Abn logo
Sep 18 2021 @ 19:21PM

సిద్ధూపై కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూను ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదిస్తే, తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. 


‘‘పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి ఆయన (నవజోత్ సింగ్ సిద్ధూ) పేరును నా దేశం కోసం నేను వ్యతిరేకిస్తాను. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ఆయన స్నేహితుడు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాతో సిద్ధూకు సంబంధాలు ఉన్నాయి’’ అని కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను ప్రతిపాదిస్తే తాను వ్యతిరేకిస్తానన్నారు. 


ఇదిలావుండగా, పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అప్పగిస్తూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం తీర్మానం చేశారు. 


పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేశారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, రాజీనామా అనంతరం కెప్టెన్ సింగ్ మాట్లాడుతూ, తాను మూడుసార్లు తీవ్ర అవమానాలకు గురయ్యానని చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. 


‘‘ఇలా జరగడం ఇది మూడోసారి, రెండోసారి ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిచారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడోసారి కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం’’ అన్నారు. తన సామర్థ్యంపై కొంచెం అనుమానం వ్యక్తమైనా అది తనకు అవమానమేనని చెప్పారు. 


ఇవి కూడా చదవండిImage Caption