ఛండీగఢ్: కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సలహాదారు మహమ్మద్ ముస్తఫా విమర్శలు గుప్పించారు. పంజాబ్‌ను ఐదేళ్లుగా కెప్టెన్ అమరీందర్ అవమానిస్తూ వచ్చారని, పార్టీలోని వ్యక్తులు కూడా 4.5 సంవత్సరాలుగా ఆయనను సహిస్తూ వచ్చారని అన్నారు. సిద్ధూను సీఎంగా ప్రతిపాదిస్తే తాను వ్యతిరేకిస్తానంటూ కెప్టెన్ చేసిన వ్యాఖ్యలపై మీడియాతో ఆయన మాట్లాడుతూ, తానే పార్టీ నేత అయతే, 30 రోజుల్లో కెప్టెన్‌ను పార్టీ నుంచి తొలగించి ఉండేవాడినని అన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏమీ ద్రోహి కాదని, సిద్ధూను కెప్టెన్ ద్రోహి అని పిలిస్తే ఆయన చిట్టాను కూడా విప్పాల్సి వస్తుందని అన్నారు. నిజానికి కెప్టెన్ టార్గెట్ సిద్ధూ కాదని, గాంధీ కుటుంబమని ఆయన నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబాన్ని ఆయన లక్ష్యంగా చేసుకోవడం చూస్తూ ఊరుకోలేనని మహమ్మద్ ముస్తఫా అన్నారు.