాహనాలే. ఇక ముందు పూర్తిగా వాటినే ఉపయోగించు కోవాలని ప్రపంచదేశాలు క్రమంగా నిర్ణయం తీసుకుంటున్నాయి. 2025 సంవత్సరం నుంచి వీధుల్లో తిరిగే వాహనాలన్నీ విద్యుత్‌తో నడిచేవే అయిఉండాలని నార్వే ఇప్పటికీ విధాన నిర్ణయం తీసుకున్నది. ఇదే విధానాన్ని 2030 నుంచి అమలుపరచాలని డెన్మార్క్, హాలెండ్; 2035 సంవత్సరం నుంచి అమలుపరచాలని ఇంగ్లాండ్, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం నిర్ణయం తీసుకున్నాయి.


విద్యుత్ వాహనాల ధర ఇటీవలి దాకా చాలా అత్యధికంగా ఉండేది. ఇప్పుడు శీఘ్రంగా తగ్గిపోతోంది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఒక నిర్దిష్ట బ్రాండ్‌ పెట్రోల్ వాహనం ధర 2019లో 24,000 డాలర్ల నుంచి 2021లో 25,000 డాలర్లకు పెరిగింది. 2025లో పెట్రోల్ వాహనం ధర 26,000 డాలర్లకు పెరిగే అవకాశముందని ఆ అధ్యయనం పేర్కొంది. ఈ పెట్రోల్ వాహనంతో పోలిస్తే అదే స్థాయి విద్యుత్‌ వాహనం ధర అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. 2019లో 50,000 డాలర్లుగా ఉన్న విద్యుత్ వాహనం ధర 2021లో 39,000 డాలర్లకు తగ్గిపోయింది. 2025 సంవత్సరం నాటికి దాని ధర 18,000 డాలర్లకు తగ్గిపోగలదని డబ్ల్యుఇఎఫ్ అధ్యయనం తెలిపింది. దీన్ని బట్టి సమీప భవిష్యత్తులోనే పెట్రోల్‌తో నడిచే కార్ల కంటే విద్యుత్‌తో నడిచే వాహనాల ధర గణనీయంగా తగ్గిపోనున్నదనేది స్పష్టం. మరి ఈ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి-–మార్చి)లో చైనా మొత్తం 5లక్షల విద్యుత్ వాహనాలను విక్రయించడంలో ఆశ్చర్యమేమీ లేదు. అదే త్రైమాసికంలో యూరోప్ 4,50,000 విద్యుత్ వాహనాలను విక్రయించింది. మన దేశం కేవలం 70,000 విద్యుత్ వాహనాలను మాత్రమే విక్రయించగలిగింది. విద్యుత్ కార్ల విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నామనేది స్పష్టం. ఈ వెనుకబాటుతనం నుంచి మనం ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. 


విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రప్రభుత్వాలు సబ్సిడీ పథకాలను అమలుపరుస్తున్నాయి. విద్యుత్‌ కార్లపై ఒక కెడబ్ల్యుహెచ్‌ వినియోగానికి కేంద్రం రూ.15,000 సబ్సిడీని ఇస్తోంది. ఈ ప్రోత్సాహక విధానం సరైన దిశలో ఉంది. అయితే ఇంతకంటే మెరుగ్గా విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే మార్గం ఒకటి ఉంది. విద్యుత్‌ వాహనాలపై సబ్సిడీ ఇవ్వడం కంటే పెట్రోల్‌తో నడిచే వాహనాలపై ‘కార్బన్ ట్యాక్స్’ విధించడమే ఆ మార్గం. విద్యుత్ వాహనాలకు సబ్సిడీలు సమకూర్చడంపై ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక సర్వేలో గణనీయమైన మద్దతే లభించింది. సర్వేలో పాల్గొన్న 62 మంది ఆర్థికవేత్తలలో 51 మంది ఆ సబ్సిడీలకు అనుకూలంగా ఉన్నారు. కేవలం ఆరుగురు మాత్రమే పెట్రోల్ వాహనాలపై కార్బన్‌ ట్యాక్స్‌ విధించాలని గట్టిగా అభిప్రాయపడ్డారు. వీరి అభిప్రాయాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. 


విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి- సబ్సిడీని సమకూర్చడం ద్వారా వాటి ధరను తగ్గించి, వినియోగదారులకు మరింత చౌకగా అందుబాటులో ఉంచడం; రెండోది- పెట్రోల్‌తో నడిచే వాహనాలపై కార్బన్ పన్ను విధించి, వాటిని మరింత ప్రియం చేయడం. ఆ రెండు పద్ధతులలో దేనిని అమలుపరిచినా విద్యుత్ వాహనాల ధర ఇతోధికంగా తగ్గిపోతుంది; పెట్రోల్ వాహనాల ధర భారీగా పెరుగుతుంది. అయితే రెండిటి మధ్య ఒక వ్యత్యాసముంది. పెట్రోల్ వాహనాలపై కార్బన్ పన్ను విధించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది; విద్యుత్‌ వాహనాలపై సబ్సిడీ సమకూర్చడం అనేది ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. 


ఆదాయాన్ని సముపార్జించడం ద్వారా చేయగల ఒక పనిని ఆర్థికభారాన్ని భరిస్తూ ఎందుకు చేయాలి? ఇదీ, ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. విద్యుత్ వాహనాలపై సబ్సిడీలను సమకూర్చడాన్ని వ్యతిరేకిస్తున్నవారు ఒక వాదన చేస్తున్నారు. పెట్రోల్‌తో నడిచే వాహనాలపై కార్బన్ పన్ను విధించడం వల్ల వాటి ధర విపరీతంగా పెరిగిపోయి వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నదే ఆ వాదన సారాంశం. ఈ వాదన సమర్థనీయం కాదు. ఎందుకని? ఆర్థిక వ్యవహారాలలో ‘ఫ్రీ లంచ్’ అనేది లేదు. మీరు ఏదైనా ఒక దాన్ని కోరుకుంటున్నప్పుడు దాని కోసం విధిగా శ్రమపడాలి లేదా దానికి ధర చెల్లించాలి. ఈ రెండూ చేయనప్పుడు మీరు కోరుకుంటున్న వస్తువు మీకు దక్కదు. విద్యుత్ వాహనాలపై సబ్సిడీ ఇచ్చేందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం వేరే ఉత్పత్తులపై పన్నులు విధించడం ద్వారా ప్రజల నుంచి రాబట్టుకుంటుంది. ఇటువంటి వెసులుబాట్లను మన పాలకులు తప్పక వినియోగించుకుంటారు. అంతిమంగా పన్ను చెల్లింపుదారులపై అదనపు ఆర్థికభారం పడుతుంది.


పెట్రోల్‌తో నడిచే వాహనాలపై కార్బన్ పన్ను విధించడం ద్వారా ఆ వాహనాల వినియోగదారులపై ఆర్థికభారాన్ని మోపాలా లేక ఇతర ఉత్పత్తులపై పన్నుల విధింపుతో ప్రజలపై ఆ ఆర్థికభారాన్ని మోపాలా? ఇదీ మన ముందున్న మరో ముఖ్యమైన ప్రశ్న. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వినియోగదారులపై మరింత ఆర్థికభారం పడుతుంది. అయితే ఇందులో ఒక తేడా ఉంది. కార్బన్ పన్ను విధింపు వల్ల పెట్రోల్‌ వాహనాల వినియోగదారులపై మాత్రమే ఆర్థికభారం పడుతుంది. అలా కాకుండా విద్యుత్ వాహనాలపై సబ్సిడీలను సమకూర్చడమంటే సమస్త ప్రజలపై ఆ భారం మోపడమే అవుతుంది.


పర్యావరణ కాలుష్యానికి దోహదం చేస్తున్న పెట్రోల్ వాహనాలపై కార్బన్ పన్ను విధించడమే సహేతుకమని నేను అభిప్రాయపడుతున్నాను. దీనివల్ల ఆ వాహనాల వినియోగదారులపై మాత్రమే ఆర్థిక భారం పడుతుంది. మరి పెట్రోల్ వాహనాలతో జరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని నిరోధించేందుకు అయ్యే వ్యయాన్ని ఆ వాహనాలను వినియోగించని పౌరులు ఎందుకు భరించాలి? 

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...