అక్కడ కాకపోతే ఇంకెక్కడ?

ABN , First Publish Date - 2020-02-24T09:00:34+05:30 IST

కార్యనిర్వాహక రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన నాటి నుంచీ.. నగరంలో ఎక్కడ సచివాలయం పెడతారు.. ఎక్కడ సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటవుతుంది.. ఎక్కడ గవర్నర్‌ కొలువు

అక్కడ కాకపోతే ఇంకెక్కడ?

  • సచివాలయంపై రోజుకో మాట!.. 
  • మిలీనియం టవర్‌-1లోనేనని నిన్నటిదాకా ప్రచారం.. 
  • ఇప్పుడక్కడ పెట్టబోమని  మంత్రుల ప్రకటన
  • కార్యదర్శిదీ అదేమాట
  • 4 నెలల్లో విశాఖ నుంచే పాలన!
  • కార్యనిర్వాహక రాజధానికి సన్నాహాలు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): కార్యనిర్వాహక రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన నాటి నుంచీ.. నగరంలో ఎక్కడ సచివాలయం పెడతారు.. ఎక్కడ సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటవుతుంది.. ఎక్కడ గవర్నర్‌ కొలువు తీరతారు.. ఏయే కార్యాలయం ఎక్కడుంటుంది.. ఏ శాఖ అధికారులు ఏయే భవనాలు పరిశీలించారు.. ఇలా విస్తృతంగా వార్తలొస్తూ వచ్చాయి. ఐటీ కంపెనీల కోసం ఏర్పాటుచేసిన రుషికొండ ఐటీ మిలీనియం టవర్స్‌ను ఖాళీచేయిస్తున్నారని.. అక్కడ సచివాలయం ఏర్పాటు ఖాయమని ప్రచారం జరిగింది. కాపులుప్పాడలో ఏర్పాటు చేయవచ్చని కూడా వినిపించింది. అయితే ఆ రెండు చోట్లా ఏర్పాటు చేసే ఆలోచనే లేదని రాష్ట్ర మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంకెక్కడ పెట్టబోతున్నారనే చర్చ విశాఖలో ముమ్మరంగా సాగుతోంది.


అధికారుల హడావుడి..

రుషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్స్‌ను అమరావతి నుంచి అధికారులు వచ్చి పరిశీలించడం, టవర్‌-2 నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి రూ.20 కోట్లు నిధులు మంజూరు చేయడంతో అక్కడే సచివాలయం ఏర్పాటవుతుందని అంతా భావించారు. ఏపీఐఐసీ అధికారులు కూడా పది అడుగుల ఎత్తున్న నాలుగు సింహాల బొమ్మను తీసుకొచ్చారు. మిలీనియం టవర్‌-1లో 1,500 మందికి ఉపాధి కల్పించిన కాండ్యుయెంట్‌ ఐటీ కంపెనీని అక్కడి నుంచి తరలించేస్తారని.. ఆ టవర్‌ పక్కనే ఉన్న ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ (స్టార్టప్‌ విలేజ్‌) భవనాన్ని సీఎం కార్యాలయంగా ఉపయోగిస్తారని ప్రచారం జరిగింది. ఇంతకు ముందెన్నడూ వీటిపై రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు. రెండు రోజుల నుంచి మాత్రం రుషికొండలో, కాపులుప్పాడలో సచివాలయం ఏర్పాటు చేయబోమని చెబుతోంది. మంత్రులు గౌతమ్‌రెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖలో  4 రోజుల క్రితం ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కాండ్యుయెంట్‌ కంపెనీని తరలించబోమని, మిలీనియం టవర్‌లో  సచివాలయం రాదని తర్వాత ఇద్దరూ ప్రకటించారు. ఇలాంటి వార్తలు పత్రికల్లో వస్తే ఖండించాలని ఐటీ సంస్థల ప్రతినిధులనూ కోరారు. ఐటీ స్థలాన్ని వేరే అవసరాలకు వినియోగించబోమని చెప్పారు. ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ కూడా ఇదే విషయాన్ని గురువారం పునరుద్ఘాటించారు.


సిద్ధంగా ఉన్న భవనాలు ఏవీ?

ఇంకో 4 నెలల్లో సీఎం జగన్‌ సహా విభాగాధిపతులంతా విశాఖ వచ్చేస్తారని.. ఇక్కడే ఉంటారని, ఇక్కడి నుంచే పాలన సాగుతుందని ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగానికి వర్తమానం పంపారు. అంటే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటికి అవసరమైన భవనాలు ఈ 4 నెలల్లో నిర్మించే అవకాశం లేదు. చేరడానికి సిద్ధంగా ఉన్న (‘రెడీ టు ఆక్యుపై) భవనాలే కావాలి. ఆ స్థాయిలో, అంత పెద్ద విస్తీర్ణంలో ఒకేచోట గానీ, దగ్గర దగ్గర గానీ ఎక్కువ సంఖ్యలో భవనాలు లేవు. అలాంటపుడు సచివాలయం ఎక్కడ వస్తుందా అని చర్చ జరుగుతోంది. జిల్లా అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. వివిధ విభాగాధిపతులు మాత్రం విడివిడిగా వచ్చి వారికి సరిపోయే, అవసరమైన భవనాలు ఎక్కడున్నాయో చూసుకుంటున్నారు.


