Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : కొత్త కారులో ముగ్గురు పిల్లలతో తల్లి ప్రయాణం.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో...!

  • పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘటన
  • పూర్తిగా కాలిపోయిన కారు
  • చిక్కుకున్న ఇద్దరు చిన్నారులు
  • రక్షించిన మరో కారు డ్రైవర్‌
  • వాహనంలో ఉన్న వారందరూ సేఫ్‌

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : పీవీ నర్సింహ్మరావు ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నెంబర్‌ 134 వద్ద సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. కారులో చిక్కుకుపోయిన ఇద్దరు చిన్నారులను అటుగా వెళ్తున్న మరో డ్రైవర్‌ సాహసం చేసి కాపాడారు.  పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. సరూర్‌నగర్‌ మండలం, మామిడిపల్లి బస్తీకి చెందిన పల్లెబోయిన శైలజ (35), పల్లెబోయిన సతీష్‌ భార్యభర్తలు. సతీష్‌ సీఐఎస్ఎఫ్‌ కానిస్టేబుల్‌. బెంగళూరులో పని చేస్తున్నాడు. వీరికి మూడు నెలల బాబు, ఆరేళ్ల శ్రీహాన్స్‌ సంతానం. సోమవారం మధ్యాహ్నం శైలజ హుండాయ్‌ ఆరా కారు (టీఎస్07-హెచ్‌ఎల్‌ 2495)లో తన మూడు నెలల బాబును బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చూపించేందుకు తీసుకు వెళ్తోంది. ఆమె వెంట శ్రీహాన్స్‌తో పాటు ఆమె చెల్లెలి కుమారుడు విజయ్‌(12) కూడా ఉన్నారు.

శైలజ నడుపుతున్న కారు ఆరాంఘర్‌ సమీపంలో పీవీ నర్సింహ్మరావు ఎక్స్‌ప్రెస్‌ వే పైకి ఎక్కి న తర్వాత కారులో రెడ్‌లైట్‌ బ్రింక్‌ అయింది. దానిని గమనించకుండానే శైలజ కారును ముందుకు పోనిచ్చింది. ఈ క్రమంలో కారులో నుంచి పిల్లర్‌ నెంబర్‌ 155 నుంచి 134 వరకు ఆయిల్‌ లీక్‌ అవుతూనే ఉంది. వెనుక కూర్చున్న పిల్లలు ఏదో కాలుతున్నట్లు వాసన వస్తోందని శైలజతో చెప్పారు. ఆమె అత్తాపూర్‌ పిల్లర్‌ నెంబర్‌ 134 వద్ద కారును పక్కకు ఆపి, తన మూడు నెలల బాబును తీసుకుని కారులోంచి దిగింది. వెంటనే కారులో నుంచి మంటలు వచ్చాయి. దీంతో ఆమెకు ఏం చేయాలో తోచలేదు. కారు డోర్లు లాక్‌ కావడంతో ముందు సీట్లో నుంచి వెనుక కూర్చున్న ఇద్దరు పిల్లలను బయటకు లాగేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో మొహిదీపట్నం నుంచి ఆరాంఘర్‌ వైపునకు వెళ్తున్న ఏపీ09సీటీ 2359 నెంబర్‌ స్కోడా కారు డ్రైవర్‌ రవి తన కారును ఆపి.. కాలుతున్న కారు వద్దకు వచ్చాడు. తన కారులో ఉన్న సామగ్రి తీసుకుని మంటలు ఆరుతున్న కారు వెనుక అద్దాలు పగులగొట్టాడు. వెనుక సీట్లో ఉన్న విజయ్‌, శ్రీహాన్స్‌లను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది.

గవర్నర్‌ వస్తుండటంతో..  

మహేశ్వరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళి సై అదే సమయంలో పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌ వే నుంచి రాజ్‌భవన్‌ వెళ్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు శ్యామ్‌సుందర్‌రెడ్డి, లవకుమార్‌రెడ్డి, ఏసీపీ ఆర్‌. సంజయ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ కె.కనకయ్యగౌడ్‌ వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. ప్రమాదాన్ని గమనించి ఫైరింజన్‌ను పిలిపించి, మంటలను ఆర్పించారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ కాగా, వెంటనే క్లియర్‌ చేసి గవర్నర్‌ వచ్చేలోగా ట్రాఫిక్‌ ఇబ్బందు లు లేకుండా చేశారు. అయితే, అప్పటికీ కారు కాలుతూనే ఉంది.

డ్రైవర్‌ రవిని అభినందించిన ఏసీపీ

కారులో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు సాహసం చేసిన డ్రైవర్‌ రవిని ఏసీపీ సంజయ్‌కుమార్‌ అభినందించారు. తనకెందుకులే అని వెళ్లిపోకుండా, తన కారులోని పా నా తీసుకొచ్చి కారు వెనుక అద్దాలు పగులగొట్టి పిల్లలను బయటకు తీయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. 

కొత్త కారు..

కాలిపోయిన కారు 2020 మోడల్‌ హుండాయ్‌ ఆరా కారు అని పల్లెబోయిన శైలజ తెలిపారు. గతంలో కారు ఇంజన్‌ పాడైతే షోరూం వారు చెన్నై నుంచి తెప్పించి, మార్చాన్నారు. కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, ప్రమాదం జరిగిందన్నారు. 

Advertisement
Advertisement