బెంజ్‌-2 ఫ్లై ఓవర్‌కు సామర్థ్య పరీక్షలు

ABN , First Publish Date - 2021-10-25T06:26:13+05:30 IST

బెంజ్‌సర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌కు సామర్థ్య పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి.

బెంజ్‌-2 ఫ్లై ఓవర్‌కు సామర్థ్య పరీక్షలు
ఫ్లై ఓవరపై లోడ్‌ లారీలు

రెండు పాయింట్లలో 400 మెట్రిక్‌ టన్నుల లోడ్‌తో పరీక్షలు 

నెలాఖరుకు ఫ్లై ఓవర్‌ పూర్తి

నవంబర్‌ 5న ఎన్‌హెచ్‌కు.. 14న ప్రారంభోత్సవం 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బెంజ్‌సర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌కు సామర్థ్య పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) పర్యవేక్షణలో కాంట్రాక్టు సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రా ఫ్లై ఓవర్‌పై రెండు చోట్ల ఈ పరీక్షలను ప్రారంభించారు. జ్యోతి కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద, బెంజ్‌సర్కిల్‌ వద్ద ఎనిమిది భారీ టిప్పర్లను దాదాపు నాలుగు వందల మెట్రిక్‌ టన్నుల లోడ్‌తో ఉంచారు. జ్యోతి కన్వెన్షన్‌ దగ్గర నాలుగు, బెంజ్‌సర్కిల్‌ దగ్గర నాలుగు భారీ టిప్పర్లను నిలిపారు. ఈ పరీక్షలు వారం పాటు జరిగే అవకాశం ఉంది. ముందుగా స్పాన్‌ గేజ్‌ను నమోదు చేశారు. తర్వాత నాలుగు రోజుల పాటు కుంగుదలను పరీక్షిస్తారు. ఆ తర్వాత గేజ్‌ లో నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే మార్పులు సంభవిస్తే సామర్థ్య పరీక్షలు విజయవంతం అయినట్టు భావించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలన్నీ ఎన్‌హెచ్‌ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. 


నవంబర్‌ 14న ప్రారంభోత్సవం  

బెంజ్‌సర్కిల్‌ - 2 ఫ్లై ఓవర్‌ను నవంబర్‌ ఐదో తేదీన అప్పగిస్తామని కాంట్రాక్టు సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రా జాతీయ రహదారుల సంస్థకు నివేదించింది. ఈలోపు ట్రయల్‌ రన్‌ కూడా పూర్తవుతుంది కాబట్టి, ఫ్లై ఓవర్‌ను అధికారికంగా నవంబర్‌ 14వ తేదీన ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని ఎన్‌హెచ్‌ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. 

Updated Date - 2021-10-25T06:26:13+05:30 IST