కారు.. రివర్స్‌ గేరు!

ABN , First Publish Date - 2022-07-14T08:44:33+05:30 IST

రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ రోజురోజుకూ తగ్గిపోతోందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా అధినేత మస్తాన్‌ తెలిపారు.

కారు.. రివర్స్‌ గేరు!

  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు 38.88ు,
  • బీజేపీకి 30.48%, కాంగ్రెస్‌కు 23.71 శాతం ఓట్లు
  • ఎన్నికల నాటికి అధికార పార్టీకి మరో 8% ఓట్లు తగ్గే అవకాశం
  • బీజేపీకి పెరుగుతున్న ఓట్లు.. ఏపీలో పొత్తులను బట్టి ఇక్కడ సెటిలర్ల తీర్పు
  • 3 జిల్లాల్లో సెటిలర్లు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌వైపే.. ‘ఆరా’ మస్తాన్‌ వెల్లడి


హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ రోజురోజుకూ తగ్గిపోతోందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా అధినేత మస్తాన్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి అది మరింత పడిపోతుందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎ్‌సకు 38.88 శాతం ఓట్లు వస్తాయని, బీజేపీకి 30.48 శాతం, కాంగ్రెస్‌కు 23.71 శాతం ఓట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందని పేర్కొన్నారు. ఇతరులు 6.91 శాతం ఓట్లు సాధిస్తారని తెలిపారు. అయితే ఎన్నికల నాటికి టీఆర్‌ఎ్‌సకు ప్రస్తుతం ఉన్న ఓటింగ్‌లో 8 శాతం తగ్గుతుందన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మస్తాన్‌ మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ చేసినట్లు కొన్ని సర్వేలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండడం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా తమ సంస్థ పేరును ప్రస్తావించడంతో తాను మీడియా ముందుకు వచ్చానన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకేసారి సర్వే చేయడం బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, తాము మూడు దఫాలుగా సర్వే చేశామని తెలిపారు. 2021 నవంబరులో 40 నియోజకవర్గాల్లో, ఈ ఏడాది మార్చిలో మరో 40 చోట్ల, జూలైలో 39 స్థానాల్లో సర్వే చేశామన్నారు. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి నమూనాలు తీసుకున్నామన్నారు. ప్రతి విడత సర్వేలోనూ ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు, పట్టణ, గ్రామీణ నియోజకవర్గాలు అన్నీ ఉండేట్లుగా చూశామన్నారు. 2018 తర్వాత నుంచి టీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ శాతం పడిపోతున్న విషయాన్ని లెక్కలతో సహా వివరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు 46.87 శాతం ఓట్లు రాగా, 2019 పార్లమెంట్‌ ఎన్నికల నాటికి అది 41.71 శాతానికి తగ్గిందన్నారు. ఆ తరువాత వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్‌ శాతం తగ్గినట్లు పేర్కొన్నారు. 


టీఆర్‌ఎస్‌కు ఎందుకు తగ్గుతున్నాయంటే..

సాధారణంగా రాజకీయాల్లో ఒక పార్టీకి ఒక్కసారి ఓట్ల శాతం తగ్గడం మొదలైతే.. అది కంటిన్యూ అవుతుందని మస్తాన్‌ అన్నారు. 2018 ఎన్నికల తర్వాత నుంచి ప్రజల మూడ్‌లో మార్పు వస్తోందన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యల కంటే కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి జరుగుతోందన్న అంశాన్ని ప్రజల్లోకి విపక్షాలు బలంగా తీసుకెళ్లాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన బాగున్నప్పటికీ కేసీఆర్‌ కుటుంబ ఆధిపత్యం హెచ్చుమీరిందన్న భావన ప్రజల్లో పెరిగిందని, అందుకే ఆ పార్టీ ఓటు బ్యాంకు రోజురోజుకూ తగ్గుతోందని వివరించారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వారి వ్యక్తిగత ప్రవర్తన కూడా ఇందుకు కారణమవుతోందని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో కంటే పార్టీ క్యాడర్‌లోనే తీవ్రమైన వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికార పార్టీ వైపు కేవలం పెన్షనర్లు, కొంత శాతం మహిళలు మాత్రమే ఉన్నారని తెలిపారు. అయితే టీఆర్‌ఎ్‌సకు 87 స్థానాల్లో బలమైన అభ్యర్ధులున్నారని మస్తాన్‌ అన్నారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ బొమ్మను చూసి ఓటర్లు ఓటేసినట్లు తమ సర్వేలో తేలిందన్నారు. ఈసారి ఎన్నికల్లో అటువంటి పరిస్థితి ఉండదని తాజా సర్వేలో తాము గుర్తించినట్లు వెల్లడించారు. 


