కారు శానిటైజేషన్‌కు రూ.224 వసూలు చేసినందుకు లీగల్ నోటీసు

ABN , First Publish Date - 2020-05-23T22:25:47+05:30 IST

కారును శుభ్రం చేసినందుకు, ఇంటీరియర్ ప్రొటెక్షన్ కవర్ వేసినందుకు

కారు శానిటైజేషన్‌కు రూ.224 వసూలు చేసినందుకు లీగల్ నోటీసు

చండీగఢ్ : కారును శుభ్రం చేసినందుకు, ఇంటీరియర్ ప్రొటెక్షన్ కవర్ వేసినందుకు రూ.224 వసూలు చేసిన కారు డీలర్‌కు కస్టమర్ లీగల్ నోటీసు పంపించారు. వారంటీ పరిథిలో ఉన్న కారుకు ఈ విధంగా వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లించాలని, నష్టపరిహారంగా రూ.50,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. 


చండీగఢ్‌కు చెందిన కారు యజమాని రవి కుమార్ కారు డీలర్‌షిప్‌కు న్యాయవాది ద్వారా ఈ లీగల్ నోటీసును పంపించారు. 


లీగల్ నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం,  రవి కుమార్ తన కారును ఈ నెల 21న ఆటో పేస్ డీలర్‌షిప్ వద్దకు రొటీన్ సర్వీస్ చెకప్ కోసం తీసుకెళ్ళారు. ఇంటీరియర్ ప్రొటెక్షన్ కవర్స్‌కు రూ.14.83; హైజీన్ ఛార్జీలుగా రూ.175, వీటిపై జీఎస్‌టీ 18 శాతం, మొత్తం మీద రూ.224 వసూలు చేశారు. కారు వారంటీ పరిథిలో ఉన్నందువల్ల సర్వీస్ కోసం ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. కానీ కారును తీసుకెళ్ళడానికి వచ్చినపుడు రవి చేతిలో ఇన్‌వాయిస్ పెట్టడంతో, ఆయన డీలర్‌షిప్ సిబ్బందిని  గట్టిగా నిలదీశారు. ఆ డబ్బు చెల్లించక తప్పదని డీలర్‌షిప్ సిబ్బంది చెప్పారు. హైజీన్ లేబర్, ఇంటీరియర్ ప్రొటెక్షన్ కవర్స్ కోసం ఈ డబ్బు చెల్లించక తప్పదన్నారు. 


రవి తరపున లీగల్ నోటీసు జారీ చేసిన న్యాయవాది పంకజ్ మాట్లాడుతూ ఈ విధంగా ఛార్జీలు వసూలు చేయడం చట్టబద్ధం కాదన్నారు. డీలర్‌షిప్ ఈ కారుకు వేసిన ఇంటీరియర్ ప్రొటెక్షన్ కవర్స్ నాసిరకంగా ఉన్నాయన్నారు. శానిటైజర్ స్ప్రేను ఉపయోగించడం విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం తప్పనిసరి అని, కారు డీలర్‌షిప్ వంటి అన్ని పారిశ్రామిక సంస్థలు తప్పనిసరిగా వీటిని వాడాలని అధికారులు ప్రకటించారని చెప్పారు. దీని కోసం కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయరాదన్నారు.


డీలర్‌షిప్ యజమాని మెహన్ మాట్లాడుతూ వాహనాలను శానిటైజ్ చేసి, హైజీన్ లేబర్ ఛార్జ్ చేయడం సాధారణంగా జరిగేదేనని తెలిపారు.


Updated Date - 2020-05-23T22:25:47+05:30 IST