జోరుగా నాటుసారా తయారీ

ABN , First Publish Date - 2022-05-27T07:11:21+05:30 IST

నల్లమల అడవి మధ్యలోని గిరిజన తాండాలు, సమీప గ్రామాలలో నాటుసారా వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపులు యథేచ్చగా సాగుతున్నాయి.

జోరుగా నాటుసారా తయారీ
పట్టుబడిన కల్తీసారా(ఫైల్‌)

శివారు కాలనీలలో విక్రయాలు

మిలటరీ మద్యానికి పెరిగిన గిరాకీ

మార్కాపురం, మే 26 : నల్లమల అడవి మధ్యలోని గిరిజన తాండాలు, సమీప గ్రామాలలో నాటుసారా  వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపులు యథేచ్చగా సాగుతున్నాయి. నియంత్రించాల్సిన సెబ్‌ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ దాడులలో నాటుసారా, బెల్టు షాపులపై దాడులలో పట్టుబడిన వారిని సైతం వదిలేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎస్పీ మలికగర్గ్‌ ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ పోలీస్‌, సెబ్‌ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఆశించిన ఫలితాలు రావడంలేదు. ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం మద్యప్రియులు ఆశించిన స్థాయిలో నాణ్యత లేకపోవడంతో ఎక్కువ మంది మిలిటరీ మద్యం వైపు దృష్టిని మల్లించారు. తమకు పరిచయాలున్న మిలటరీ, మాజీ ఉద్యోగుల వద్ద నుంచి బాటిళ్లు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.

కుటీర పరిశ్రమగా నాటుసారా తయారీ

మార్కాపురం డివిజన్‌లో నల్లమల అటవీ ప్రాంతం లోని గిరిజన తాండాలో నాటుసారా తయారు చేయడం కుటీరపరిశ్రమగా మారింది. నాటుసారా ఉత్పత్తి కేంద్రా లు. ఎక్కువగా పుల్లలచెరువు, ఎర్రగొండపాలెం, దోర్నాల, అర్ధవీడు మండలాలలోని తాండాలలో నాటుసారా ఎక్కువగా తయారవు తోంది. కొందరు నాటుసారా విక్రయాన్ని వృత్తిగా మార్చుకున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో నాయకులు తమ రాజకీయ అవ సరాలను తీర్చుకోవడానికి గిరిజను లకు నాటుసారా తయారీకి అవసరమైన వస్తువులను సరఫరా చేసి తయారు చేయిస్తున్నారు. 

శివారు కాలనీలలో విక్రయాలు

మార్కాపురం పట్టణంలోని శివారు కాలనీలలో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా రోజువారీ కూలీలు, ఆటోడ్రైవర్లు నాటుసారా కొనుగోలు చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి నాటుసారా తీసుకువచ్చి క్వార్టర్‌ బాటిళ్లలో నాటుసారా నింపి విక్రయాలు సాగిస్తున్నారు. ఒక క్వాటర్‌ బాటిల్‌ నాటుసారా రూ.100లకు విక్రయిస్తున్నారు. 

బార్లుగా మారిన ఫ్యామిలీ రెస్టారెంట్‌

మార్కాపురం పట్టణంలో ప్రభుత్వ అనుమతితో ఐదు బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. వీటికి తోడు నాలుగు ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. కానీ పట్టణంలో ఫ్యామిలీ రెస్టారెంట్లుగా బోర్డు పెట్టుకొని బార్లుగా మారిన హోటళ్లు మరో ఏడు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా తర్లుపాడు రోడ్డులో మూడు, గడియారస్తంభం కూడలిలో 2, కళాశాల రోడ్డులో 2 ఉన్నాయి. ఇంత జరుగుతున్నా బహిరంగంగానే మద్యం సర్వ్‌ చేస్తున్నా.., సెబ్‌ అధికారులకు వాటివైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు దారితీస్తుంది. 

శాఖల మధ్య సమన్వయ లోపం

నాటు సారా తయారీ, విక్రయాలు, బెల్టు షాపుల నియంత్రణపై కొన్ని రోజుల క్రితం వరకూ ఎస్‌ఈబీ అధికారులు పూర్తిగా అధికారం చెలాయించేవారు. ఎస్పీగా మలికగర్గ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసుల భాగస్వామ్యం పెరిగింది. దీంతో అధికారుల ఆధిపత్యమో? నెలసరి వసూళ్లలో తలెత్తిన విభేదాలో కానీ ఒక శాఖ ఆధిపత్యాన్ని మరో శాఖ అధికారులు సహించలేక పోతున్నారు. పోలీస్‌ శాఖకు గ్రామీణ ప్రాంతాల్లోని  సమాచార వ్యవస్థ ద్వారా ఇటీవల కాలంలో నాటు సారా తయారీదారుల, విక్రేతల సమాచారంపై వారు దృష్టి సారించారు. దీంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.  ఎస్పీ నేరుగా తమకున్న నిఘా విభాగం ద్వారా సమచారం సేకరిస్తూ పోలీసులను వాటి నియంత్రణకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో సెబ్‌ అధికారులకు పోలీసు అధికారుల జోక్యం తలనొప్పిగా మారింది. 

సెబ్‌ అధికారుల చేతివాటం

మార్కాపురం డివిజన్‌లో నాటుసారా తయారీ, మద్యం బెల్ట్‌ దుకాణాలను నియంత్రించాల్సిన సెబ్‌ అధికారుల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దాడులలో అక్రమార్కులను పట్టుకున్నప్పటికీ వారు కేవలం నాటు సారాను ధ్వంసం చేసినట్లు, తయారీదారులు పరారైనట్లు ప్రకటనలు విడుదల చేసి వారికి అందింది పుచ్చుకొని మిన్నకుం టున్నారు. ఇటీవల కాలంలో మార్కాపురం మండలం అక్కచెరువు తాండాలో నాటుసారాను విక్రయిస్తున్న ఒక మహిళను పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు కూడా. అయితే నిందితురాలికి బెయిల్‌కు సహకరించేం దుకు రూ.40,000 తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం ఒకరి నుంచి అంత మొత్తంలో తీసుకున్న సెబ్‌ అధికారులు నిరంతరం దాడుల పేరుతో ఎంత వసూలు చేస్తున్నారని పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

మిలటరీ మద్యానికి గిరాకీ

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయాలు ప్రారంభించింది. అయితే వాటిలో విక్రయిస్తున్న మద్యం నాణ్యత మద్యం ప్రియులు ఆశించిన స్థాయిలో లేదు. దీంతో మిలటరీ మద్యానికి గిరాకీ పెరింది. మద్యం ప్రియులు తమకు ప్రత్యక్ష్యంగా పరిచయాలు ఉన్న మిలటీరీ సిబ్బంది, పదవీ విరమణ చేసిన సిబ్బంది నుంచి ప్రతినెలా వారికి కేటాయించే మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మిలటరీ మద్యం విక్రయాలకు దళారీలు సైతం తయారయ్యారు. మిలటరీ సిబ్బంది నుంచి క్యాంటిన్‌లో మద్యం కొనుగోలు చేసినరోజునే కొనుగోలు చేసి తమ వద్ద ఉంచుకొని మద్య ప్రియుల అవసరాలను పట్టి అధిక మొత్తానికి విక్రయాలు చేస్తున్నారు.


Updated Date - 2022-05-27T07:11:21+05:30 IST