జిల్లాల్లో పరిస్థితి ఇదీ..

ప్రస్తుత సర్వే ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో టీఆర్‌ఎ్‌సకు 39 శాతం ఓట్లు, బీజేపీకి 35 శాతం, కాంగ్రెస్‌కు 18.91 శాతం ఉన్నట్లు మస్తాన్‌ తెలిపారు. ఇతరులు 6.31 శాతం ఓటింగ్‌ శాతం కలిగి ఉన్నారన్నారు. ఇక మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ 40 శాతం, బీజేపీ 30, కాంగ్రెస్‌కు 23.38, ఇతరులకు 5.34 శాతం ఓట్లు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో అధికార పార్టీకి 40 శాతం, బీజేపీకి 35 శాతం, కాంగ్రెస్‌కు 16, ఇతరులకు 7.92 శాతం ఓటింగ్‌ ఉందన్నారు. ఇక వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అధికార పార్టీకి 35 శాతం ఓట్లు ఉండగా, కాంగ్రెస్‌కు 36.22 శాతం, బీజేపీకి 20, శాతం, ఇతరులకు 8 శాతం ఉన్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మఽధ్యే పోటీ ఉంటుందని, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు మధ్య పోటీ ఉంటుందని వివరించారు. కాగా, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లోని సెటిలర్లు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తమ సర్వేలో తేలిందని మస్తాన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీల మధ్య ఏర్పడే పొత్తుల వ్యవహారం ఇక్కడి సెటిలర్లపై ప్రభావం చూపనుందని, దాని ఆధారంగానే ఇక్కడి సెటిలర్లు ఓట్లు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.


రేవంత్‌ నియామకంతో కాంగ్రెస్‌లో ఉత్సాహం..

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తరువాత కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చినట్లు సర్వేలో గుర్తించామమని మస్తాన్‌ తెలిపారు. అయితే 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఎమ్యెల్యేల్లో అత్యధిక మంది  అధికార టీఆర్‌ఎ్‌సలో చేరడంతో ప్రజల్లో ఆ పార్టీపై విశ్వాసం సన్నగిల్లిందన్నారు. 2019 తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఓటమి చెందడం, తక్కువ ఓట్లు రావడంతోపాటు అధికార పార్టీని నిలువరించగలదనే నమ్మకం ప్రజల్లో కలగడం లేదని సర్వేలో తేలిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి 53 నియోజకవర్గాల్లో బలమైన  అభ్యర్ధులున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. 


యువతరం బీజేపీ వైపే..!

బీజేపీ దేశవ్యాప్తంగా వరుస విజయాలు సాధించడం, మోదీ నాయకత్వం, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌ ఎన్నికల్లో విజయాలతో అధికార టీఆర్‌ఎ్‌సను కమలదళం మాత్రమే నిలువరించగలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడినట్లు తమ సర్వేలో వెల్లడైందని మస్తాన్‌ తెలిపారు. ప్రస్తుతం 18-35 ఏళ్ల మధ్య వయస్కుల్లో మెజారిటీ ఓటర్లు బీజేపీ వైపు ఉన్నారని పేర్కొన్నారు. కానీ, బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 29 నియోజకవర్గాల్లో మాత్రమే బలమైన అభ్యర్థులున్నట్లు వెల్లడించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ బీజేపీ ఓట్ల శాతం పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో స్థిరపడ్డ ఉత్తర భారతదేశానికి చెందిన వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తేలిందన్నారు. ఇక కాంగ్రెస్‌, బీజేపీలను ఇతర పార్టీల నుంచి చేరే బలమైన అభ్యర్థులే అధికార తీరాలకు చేరుస్తారని మస్తాన్‌ అభిప్రాయపడ్డారు. అలాగే ఈసారి అతిపెద్ద పార్టీగా  ఒకే పార్టీ నిలుస్తుందని, ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. అయితే ఎన్నికల నాటికి ఇప్పుడున్న ఓట్ల శాతాల్లో మార్పుచేర్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ఇక బీఎస్పీ, వైఎస్సార్‌టీపీల ప్రభావం ఎక్కువగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉంటుందన్నారు. బీఎస్పీ దళిత సామాజికవర్గ ఓటర్లలో ప్రభావం చూపుతుండగా, షర్మిల పార్టీ రెడ్డి, దళితుల్లో ప్రభావం చూపుతుందని వెల్లడించారు.

Updated Date - 2022-07-14T08:44:33+05:30 IST