మాకేం అభ్యంతరం?: నేవీ 

విశాఖలోని తూర్పు నౌకాదళం రుషికొండలో సచివాలయం ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేసిందని, అందుకే ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై నేవీ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. రుషికొండలో ఐటీ టవర్‌ నిర్మించినపుడు, ఐటీ వ్యవహారాలు నడిపినప్పుడు లేని అభ్యంతరాలు ప్రభుత్వ కార్యాలయం వస్తే ఎందుకు ఉంటాయని ప్రశ్నిస్తున్నాయి. సీఎం స్థాయి వ్యక్తి అక్కడ ఉంటే ఆ ప్రాంతానికి భద్రత పెరుగుతుందే తప్ప తగ్గదని, దానికి తాము ఎందుకు అభ్యంతరం వ్యక్తంచేస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. ల్యాండ్‌ మాఫియా వారి అనుకూలత కోసం ఇలాంటి ప్రచారాలు చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.


బడ్జెట్‌ సమావేశాల తర్వాత ఒక్కో కార్యాలయం రాక

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే ఒక్కొక్క కార్యాలయాన్ని విశాఖకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. గవర్నర్‌ బంగళా, సీఎం కార్యాలయం, సచివాలయం, మంత్రుల నివాసాలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల నివాసాలకు జిల్లా అధికారులు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను ఇప్పటికే పరిశీలించారు. విశాఖ కేంద్రంగా పాలనా రాజధానికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఉత్తర్వులు జారీచేయలేదు. అందుకే ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నారు. జిల్లా యంత్రాంగానికి మాత్రం మౌఖికంగా ఆదేశాలు వచ్చాయని తెలిసింది. నగరానికి వచ్చిన మంత్రులు, ఉన్నతాధికారులు కార్యాలయాలు, నివాసాల కోసం భవనాలు చూస్తున్నారు. ఎక్కువగా ప్రైవేటు భవనాలు, విల్లాల వైపు మొగ్గుచూపుతున్నారు. వీటన్నిటిపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నట్లు తెలిసింది.


ఖరారయ్యాయంటున్న భవనాలివీ..

  • సిరిపురంలోని ప్రభుత్వ అతిథి గృహాన్ని గవర్నర్‌ బంగళా (రాజ్‌భవన్‌)గా ఉపయోగిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడకు సమీపంలోనే ఉన్న వాల్తేరు క్లబ్‌ యాజమాన్యంతో ఒప్పందం జరిగిందని, అందులో సగం గవర్నర్‌ బంగళాకు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందని కూడా చెబుతున్నారు.
  • ఆర్‌కే బీచ్‌కు సమీపాన విశాఖపట్నం పోర్టు అతిథిగృహం ఉంది. దానిని సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగిస్తారని అంటున్నారు. ఆ తర్వాత కార్తీక వనంలో నిర్మిస్తున్న హోటల్‌కు మారతారని తెలిసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్‌ చాన్స్‌లర్‌, రిజిస్ట్రార్‌ బంగళాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వాటి వివరాలు కూడా ప్రభుత్వం తీసుకుంది.
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పక్కనే ప్లాటినం జూబ్లీ గెస్ట్‌హౌస్‌ ఉంది. అందులో 80 గదులు, రెండు సమావేశ మందిరాలు ఉన్నాయి. 
  • జాతీయ రహదారిపై మద్దిలపాలెం ఆటోమోటివ్‌ జంక్షన్‌ సమీపాన వీఎంఆర్‌డీఏ కొత్తగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించింది. దానిని రాష్ట్ర టౌన్‌ ప్లానింగ్‌ విభాగం కోసం రిజర్వ్‌ చేసి పెట్టారు.
  • సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
  • త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరున్న ఏలేరు అతిథి గృహాన్ని నీటి పారుదల శాఖ తీసుకుంటోందని అంటున్నారు.
  • కైలాసగిరి రోప్‌వే దగ్గరున్న జడ్పీ అతిథిగృహాన్ని ఇటీవల ఆధునీకరించారు. దీనిని పంచాతీయరాజ్‌ శాఖ వినియోగించుకోవచ్చని సమాచారం.
  • మర్రిపాలెంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆర్‌అండ్‌బీ అతిథిగృహాన్ని రాష్ట్ర కార్యాలయం కోసం తీసుకోవాలని యోచిస్తున్నారు.

Updated Date - 2020-02-24T09:00:34+05:30 IST