మహోద్యమం@ 100

ABN , First Publish Date - 2020-03-27T14:31:08+05:30 IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని..

మహోద్యమం@ 100

వందో రోజుకు అమరావతి రాజధాని రైతుల ఉద్యమం

కొనసాగిన నిరసన దీక్షలు

ప్రతి ఇంటిపైనా జెండాలు, ముంగిట అమరావతి రంగవల్లులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి రైతుల ఉద్యమం వందో రోజుకు చేరుకుంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ గురువారం రైతులు, రైతు కూలీలు, మహిళలు ఆందోళనలు కొనసాగించారు. ఉద్యమం వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇంటి ముందు జై.. అమరావతి ముగ్గులను వేశారు. ఇంటిపైన ఉద్యమ జెండాలను ఎగురవేశారు. ఈ పోరు ఎన్నాళ్లయినా కొనసాగుతుందని చెబుతున్నారు.


రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు గురువారం 100వ రోజు ఆందోళనలు కొనసాగించారు. సామాజిక బాధ్యతగా సామూహిక దూరాన్ని పాటిస్తూ నిరసలు చేపట్టారు. శిబిరాల్లో పదిమంది కూర్చొని నినాదాలు చేశారు. దళిత జేఏసీ నేతలు ఇంటింటికీ తిరిగి కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ మాస్కులు పంపిణీ చేశారు. మహిళలు సేవ్‌ అమరావతి, ఉద్యమానికి వంద రోజులు అంటూ రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతి ఇంటిపైనా నల్లజెండా, పచ్చ జెండాలు కట్టి నిరసనలు తెలిపారు.


గుంటూరు నగరంలో రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి ముపాళ్ల నాగేశ్వరరావు, నాన్‌ పొలిటికల్‌ జాయింట్‌ యాక్షన్‌ నేతలు పీవీ మల్లికార్జునరావు, డాక్టర్‌ నందగోపాల్‌ దంపతులు తమ ఇళ్లలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరాహారదీక్ష కొనసాగించారు. వివిధ సామాజిక మాధమాల ద్వారా టీడీపీ  జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, మన్నవ సుబ్బారావు తదితరులు రైతులకు సంఘీభావం తెలిపారు. మనోవేదనతో మృతి చెందిన రైతులు, రైతు కూలీలలకు తుళ్లూరు ధర్నా శిబిరంలో నివాళులు అర్పించారు. 


రాత్రి 7.30 నుంచి 8గంటల వరకు విద్యుత్‌ ఆపి కొవ్వొత్తులు వెలింగించి వారికి అంజలి ఘటించారు. తాడేపల్లి మండలం పెనుమాకలో దీక్షలు కొనసాగాయి. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, నీరుకొండ, నవులూరు గ్రామాలలో చేపట్టిన నిరసన దీక్షలు గురువారం 100వ రోజుకు చేరుకున్నాయి.  పలువురు రైతులు, మహిళలు ఇళ్ల వద్ద కూడా జై అమరావతి అంటూ నినాదాలిస్తూ నిరసన దీక్షలో పాల్గొన్నారు. అమరావతి ఉద్యమం 100వ రోజుకు గుర్తుగా ఇళ్ల ముందు ప్రత్యేక ముగ్గులు వేసి తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు, పలువురు రైతులు, మహిళలు, రైతు కూలీలు పాల్గొన్నారు. యువజన జేఏసీ కన్వీనర్‌ రావిపాటి సాయి ఆధ్వర్యంలో గుంటూరు జేకేసీ నగర్‌లో పోరులో అమరులైన రైతులు, రైతు కూలీలకు ఘన నివాళలర్పించారు. 

Updated Date - 2020-03-27T14:31:08+05:30 IST