Amarinder Singh Joins BJP: బీజేపీలో చేరిన కెప్టెన్.. ఆట మొదలు

ABN , First Publish Date - 2022-09-20T00:42:08+05:30 IST

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని

Amarinder Singh Joins BJP: బీజేపీలో చేరిన కెప్టెన్.. ఆట మొదలు

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిరణ్ రిజుజు నేతృత్వంలో బీజేపీలో చేరారు. తన పార్టీ పంజాబ్ లోక్‌ కాంగ్రె‌స్‌ను బీజేపీలో విలీనం చేశారు. ఈ సందర్భంగా కిరణ్ రిజుజు మాట్లాడుతూ కెప్టెన్ హయాంలో జాతీయ భద్రత కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేశారని కిరణ్ రిజుజు కితాబునిచ్చారు. మంచి మనసున్న వారంతా ఒక జట్టు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీలో చేరాక కెప్టెన్... బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. 2024లో పంజాబ్‌లో బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లు గెలిచే బాధ్యతను కెప్టెన్‌కు అప్పగించనున్నారు. 





పంజాబ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ కొత్తగా పెట్టిన పంజాబ్ లోక్‌ కాంగ్రె‌స్‌ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అంతేనా తనకు బాగా పట్టున్న నియోజకవర్గం పటియాలాలో ఆయన ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ తనను పార్టీ నుంచి బహిష్కరించడంతో ఆయన పంజాబ్ లోక్‌ కాంగ్రె‌స్‌ పార్టీ పేరుతో వేరుకుంపటి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో సరిగా ప్రచారం కూడా చేయలేకపోయారు. దీంతో చేదు ఫలితాలు వచ్చాయి.   


1992లో అకాలీదళ్ నుంచి విడిపోయి శిరోమణి అకాలీదళ్(పీ) స్థాపించిన కెప్టెన్ 1998లో కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ నాయకుడయ్యారు. ఇప్పడు పంజాబ్ లోక్‌ కాంగ్రె‌స్‌ను బీజేపీలో విలీనం చేసి బీజేపీ నాయకుడయ్యారు. 


2024లో ఆప్‌ను సమర్థంగా ఎదుర్కొనడంతో పాటు కాంగ్రెస్‌ను ఎండగట్టే బాధ్యతను బీజేపీ అధిష్టానం కెప్టెన్‌‌కు అప్పగించనుంది. పంజాబ్ సున్నిత రాష్ట్రమని, పాక్, చైనాల నుంచి ఎదురౌతున్న సవాళ్లనుంచి దేశాన్ని కాపాడే బాధ్యత తమపై ఉందని కెప్టెన్ అంటున్నారు. 



Updated Date - 2022-09-20T00:42:08+05:30 IST