అక్కడా ‘మహి’మ చూపేనా!

ABN , First Publish Date - 2021-10-17T08:18:30+05:30 IST

కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచి ఉండొచ్చు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లను వారి గడ్డపై కంగుతినిపించి ఉండొచ్చు.

అక్కడా ‘మహి’మ చూపేనా!

కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచి ఉండొచ్చు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లను వారి గడ్డపై కంగుతినిపించి ఉండొచ్చు. సారథిగా విరాట్‌ విజయాల శాతం అద్భుతంగా ఉండొచ్చు. కానీ అతడి నాయకత్వంలో భారత్‌ ఒక్క మేజర్‌ ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం సగటు భారత క్రికెట్‌ ఫ్యాన్‌కు చివుక్కు మనిపించేదే. ఆ ఐసీసీ ట్రోఫీ లోటు తీర్చేందుకు కాబోలు టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా మెంటార్‌గా ధోనీని నియమించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో లెజెండ్‌ ధోనీ ‘మ్యాజిక్‌’పై కోట్లాదిమంది గంపెడాశలు పెట్టుకున్నారు. 


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): నిరుడు ఫ్లేఆప్స్‌కు క్వాలిఫై కాలేకపోయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ ఐపీఎల్‌లో సూపర్‌ షోతో ఏకంగా టైటిల్‌ ఎగరేసుకుపోయింది. ఇందుకు పూర్తి క్రెడిట్‌   నిస్సందేహంగా కెప్టెన్‌ ధోనీదే. ఏడాదిలోనే జట్టు చాంపియన్‌గా ఎదగడం వెనుక మాస్టర్‌మైండ్‌ మహీదే. ఇకపోతే.. ఆదివారం నుంచి జరిగే టీ20 ప్రపంచ కప్‌లో మెంటార్‌గా టీమిండియాలోకి ధోనీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈక్రమంలో సీఎ్‌సకేను నాలుగోసారి ఐపీఎల్‌ విజేతగా నిలపడం ద్వారా మెంటార్‌గా తన పాత్ర ఎలాంటిదో అతడు చాటి చెప్పినట్టయింది. గత 17 సంవత్సరాలుగా దేశ క్రికెట్‌పై మహీ వేసిన ముద్ర అలాంటిది ఇలాంటి కాదు. అటు భారత జట్టు సారథిగా, ఇటు చెన్నై కెప్టెన్‌గా ధోనీ పాత్ర మైదానంలో అత్యంత కీలకంగా చెప్పాలి. అలాగే రాబోయే నెల రోజుల్లో పొట్టి కప్పులో మెంటార్‌గా అతడి రోల్‌ అంతకంటే ముఖ్యమని చెప్పాలి. ఇకపోతే మెంటార్‌గా మహీ విలువైన సలహాలు, సూచనలను ఎలా స్వీకరిస్తారనేది కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రిపై ఆధారపడి ఉంది. భారత క్రికెట్‌లో మెంటార్‌ పదవికి విస్తృతార్థమే ఉంది. అంటే.. వ్యూహాలు రచించడం, జట్టు ఆటగాళ్లను మోటివేట్‌ చేయడం, తన అభిప్రాయాలను బలంగా వినిపించడం.


ప్రధాన ఐసీసీ టోర్నీ గెలవని ప్రస్తుత టీమిండియాకు బలమైన అభిప్రాయాలు వ్యక్తీకరించే వాడిగా మెంటార్‌ పాత్రలో మహీ కీలకమే. తనవంతు వచ్చినప్పుడు అభిప్రాయాలను విస్పష్టంగా చెప్పడం మహీ స్టయిల్‌. అంతే తప్ప శాస్త్రి, విరాట్‌ పరిధుల్లో ప్రవేశించే నైజం ధోనీది కాదు. అయితే ప్రస్తుత భారత జట్టులోని సీనియర్‌ క్రికెటర్లు ధోనీ సారథ్యంలో అరంగేట్రం చేసి..స్టార్‌ ఆటగాళ్లుగా ఎదిగారు. ఈ నేపథ్యంలో మెంటార్‌గా ధోనీ పాత్రపై అమితాసక్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మూడు విషయాల్లో అతడు కోహ్లీకి ఎలాంటి సూచనలు చేస్తాడనేది చూడాలి.


