తగ్గేదేల్యా.. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జానే..!

ABN , First Publish Date - 2021-07-27T05:21:13+05:30 IST

కడప నగరంలో అధికారం మాటున కొందరు నేతలు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు...

తగ్గేదేల్యా.. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జానే..!

  • ప్రైవేటు స్థలాలనూ వదలని గ్యాంగ్‌లు
  • కడపలో అధికారం మాటున బరి తెగిస్తున్న నేతలు


కడప నగరంలో అధికారం మాటున కొందరు నేతలు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించడంలో తగ్గేదేల్యా అంటూ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. ఖాళీ స్థలం కనిపించి అందులో చెట్లు, కంప పెరిగి ఉంటే చాలు.. అది పట్టా అయినా, ప్రభుత్వ భూమి అయినా సరే.. వెంటనే వాలిపోయి అందులో ఉన్న కంపచెట్లు తొలగించేస్తున్నారు. ఇటీవల కడపలో అన్యాక్రాంతమవుతున్న కొన్ని భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 


కడప, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కడపలో ప్రముఖులుగా చెలామణి అవుతున్న కొందరు గ్యాంగులుగా విడిపోయి ప్రభుత్వ, ప్రైవేటుభూములు అనే తేడా లేకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పట్టాభూమి అయి, ఆ భూమి యజమాని కడపలో లేకుంటే చాలు. వెంటనే ఏదో ఒక పాత డాక్యుమెంటు సృష్టించి ఆ భూమిని చదును చేస్తున్నట్లు తెలుస్తోంది. యజమాని వచ్చి తన స్థలమని మొత్తుకున్నా అతడు బలహీనుడైతే ఆ భూమిని వదులుకోవాల్సిందే. కడప నగరంలో దేనికైనా రక్షణ ఉందేమో కానీ భూములకు మాత్రం రక్షణ లేని పరిస్థితి దాపురించిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మూడు కబ్జా గ్యాంగులు

కడప నగరంలో మూడు కబ్జా గ్యాంగులు ప్రాంతాలను పంచుకుని భూదందా నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. చిన్నచౌకు రెవెన్యూ పొలం, పుట్లంపల్లె రెవెన్యూ భూములు ఆ గ్యాంగులకు అక్షయపాత్రగా మారాయని తెలుస్తోంది. విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములకు ఎప్పుడో తాతలనాటి డాక్యుమెంట్లు సృష్టించి అవి తమవేనంటూ రంగంలోకి దిగుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వభూమి అయితే ఈజీగానే కొట్టేస్తున్నారు. ప్రైవేటు భూమి అయితే అతని బలం, బలగం మీద ఆధారపడి ఉంది.


పుట్లంపల్లె భూముల రూటే వేరు

పుట్లంపల్లె రెవెన్యూ పరిధిలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవలే సుమారు రూ.70కోట్లు వెచ్చించి మహావీర్‌ సర్కిల్‌ నుంచి రిమ్స్‌ రోడ్డును అభివృద్ధి చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంత భూముల ధర పెరిగింది. దీంతో ఇక్కడ భూములపై కొందరి కన్ను పడినట్లు చెబుతున్నారు. అన్ని రెవెన్యూ భూములకు ఆర్‌ఎ్‌సఆర్‌ ఉంటుంది. ఆర్‌ఎ్‌సఆర్‌లో భూమి యజమాని వివరాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఫీల్డ్‌ లెవెల్‌ రిజిస్టరు (ఎఫ్‌ఎల్‌ఆర్‌) ఉంది. అంటే భూమి ఎవరి పొజిషన్‌లో ఉంటే వారిని రెవెన్యూ అధికారులు గుర్తిస్తారు. ఇదే ఇప్పుడు కొందరికి వరంగా మారింది. విలువైన భూమిని ఎఫ్‌ఎల్‌ఆర్‌ పేరిట కాజేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఎకరా రూ.8కోట్ల నుంచి రూ.14 కోట్ల మధ్య ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రూ.8 కోట్ల విలువ చేసే భూమి వివాదంగా మారిందని సమాచారం. ఇరువురికీ డాక్యుమెంట్లు ఉండడంతో చివరికి సెటిల్‌మెంటు చేసుకున్నారని చెప్పుకుంటున్నారు. 


చిన్నచౌకులో..

చిన్నచౌకు ప్రాంతం శరవేగంగా విస్తరిస్తోంది. ఇక్కడ భూములకు కూడా మంచి డిమాండ్‌ ఉంది. రాజంపేట రోడ్డులో ఓ భూమి వివాదంపై కడపలో తీవ్రంగా చర్చ నడుస్తోంది. సుమారు నాలుగు ఎకరాలకు పైగా ఉన్న ఆ స్థలంలో ఎప్పుడో పదేళ్ల కిందట వెంచర్‌ వేశారని చెబుతారు. అప్పుడు సిటీకి దూరంగా ఉండడంతో ప్లాట్లు కొన్నవారు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ఆ భూమి ఖాళీగా ఉండడంతో రెండురోజుల క్రితం కొందరు కంప తొలగించే ప్రయత్నం చేయడంతో కొనుగోలుదారులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. కీలక నేతలు ఈ భూమిపై కన్నేసినట్లు ప్రచారం ఉంది. 


రాజంపేట బైపాస్‌లో..

రాజంపేట బైపా్‌సలో సుమారు రూ.5కోట్ల విలువచేసే పట్టా భూమిని కూడా కొందరు ఆక్రమించే యత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్‌ వరకు వె ళ్లినట్లు సమాచారం. చిన్నచౌకు ప్రాంతంలో ఓ మహిళ పేరిట డాక్యుమెంటు సృష్టించి కొందరు విలువైన ప్రైవేటు స్థలాలను ఆక్రమించే యత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇలా విలువైన భూములను కాజేసే యత్నాలు చేస్తుండడంపై కడపలో పెద్ద చర్చ సాగుతోంది. అందరూ పెద్దతలలే కావడంతో సామాన్యులకు భూములను కాపాడుకోవడం కష్టంగా మారిందని అంటున్నారు.

Updated Date - 2021-07-27T05:21:13+05:30 IST