Abn logo
Feb 18 2020 @ 03:57AM

కార్వీ.. రిపీట్‌ కానివ్వం!

  • నిబంధనలు మరింత కట్టుదిట్టం 
  • త్వరలోనే సర్క్యులర్‌ జారీ: త్యాగి

క్యాపిటల్‌ మార్కెట్లో కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ తరహా ఘటనలను నివారించేందుకు నిబంధనలు మరింత పటిష్ఠం చేయనున్నట్లు సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే సర్క్యులర్‌ను జారీ చేయనున్నట్లు సెబీ బోర్డు సమావేశం అనంతరం ఆయన మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎ్‌సబీఎల్‌).. క్లయింట్ల షేర్లను దుర్వినియోగపర్చింది.  95,000 మంది క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన షేర్లను వారి అనుమతి లేకుండానే తనఖా పెట్టి రూ.600 కోట్ల రుణం తీసుకుంది. దాంతో సెబీ ఈ బ్రోకింగ్‌ సంస్థపై నిషేధం విధించింది. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు కార్వీ లైసెన్సును రద్దు చేశాయి. ఈ ఉదంతంపై త్యాగి ఇంకా ఏమన్నారంటే.. ఈ నెల 14 నాటికి కార్వీ చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.1,189 కోట్లు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద కార్వీకి చెందిన రూ.511 కోట్ల విలువైన సెక్యూరిటీలున్నాయి. మిగతా రూ.678 కోట్ల బకాయిలు రికవరీ కావాల్సి ఉంది. తన గ్రూపు కంపెనీలో వాటా విక్రయించడం ద్వారా మార్చి చివరి నాటికి మిగతా బకాయిలు చెల్లిస్తామని ఎన్‌ఎ్‌సఈకి కార్వీ సమాచారం అందించింది. అప్పటి వరకు వేచి చూస్తాం. బకాయిలు తీర్చని పక్షంలో కంపెనీపై తగిన చర్యలు చేపడతాం. కార్వీ విషయంలో క్లయింట్లకు చెందిన సెక్యూరిటీలు, సొమ్ము తిరిగి వారికి అందజేయడమే నియంత్రణ సంస్థ తొలి ప్రాధాన్యత. సీఎండీ పదవి విభజనకు అందుకే గడువు పొడిగింపు

లిస్టెడ్‌ కంపెనీల చైర్మన్‌, ఎండీ పదవుల విభజన గడువును సెబీ మరో రెండేళ్లు (2022 ఏప్రిల్‌ వరకు) పొడిగించింది. నిబంధన అమలులో కంపెనీలకు ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా గడువు పొడిగించడం జరిగిందని త్యాగి తెలిపారు. టాప్‌-500 కంపెనీల్లో ఇప్పటివరకు 50 శాతమే సీఎండీ పదవిని విభజించాయన్నారు. 


ఇన్విట్‌లకు ఊరట 

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌(ఇన్విట్‌) ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజర్‌ అర్హత నిబంధనలను సడలించాలని సెబీ నిర్ణయించింది. సోమవారం నాటి బోర్డు సమావేశంలో ఇందుకు ఆమోదం లభించింది. అంతేకాదు.. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌ (రీట్స్‌), ఇన్విట్‌ల ఇన్వెస్టర్లకు వేగవంతంగా యూనిట్ల జారీ ప్రక్రియకూ సెబీ బోర్డు అనుమతి తెలిపింది. 


వినూత్నతకు వెల్‌కమ్‌!

క్యాపిటల్‌ మార్కెట్లో అధునిక ఆర్థిక సాంకేతికత (ఫైనాన్షియల్‌ టెక్నాలజీ్‌స-ఫిన్‌టెక్‌)ల వినియోగానికి వెసులుబాటు కల్పించేందుకు సెబీ మరో నిర్ణయం తీసుకుంది. రెగ్యులేటరీ సాండ్‌బాక్స్‌ విధానంలో ఫిన్‌టెక్‌ కంపెనీలు తమ వినూత్న ఆర్థిక, పెట్టుబడి సాధనాలు లేదా పథకాలు, సేవల లైవ్‌ టెస్టింగ్‌కు సెబీ బోర్డు అనుమతి తెలిపింది. కంపెనీలు తమ వినూత్న ఆర్థిక ఆవిష్కరణల సాయంతో పరిమిత లేదా ఎంపిక చేసుకున్న వినియోగదారులకు నిర్దిష్ఠ కాలంపాటు సేవలందిస్తాయి. ఆ పరీక్షల్లో సాధించే విజయాన్ని బట్టి సేవలను పూర్తి స్థాయిలో విస్తరించాలా..? వద్దా..? అని నిర్ణయం తీసుకుంటాయి. సెబీ వద్ద రిజిస్టర్‌ చేసుకున్న కంపెనీలనే ఈ లైవ్‌ టెస్టింగ్‌కు అనుమతిస్తారు.


