ఇక దేశంలోనే కార్‌-టి సెల్‌ చికిత్స

ABN , First Publish Date - 2022-06-13T09:17:58+05:30 IST

రక్తక్యాన్సర్‌, లింఫోమా బాధితులకు శుభవార్త. ఈ రెండు రకాల క్యాన్సర్లకు సంబంధించిన అత్యాధునిక ‘కార్‌-టి సెల్‌’ చికిత్స వచ్చే ఏడాది నుంచి మనదేశంలోనే..

ఇక దేశంలోనే కార్‌-టి సెల్‌ చికిత్స

2023 నుంచి అందుబాటులోకి

రక్తక్యాన్సర్‌, లింఫోమా బాధితులకు శుభవార్త

విదేశాల్లో రూ.3-4 కోట్ల ఖర్చు

దేశంలో రూ.20-30 లక్షలలోపే

ముంబై, జూన్‌ 12: రక్తక్యాన్సర్‌, లింఫోమా బాధితులకు శుభవార్త. ఈ రెండు రకాల క్యాన్సర్లకు సంబంధించిన అత్యాధునిక ‘కార్‌-టి సెల్‌’ చికిత్స వచ్చే ఏడాది నుంచి మనదేశంలోనే అందుబాటులోకి రానుంది! ప్రస్తుతం ఈ చికిత్స కోసం అమెరికా దాకా వెళ్లాల్సి ఉంటుంది. అందునా దాదాపు రూ.3-4 కోట్ల దాకా ఖర్చవుతోంది. అలా కాకుండా భారతదేశంలోనే ఈ చికిత్సను రూ.20-30 లక్షలలోపే అందుబాటులోకి తెచ్చేందుకు ఐఐటీ-బాంబేకు చెందిన ‘ఇమ్యూనోయాక్ట్‌’ అనే కంపెనీ సిద్ధమైంది.


ముఖ్యమైన విషయమేంటంటే.. ఈ సంస్థ అందించే కార్‌-టి సెల్‌ థెరపీ పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిందే. ఐఐటీ బాంబేకు చెందిన సీనియర్‌ ఫ్యాకల్టీ, ఇమ్యూనోయాక్ట్‌ సీఈవో, వ్యవస్థాపకుడు అయిన రాహుల్‌ పన్వర్‌ ఎనిమిదేళ్లపాటు పరిశోధన చేసి ఈ చికిత్సను అభివృద్ధి చేశారు. ఐఐటీబాంబేలోని ‘సొసైటీ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రపెనర్‌షి్‌ప’లో ప్రారంభమైన ఇమ్యూనోయాక్ట్‌ ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం లారస్‌ ల్యాబ్స్‌ భాగస్వామ్యంతో పనిచేస్తోంది. జూన్‌ 11న ఈ సంస్థ ప్రారంభించిన ఆరోగ్య కేంద్రంలో ఏడాదికి 1200 మంది రోగులకు చికిత్స అందించే అవకాశం ఉంది. రాహుల్‌ పన్వర్‌ అభివృద్ధి చేసిన ఈ చికిత్సకు సంబంధించిన మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ముంబై టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌లోని ‘అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్‌, రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ క్యాన్సర్‌’ విభాగంలో 10 మంది లింఫోమా రోగులపై నిర్వహించారు.


వారందరి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. ఎవరికీ క్యాన్సర్‌ తిరగబెట్టలేదని వైద్యనిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇమ్యూనోయాక్ట్‌ కంపెనీ రెండో దశలో 40మంది  పేషెంట్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీడీఎస్‌సీవోను అనుమతులు కోరుతోంది. మనదేశంలో ఏటా 40 వేల నుంచి 50 వేల దాకా రక్త క్యాన్సర్‌, లింఫోమా కేసులు నమోదవుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. విదేశాలకు వెళ్లి కార్‌-టి సెల్‌ చికిత్స చేయించుకోలేనివారికి ఆ చికిత్స ఇక్కడే దొరకటం ఊరటే. కార్‌-టి సెల్స్‌ అంటే.. కిమెరిక్‌ యాంటీజెన్‌ రిసెప్టర్‌ (కార్‌)-టి కణాలు. ఇవి రోగ నిరోధక శక్తికి సంబంధించిన కణాలు. ఈ కణాలను రోగి శరీరం నుంచే సేకరించి క్యాన్సర్‌పై పోరాడేలా వాటికి ల్యాబ్‌లో మార్పుచేర్పులు చేస్తారు. రక్తక్యాన్సర్‌, లింఫోమా (లింఫ్‌ వ్యవస్థకు సంబంధించిన కణాల్లో వచ్చే క్యాన్సర్‌)కు ఈ చికిత్స బాగా పనిచేస్తుంది. ఆటో ఇమ్యూన్‌ వ్యాధులకు కూడా ఈ చికిత్సను అందించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.


ఎవరికి ఇస్తారు?

చివరి దశ రక్త క్యాన్సర్‌, లింఫోమా పేషెంట్లకు.. అది కూడా కీమో థెరపీ, మూలుగ మార్పిడి వంటి సంప్రదాయ చికిత్సలకు స్పందించని వారికి, ఆ చికిత్సలకు తగ్గినా మళ్లీ మళ్లీ క్యాన్సర్‌ తిరగబెడుతుంటే.. కార్‌-టి సెల్‌ థెరపీ చేస్తారు.40-50 శాతం పేషెంట్లకు ఈ చికిత్స సమర్తంగా పనిచేస్తుందని, ముఖ్యంగా పిల్లల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని విదేశాల్లో జరిగిన పరిశోధనల్లో తేలింది.

Updated Date - 2022-06-13T09:17:58+05:30 IST