విశాఖలో.. రాజధాని భూమ్‌

ABN , First Publish Date - 2021-04-07T05:59:08+05:30 IST

రాష్ట్ర పరిపాలనా రాజధానిని ఏర్పాటుచేస్తామని..

విశాఖలో.. రాజధాని భూమ్‌

నగరంలో భారీగా పెరిగిన ప్లాట్లు, ఫ్లాట్ల ధరలు

ఎండాడలో గజం రూ.1.1 లక్షలు

సాగర్‌నగర్‌లో రూ.70 వేలు

రుషికొండలో రూ.60 వేలు

అదేబాటలో ఫ్లాట్ల రేట్లు

సిటీలో రూ.6,500

త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ రూ.1.6 కోట్లు

కరోనా సమయంలోను తగ్గని రిజిస్ర్టేషన్‌ శాఖ ఆదాయం

గత ఏడాది కంటే పది శాతం వృద్ధి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిపాలనా రాజధానిని ఏర్పాటుచేస్తామని ప్రకటించినప్పటి నుంచి విశాఖపట్నంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణంగానే భూముల ధరలు ఇతర ప్రాంతాల కంటే విశాఖపట్నంలో ఎక్కువ. ఇక దానికి ‘రాజధాని’ మసాలా జోడించడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పదింతలు పెరిగిపోయింది. వేలాది సంఖ్యలో ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఖాళీగా ఉన్నా సరే...కొత్త కొత్త అపార్టుమెంట్లు నిర్మించేస్తున్నారు. నగరానికి 30 కి.మీ. దూరంలో వున్న పద్మనాభం వంటి గ్రామీణ ప్రాంతంలో కూడా ఇబ్బడిముబ్బడిగా లేఅవుట్లు వేసేస్తున్నారు.


విశాఖపట్నంలో ప్రస్తుతం అధిక ధరలు పలుకుతున్న ప్రాంతం ఎండాడ. జాతీయ రహదారిపై జూ దాటిన తరువాత వచ్చే ఈ గ్రామంలో ఎక్కువ శాతం కొండలు, గుట్టలే. కొన్నాళ్ల క్రితం వరకు దిగువ మధ్య తరగతి, పేదలు నివాసం ఉండేవారు. జాతీయ రహదారి నుంచి ఎండాడ మీదుగా గీతం యూనివర్సిటీ వైపు వంద అడుగుల రహదారి నిర్మించిన తరువాత ఒక్కసారిగా ఈ ప్రాంతంలో అభివృద్ధి మొదలైంది. రెండేళ్ల క్రితం వరకు అక్కడ గజం స్థలం రూ.40 వేలకు లభించేది. ప్రధాని రహదారిని ఆనుకుని వుంటే రూ.70 వేలు పలికేది. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటవుతుందని ప్రకటించడం...అది కూడా రుషికొండలో సీఎం కార్యాలయం వస్తుందని ప్రచారం జరగడంతో ఎండాడ ప్రాంతంలో స్థలాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. విశాఖపట్నంలో ఏడాది క్రితం వరకు అత్యధిక ధరలు పలికిన ప్రాంతాలు సీతమ్మధార, ఎంవీపీ కాలనీలు. ఇక్కడ గజం లక్ష రూపాయల చొప్పున అమ్ముడైంది. ఇప్పుడు ఎండాడలో గజం రూ.1.1 లక్షల చొప్పున అమ్ముతున్నారు. ఆ రేటుకు కూడా కోరుకున్న చోట లభించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఎత్తైన (32 అంతస్థులు) అపార్టుమెంట్‌ ‘ఆక్సిజన్‌ టవర్స్‌’ సీతమ్మధారలో ఉంది. అందులో ఫ్లాట్‌ ధర చ.అ. రూ.6,500 వరకు విక్రయించారు. అదే అత్యధికం.


