‘అల్లూరి’ ఆదర్శంగా అమరావతి సాధన

ABN , First Publish Date - 2020-07-05T09:08:18+05:30 IST

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని పోరాడి అమరావతిని నిలబెట్టుకుంటామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. పాలనంతా

‘అల్లూరి’ ఆదర్శంగా  అమరావతి సాధన

  • మహాదీక్షలో స్పష్టం చేసిన రైతులు
  • పోలీసు ఆంక్షల నడుమే నిరసనలు


గుంటూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని పోరాడి అమరావతిని నిలబెట్టుకుంటామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. పాలనంతా అమరావతి నుండే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారానికి 200వ రోజుకు చేరాయి. రాజధానిలోని 29 గ్రామాల రైతులు, కూలీలు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తొలుత అమరావతి పోరులో అమరులైనవారి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తూ వారి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళర్పించారు. కాగా, అమరావతిలో 144వ సెక్షన్‌ అమల్లో ఉందంటూ 29 గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. కరోనా ప్రభావం ఉందంటూ ఆందోళనకారులను అడ్డుకున్నారు. తుళ్లూరులోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన దళిత జేఏసీ నేతలు, టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి అమరావతి కోసం ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అయితే, అనుమతి లేదంటూ పోలీసులు అడుకున్నారు. ఉద్దండరాయుని పాలెం బొడ్డురాయి నుంచి ర్యాలీగా బయలుదేరి శంకుస్థాపన స్థలానికి చేరుకున్న రైతులను కూడా అడ్డుకున్నారు. అంబేడ్కర్‌, మోదీ చిత్రపటాలకు పాలాభిషేకానికి అనుమతి ఇవ్వాలంటూ రైతులు, కూలీలు వేడుకున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో వారి కాళ్లు పట్టుకొని బతిమాలారు. చివరకు రోడ్డుపైనే అంబేడ్కర్‌, మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.


అదే సమయంలో పక్కనే మద్యం షాపు వద్ద వందల సంఖ్యలో ఉన్నవారికి సోకని కరోనా మాకే అంటుతుందా అంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని మూడు ముక్కలాటలో మా భవిష్యత్తును నాశనం చేయవద్దంటూ యువజన జేఏసీ రాయపూడి వీఐపీ ఘాట్‌ పక్కన ఉన్న ఇసుక దిబ్బల్లో నడుము లోతు వరకు పూడ్చుకుని నిరసన వ్యక్తం చేశారు. కాగా, కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ రాజధాని 29 గ్రామాల్లో ‘అమరావతి మహాదీక్ష’ పేరుతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు సామూహిక నిరాహార దీక్షలు కొనసాగించారు. పలువురు మహిళలు భగవద్గీత, లలితా సహస్రం పారాయణం చేశారు. ‘అమరావతి వెలుగు’ పేరిట దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ‘నాది ఆంధ్రపదేశ్‌.. నా రాజధాని అమరావతి, సేవ్‌ అమరావతి.. సేవ్‌ ఫార్మర్స్‌’ అని రాసిన మాస్కులు ధరించారు. టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, వంగవీటి రాధ, బీజేపీ నేత రావెల కిశోర్‌బాబు, వెలగపూడి రామకృష్ణ మద్దతు తెలిపారు.


తల్లి చెప్పినా జగన్‌ వినడం లేదు

అమరావతి జోలికెళ్లవద్దని తల్లి విజయమ్మ చెప్పినా వినకుండా సీఎం జగన్‌ ముందుకెళుతున్నారని, మంచి మాటలు చెప్పినందుకు ఆమెను బెంగళూరుకు పంపేశారని నాన్‌పొలిటికల్‌ జేఏసీ నాయకుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. శనివారం గుంటూరులో నిర్వహించిన నిరసనలో పాల్గొన్నారు. జేఏసీ నాయకులు జంగాల అజయ్‌కుమార్‌, కోట మాల్యాద్రి, రైతులు పాల్గొన్నారు.

  1. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గంలో మాజీఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, మడకశిరలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌, అనంతపురంలో టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నిరసన తెలిపారు. 
  2. కడప నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి అమీర్‌బాబు చేపట్టిన దీక్షలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. రైల్వేకోడూరులో టీడీపీ నేత నరసింహప్రసాద్‌ వైరుతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు.
  3. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, ఉండిలో ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, గన్ని వీరాంజనేయులు, ముప్పిడి వెంకటేశ్వరరావు దీక్షలో పాల్గొన్నారు.  
  4. ప్రకాశం జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు అమరావతికి మద్దతుగా నిరసన చేపట్టాయి. దర్శిలో జరిగిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు పాల్గొన్నారు. 
  5. కాకినాడ మేయర్‌ పావని నివాసంలో చేపట్టిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు, రాజమహేంద్రవరంలో గుడా మాజీ చైర్మన్‌ గన్నికృష్ట, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తునిలో మాజీ మంత్రి యనమల కృష్ణుడు, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడులో వరుపుల రాజా, పెద్దాపురంలో ఎమ్మెల్యే చిన్నరాజప్ప, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరంలో పెందుర్తి వెంకటేష్‌, కొత్తపేటలో బండారు సత్యానందరావు దీక్ష చేసి మద్దతు తెలిపారు. 
  6. విజయవాడలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అమరావతికి మద్దతుగా ఇంట్లోనే దీక్ష చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీడీపీ ఇంచార్జి తిక్కారెడ్డి నిరసన తెలిపారు. కృష్ణాజిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతులకు మద్దతు తెలిపారు. 
  7. అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని అమరావతి మద్దతుదారుల హైదరాబాద్‌ నగర జేఏసీ కమిటీ సభ్యుడు ప్రవీణ్‌ డిమాండ్‌ చేశారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరు తూ రైతులు చేస్తున్న న్యాయ పోరాటం 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా నగర కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు.

Updated Date - 2020-07-05T09:08:18+05:30 IST