నెలాఖరుతో ముగియనున్న పదవీకాలం 

సెబీ చైర్మన్‌గా అజయ్‌ త్యాగి మూడేళ్ల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ పదవి తనకు మంచి అనుభూతిని మిగిల్చిందన్నారు. ‘‘నేను, నా బృందం సమాలోచన పద్ధతిని నమ్ముకుని ముందుకెళ్లాం. మదుపర్లు, ట్రేడర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చాలా జాగ్రత్తగా, పారదర్శకంగా పనిచేశామ’’ని ఆయన పేర్కొన్నారు. సెబీని ఉత్సాహపూరితమైన సంస్థగా అభివర్ణించిన త్యాగి.. ఏదో ఒక రూపంలో సవాళ్లు ఎప్పుడూ ఉండనే ఉంటాయన్నారు. చట్టాల అమలు మరింత మెరుగుపడాల్సి ఉందని, ఇందుకు మరెన్నో చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. 


పెట్టుబడి సలహాదారుల నిబంధనలు కఠినతరం

క్యాపిటల్‌ మార్కెట్‌ సాధనాల్లో పెట్టుబడులు పెట్టేవారి ప్రయోజనాలను రక్షించేందుకు సెబీ మరిన్ని చర్యలు చేపట్టింది. పెట్టుబడి సలహాదారుల అర్హత నిబంధనలను మరింత కఠినతరం చేయాలని సెబీ నిర్ణయానికొచ్చింది. అలాగే, ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజర్లు  వసూలు చేసే ఫీజుపైనా గరిష్ఠ పరిమితిని విధించాలని నిర్ణయించింది. అంతేకాదు, సెక్యూరిటీ డిస్ట్రిబ్యూషన్‌ నడిపేవారు స్వతంత్ర ‘ఆర్థిక సలహాదారు’ లేదా ‘వెల్త్‌ అడ్వైజర్‌’ వంటి టైటిల్స్‌ వినియోగాన్ని నిషేధించింది. ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజర్‌గానూ రిజిస్టర్‌ చేసుకున్న వారికి మినహాయింపునిచ్చింది. ఈ ప్రతిపాదనలకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇకపై సలహాదారులు డిస్ట్రిబ్యూషన్‌ సేవలందించరాదని, కంపెనీలు కూడా అడ్వైజరీ, డిస్ట్రిబ్యూషన్‌ సేవలను విభజించాలని నియంత్రణ సంస్థ తెలిపింది. 


ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ.. పరిశీలిస్తున్నాం

నేషనల్‌ స్టాక్‌  ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) అభ్యర్థన ప్రస్తుతం ప్రస్తుతం పరిశీలనలో ఉందని త్యాగి తెలిపారు. గతంలో ఎక్స్ఛేంజ్‌పై సెబీ జారీ చేసిన పలు ఆర్డర్లను దృష్టి పెట్టుకొని ఐపీఓ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఐపీఓకు వచ్చేందుకు సెబీని సంప్రదించినట్లు గతనెలలో ఎన్‌ఎ్‌సఈ వెల్లడించింది. ఎక్స్ఛేంజ్‌ ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) పద్ధతిన తమ ఈక్విటీని కొంత విక్రయించాలనుకుంటున్నారు. 


ఎంఎఫ్‌ల పునఃవర్గీకరణ 

స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పథకాలను పునఃవర్గీకరించాలని యోచిస్తున్నట్లు సెబీ తెలిపింది. తద్వారా ఈక్విటీల్లో ఈ పథకాల పెట్టుబడి పరిధి మరింత పెరుగుతుందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఫండ్ల పెట్టుబడులకు ఏకరీతి విధానం కోసం 2017లో నియంత్రణ సంస్థ ఈక్విటీ ఎంఎఫ్‌ పథకాలను లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌లుగా వర్గీకరించింది. లార్జ్‌క్యాప్‌ పథకాలు టాప్‌-100 లిస్టెడ్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. టాప్‌-101 నుంచి 250 కంపెనీలు మిడ్‌ క్యాప్‌, 251 నుంచి స్మాల్‌ క్యాప్‌ పథకాల పరిధిలోకి వస్తాయి. 

Advertisement
Advertisement
Advertisement