ఇప్పుడు ఎండాడ కూడా ఆ స్థాయికి చేరింది. ఇక్కడ అతి పెద్ద అపార్టుమెంట్‌ నిర్మిస్తున్నారు. కరోనాకు ముందు ఆ ప్రాజెక్టులో చ.అ. ధర రూ.4,500 ఉండేది. ఇప్పుడు డిమాండ్‌ పెరగడంతో సీతమ్మధారతో సమానంగా (చ.అ. రూ.6,500) చెబుతున్నారు. అలాగే నగరంలోని ఇసుకతోట జంక్షన్‌లో హైవే పక్కనే ఓ గ్రూపు ఓ అపార్టుమెంట్‌ నిర్మిస్తోంది. అందులో త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ రూ.1.6 కోట్లు చెబుతోంది. ప్రస్తుతం విశాఖ నగరంలోనే కాకుండా, 7 కి.మీ. పరిధిలో ఎక్కడైనా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌కు రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోందంటున్నారు.


- రుషికొండ సాగర తీర ప్రాంతం. ఇక్కడ ఐటీ పార్క్‌ ఉంది. అలాగే అత్యంత ధనవంతులు వుండే గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇక్కడ పదేళ్ల క్రితం వీఎంఆర్‌డీఏ రో హౌసింగ్‌ పేరుతో 72 విల్లాలు నిర్మించింది. వీటి ధర రూ.70 లక్షలుగా ప్రకటించింది. నాలుగేళ్ల క్రితం వరకు వాటిని అమ్ముకోవడానికి నానా పాట్లు పడింది. ఆఖరుకు అందులో కొన్నింటిని ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చుకుంది. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ‘సీఎం కార్యాలయం’ వస్తుందని ప్రచారం జరగడంతో ఊహించని విధంగా రేట్లు పెరిగిపోయాయి. అక్కడ గజం ఇంతకు ముందు రూ.35 వేల నుంచి రూ.40 వేలకు లభించేది. ఇప్పుడు రూ.60 వేలు చెబుతున్నారు. సాగర్‌నగర్‌లో గజానికి రూ.40 వేలు ఇస్తే మంచి ప్రాంతంలో ఇంటి స్థలం దొరికేది. ఇప్పుడు అక్కడ కూడా గజం రూ.70 వేలు చొప్పున చెబుతున్నారు. 


- మధురవాడలోని మిథిలాపురి వుడా కాలనీ రోడ్డులో (హైవే నుంచి ఐటీ పార్క్‌కు వెళ్లే మార్గం) కూడా రోడ్డు పక్కన గజం రూ.1.1 లక్షల నుంచి రూ.1.2 లక్షల వరకు చెబుతున్నారు. లోపలకు వెళితే...రూ.60 వేల నుంచి రూ.70 వేలకు లభిస్తోంది. గజానికి రూ.30 వేల వరకు రేటు పెరిగింది.


- అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వున్న పోతినమల్లయ్యపాలెంలో ఆఖరి బస్టాప్‌ వద్ద గజం రూ.55 వేల వరకు విక్రయిస్తున్నారు. గతంలో రూ.40 వేలకు దొరికేది.


కరోనా సమయంలోను రూ.654.24 కోట్ల ఆదాయం

కరోనా కారణంగా రిజిసే్ట్రషన్ల శాఖ సుమారుగా 40 రోజులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను మూసేసింది. ఆ తరువాత తెరిచినా నెల రోజులు భయంతో ఎవరూ రిజిసే్ట్రషన్లకు రాలేదు. అంటే సుమారుగా రెండు నెలల ఆదాయం తగ్గిపోవాలి. విశాఖపట్నంలో సగటున నెలకు రూ.60 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఎలా లేదన్నా గత ఏడాదితో పోల్చుకుంటే రూ.100 కోట్ల ఆదాయం తగ్గాలి. కానీ అలా ఏమీ జరగలేదు. ఎప్పటిలాగే సుమారుగా 10 శాతం వృద్ధి రేటు నమోదుచేసింది. 2019-20లో 55,221 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.595.57 కోట్ల ఆదాయం రాగా, 2020-21లో 54,882 డాక్యుమెంట్ల ద్వారా రూ.654.24 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదంతా పరిపాలనా రాజధాని ప్రభావమేమని, డాక్యుమెంట్ల సంఖ్య తగ్గినా, ఆదాయం పెరగడానికి భూమి విలువలు పెరగడమే కారణమని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే రాజధాని మాటెలా వున్నా...నగరం, శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం వున్న ధరలు చూస్తే  సొంత ఇంటి కల...కలగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2021-04-07T05:59:08+05:30 IST