మోదీకి కెప్టెన్ అమరీందర్ ధన్యవాదాలు

ABN , First Publish Date - 2021-11-16T22:22:24+05:30 IST

గురు నానక్ జయంత్యుత్సవాలకు ముందు కర్తార్‌పూర్

మోదీకి కెప్టెన్ అమరీందర్ ధన్యవాదాలు

చండీగఢ్ : గురు నానక్ జయంత్యుత్సవాలకు ముందు కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరిచినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. గురు పరబ్ సందర్భంగా వేలాది మంది భక్తులు సందర్శించడానికి వీలుగా సకాలంలో దీనిని తెరిచారని ట్వీట్ చేశారు. 


కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను సకాలంలో తెరిచినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు నా కృతజ్ఞతలు. గురు నానక్ దేవ్‌ జీ గురు పరబ్ సందర్భంగా ఈ పవిత్ర క్షేత్రంలో పూజలు చేసేందుకు వేలాది మంది భక్తులకు అవకాశం దొరుకుతుంది’’ అని పేర్కొన్నారు. 


గురు నానక్ జయంత్యుత్సవాలు నవంబరు 19న జరుగుతాయి.  ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా నవంబరు 19కి ముందే కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అంతకుముందు కెప్టెన్ సింగ్ కోరారు. అనంతరం హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, బుధవారం నుంచి దీనిని తెరవాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు. దీనిని తెరవడం వల్ల సిక్కు భక్తులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అంతేకాకుండా గురు నానక్‌తోపాటు సిక్కుల పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న గౌరవభావం వెల్లడవుతోందని చెప్పారు. 


కర్తార్‌పూర్ కారిడార్‌ పొడవు 4.7 కిలోమీటర్లు. సిక్కులు ఈ కారిడార్లో ప్రయాణించి పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు వెళ్తారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో దీనిని మూసేశారు. 


Updated Date - 2021-11-16T22:22:24+05:30 IST