గచ్చిబౌలిలో యజమానికే టోకరా.. 50లక్షల బ్యాగుతో డ్రైవర్‌ పరారీ

ABN , First Publish Date - 2021-04-13T13:08:01+05:30 IST

యజమానికే టోకరా ఇచ్చి రూ.50లక్షలు దోచుకువెళ్లి

గచ్చిబౌలిలో యజమానికే టోకరా.. 50లక్షల బ్యాగుతో డ్రైవర్‌ పరారీ

హైదరాబాద్/గచ్చిబౌలి : యజమానికే టోకరా ఇచ్చి రూ.50లక్షలు దోచుకువెళ్లిన ఘరానా మోసగాడిని మాదాపూర్‌, గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 6న సాయంత్రం కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ధీరజ్‌రెడ్డి, వీఎన్‌ఎం రాజు బ్యాగులో రూ.50లక్షల నగదు తీసుకుని మరో పార్ట్‌నర్‌ వైఎస్‌ ప్రసాద్‌రెడ్డ్డి కారులో మాదాపూర్‌కు వచ్చారు. డీల్‌ వాయిదా పడడంతో వారు ఇనార్బిట్‌మాల్‌లో షాపింగ్‌ కోసం వెళ్లారు.


కారును పార్క్‌చేసి రమ్మని డ్రైవర్‌ హన్మంత్‌డో‌స్‌వేకు చెప్పారు. కారును పార్క్‌చేసిన డ్రైవర్‌ నగదుతో ఉన్న బ్యాగును తీసుకుని వెళ్లిపోయాడు. సుమారు రాత్రి 8.30గంటల సమయంలో మాల్‌ నుంచిబయటకు వచ్చిన వ్యాపారులు డ్రైవర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. పార్కింగ్‌లోకి వెళ్లి చూడగా కారు ముందు సీటులో తాళాలు ఉన్నాయి. హన్మంత్‌, నగదుతో ఉన్న బ్యాగ్‌ కనిపించకపోవడంతో వెంటనే మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, మూడు బృందాలను రంగంలోకి దించారు. డ్రైవర్‌ హన్మంత్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ముంబాయి, పూణే, ఢిల్లీ తదితర ప్రాంతాలను జల్లెడపట్టారు. డ్రైవర్‌ హన్మంత్‌ అతని సోదరుడు లక్ష్మణ్‌డోస్‌తో కలిసి బీదర్‌ జిల్లా మర్జాపూర్‌లో దొంగిలించిన డబ్బుతో ఆస్తులు కొనేందుకు వస్తుండగా జహీరాబాద్‌ వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.40లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు డీసీపీ తెలిపారు.

Updated Date - 2021-04-13T13:08:01+05:30 IST