రోహిత్‌తో ఎవరు?

చెన్నై ఈ ఐపీఎల్‌ విజేతగా నిలవడంలో ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసి పాత్ర అనన్యసామాన్యం. వారిద్దరి సత్తాపై గట్టి నమ్మకం ఉంచిన మహీ ఫలితం రాబట్టాడు. దాంతో ప్రపంచకప్‌లో రోహిత్‌తో ఓపెనర్‌గా ఎవరిని పంపాలనే విషయమై ధోనీ సలహాను కోహ్లీ కోరితే.. అతడు ఎవరిని సూచిస్తాడు? ఈ ఐపీఎల్‌లో బ్యాటింగ్‌లో దుమ్మురేపిన, సాంకేతికంగా తిరుగులేని కేఎల్‌ రాహుల్‌నా, పవర్‌ ప్లేలో భారీషాట్లు కొట్టే ఇషాన్‌ కిషన్‌నా? లేదంటే మిడిలార్డర్‌లో పంపితే మధ్య ఓవర్లలో ఇషాన్‌ బాగా ఉపయోగపడతాడని మహీ చెబుతాడా అన్నది ఆసక్తికరం. అలాగే ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా, శార్దూల్‌ ఠాకూర్‌లలో ఎవరివైపు మొగ్గుచూపుతాడో చూడాలి. ఈసారి ఐపీఎల్‌లో హార్దిక్‌ పూర్తిగా నిరాశపరిచాడు.


అంతేకాదు వెన్నునొప్పితో అతడు వరల్డ్‌ కప్‌లో బౌలింగ్‌ చేసే అవకాశాలు లేవు. ఈ ఐపీఎల్‌లో బ్యాటర్‌గా శార్దూల్‌కు చాన్సు రాలేదు. కానీ టీమిండియాకు ఆడినప్పుడు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తానేంటో శార్దూల్‌ నిరూపించుకున్నాడు. మరి ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయాల్సి వస్తే ధోనీ నిర్ణయం ఎలా ఉంటుందో? మూడో సీమర్‌గా భువనేశ్వర్‌, శార్దూల్‌లో ఎవరికి ప్రాధాన్యమిస్తాడు? ఈ ఐపీఎల్‌లో వికెట్లు తీయాల్సిన తరుణంలో తనకు బంతి అప్పగించిన ప్రతిసారీ కెప్టెన్‌ ధోనీ నమ్మకాన్ని ఠాకూర్‌ నిలబెట్టాడు. ఇటీవలి కాలంలో భువనేశ్వర్‌ పెద్దగా వికెట్లు సాధించలేకపోతున్నాడు. దాంతో అనుభవజ్ఞుడైన బౌలరా, ఫలితాన్ని అందించే బౌలరా..ఇద్దరిలో ధోనీ ఎవరికి ఎంచుకుంటాడో. మొత్తంగా..కోట్లాది కళ్లు సునిశితంగా తనను గమనిస్తున్న వేళ మెంటార్‌గా ధోనీ ఏం మాయ చేస్తాడో చూడాలి.


అతడి రాకతో మరింత ఆత్మవిశ్వాసం

అతడు అపార అనుభవజ్ఞుడు. ధోనీ జట్టులోకి రావడం ఎంతో ఉద్విగ్నంగా ఉంది. మేం టీమిండియాకు కెరీర్‌ ప్రారంభించిన రోజుల్లో కెప్టెన్‌గా ఉన్న మహీ మా అందరికీ మార్గదర్శకుడు. యువ క్రికెటర్లు మహీ సలహాలతో బాగా లాభపడతారు. పరిస్థితులను నిశితంగా గమనించి, అందుకు తగిన విధంగా సలహాలిచ్చే మహీతో వారి ఆట ఒకటి రెండు శాతం మెరుగుపడుతుంది. మహీ రాక మా స్థయిర్యాన్ని పెంచడమేకాదు..జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేస్తుంది.             

- విరాట్‌ కోహ్లీ

Updated Date - 2021-10-17T08:18:30+05:30 IST