తగ్గం.. తేల్చుకుంటాం

ABN , First Publish Date - 2020-04-03T09:27:47+05:30 IST

రాజధాని అమరావతిపై తగ్గేది లేదు. తేల్చుకునే వరకు వదలం. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు మార్పులు చేయాలనే ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తాం.

తగ్గం.. తేల్చుకుంటాం

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌పై సుప్రీం కోర్టుకు వెళ్తాం

సీతారాముల కల్యాణం సాక్షిగా శిబిరాల్లో నిరసనలు

 107వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు


తుళ్లూరు/గుంటూరు : రాజధాని అమరావతిపై తగ్గేది లేదు. తేల్చుకునే వరకు వదలం. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌కు మార్పులు చేయాలనే ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఒక పక్క రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే.. సీఎం జగన్‌ మాత్రం మాపై కక్ష ఎలా సాధించాలో ఆలోచిస్తున్నారు..’ అని అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం వరుసగా 107వ రోజు ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు దీక్షలు, నిరసనలు కొనసాగించారు.


శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం దీక్షా శిబిరాల్లోనే సీతారామ కల్యాణం నిర్వహించారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, నీరుకొండ, పెదపరిమి తదితర శిబిరాల్లో జైశ్రీరాం, జై అమరావతి అంటూ మహిళలు ముగ్గులు పెట్టి నిరసన తెలిపారు. వెంకటపాలెం, అనంతవరం, నెక్కలు, రాయపూడి, అబ్బిరాజుపాలెం, కృష్ణాయపాలెం, యర్రబాలెం, నేలపాడు,  తదితర గ్రామాల్లోని వీధుల్లో శ్రీరామునికి పూజలు నిర్వహించి రాజధాని కోసం మొక్కులు మొక్కారు. 

Updated Date - 2020-04-03T09:27:47+05:30 IST